గాయకుడి మరణం కూడా ఎన్నికల 'హామీ' అయింది!
అయితే.. దీనికి భిన్నంగా ఫస్ట్ టైమ్ దేశంలో ఏ రాజకీయాలకు.. ఏ పార్టీకి.. ఏమతానికి, కులానికి కూడా సంబంధం లేదని ఓ `గాయకుడి మరణం` ఎన్నికల హామీగా ముందుకు వచ్చింది.
By: Garuda Media | 6 April 2026 1:34 AM ISTకాదేదీ కవితకనర్హం.. అని అన్నట్టుగా ఎన్నికల రాజకీయాల్లో పార్టీలు ఇచ్చే హామీలు కూడా ఇలానే ఉన్నాయి. అసలు రాజ కీయాలతో సంబంధం లేని వ్యక్తులు.. ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి పరిమితం కాని.. వ్యక్తులను, కళాకారులను కూడా రాజకీ య ఎన్నికల హామీగా మార్చుకుంటున్నారు. వాస్తవానికి ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకుల అవినీతి, అక్రమాలపై విచారణ చేయిస్తామని పార్టీలు హామీలు ఇస్తుంటాయి. లేదా.. మరింత మెరుగైన పాలన అందిస్తామని చెబుతాయి.
అయితే.. దీనికి భిన్నంగా ఫస్ట్ టైమ్ దేశంలో ఏ రాజకీయాలకు.. ఏ పార్టీకి.. ఏమతానికి, కులానికి కూడా సంబంధం లేదని ఓ `గాయకుడి మరణం` ఎన్నికల హామీగా ముందుకు వచ్చింది. ఆయనకు అభిమానులను తమవైపు తిప్పుకొనే రాజకీయ వ్యూహంలో భాగంగానే ఇలా హామీ ఇస్తున్నారన్న విమర్శలు హోరెత్తుతున్నాయి. ఈ హామీని వెనక్కి తీసుకోవాలని.. దీనిని రాజకీయంగా వాడుకోవద్దని ఆ గాయకుడి అభిమానులు ముక్తకంఠంతో కోరుతున్నారు. అంతేకాదు.. ఇన్నాళ్లు ఏం చేశారంటూ నిప్పులు చెరుగుతున్నారు.
అసలు విషయం ఏంటి?
ప్రస్తుతం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రం అస్సాంలో ఈ నెలలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక్కడ 126 స్థానాలు ఉన్నాయి. ఈక్రమంలో ఇక్కడ అధికారంలోకి వచ్చేందుకు అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రయత్నిస్తు న్నాయి. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆదివారం నిర్వహించిన ప్రచారంలో ప్రముఖ గాయకుడు, బహుభాషా జ్ఞానిగా పేరొందిన `జుబిన్ గార్గ్` మరణాన్ని ఎన్నికల అస్త్రంగా మలుచుకున్నారు. తాము అధికారంలోకి వస్తే.. జుబిన్ గార్గ్ మరణం వెనుక ఉన్న శక్తులను 100 రోజుల్లోనే బయటకు తీసుకువచ్చి జైలుకు పంపిస్తామన్నారు.
వాస్తవం ఏంటి?
వాస్తవం ఏంటంటే.. 52 ఏళ్ల జుబిన్‌గార్గ్.. మేఘాలయలో జన్మించి.. అస్సాం యువతిని వివాహం చేసుకున్నారు. ఆయన ప్రపంచ ప్రశిద్ధి చెందిన గాయకుడు. మన హైదరాబాద్‌లోనూ తెలుగు సంగీత విభావరి నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషల్లోనూ ఆయన పాటలు పాడారు. అయితే.. గత ఏడాది సెప్టెంబరులో ఆయన సింగపూర్‌లో పర్యటిస్తున్నప్పుడు సముద్రంలో స్క్యూబా డైవింగ్ చేస్తున్న సమయంలో ఊపిరాడక మృతి చెందారు. అనంతరం.. ఆయన మృత దేహాన్ని అస్సాంకు తీసుకువచ్చారు. ఈ సమయంలో ప్రపంచ దేశాల నుంచి కూడా ప్రతినిధులు వచ్చి ఆయన కు నివాళులర్పించారు. ఇక, అస్సాం మొత్తం కన్నీరు పెట్టింది.
అంతగా ప్రజాభిమానాన్ని సొంతం చేసుకోవడానికికారణం.. ఆయన ఏ మతానికి చెందిన, ఏ కులానికి చెందిన వ్యక్తిగా ప్రకటించక పోవడం.. సర్వమానవ మతమే తన మతమని ప్రకటించడం.! ఇప్పుడు జుబిన్ గార్గ్ అభిమానులను.. ఆయనకు ఉన్న ఆదరణను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. అసలు రాజకీయాలతో సంబంధం లేనిగర్గ్ మరణంపై ఎన్నికల హామీ ఇవ్వడం ఏంటని నిలదీస్తున్నారు. అంతేకాదు.. ఆయన మృతి చెంది దాదాపు 6 మాసాలు అయిన తర్వాత.. రాహుల్ స్పందించడం ఏంటని నిప్పులు చెరుగుతున్నారు.
