రాహుల్ జీ మీరే స్పూర్తి అంటున్న యువతి !
బీహార్ రాష్ట్ర పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ అక్కడ ఏర్పాటు చేసిన మహిళా సంవద్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
By: Tupaki Desk | 8 Jun 2025 9:19 AM ISTరాహుల్ గాంధీది రాజకీయ కుటుంబం. గాంధీల వంశంలో అయిదవ తరం వారసుడు. రెండు దశాబ్దాలకు పైగా ఎంపీగా ఉంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని నిర్వహించారు. ప్రస్తుతం లోక్ సభలో లీడర్ ఆఫ్ అపొజిషన్ గా కేబినెట్ ర్యాంక్ హోదాతో ఉంటున్నారు.
రాహుల్ గాంధీ పప్పు అన్న ప్రత్యర్ధుల సెటైర్లను తట్టుకుంటూ మెల్లగా రాటు దేలారు. భారత్ జోడో యాత్రని నిర్వహించడం ద్వారా ఆయన మరింతగా ఎదిగారు. ఆయన యువతరానికి ప్రతినిధిగా నిలుస్తున్నారు. దాంతో ఆయనకు యూత్ ఫేవర్స్ ఎక్కువగా ఉన్నారు.
ఇక రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళినా యువతతో ముచ్చటిస్తారు. అయితే ఆ మీటింగ్స్ లో రాహుల్ నే యువత ప్రశ్నించే ప్రశ్న కామన్ గా ఒకటి ఉంటుంది. అదే రాహుల్ గాంధీ ఎపుడు పెళ్ళి చేసుకుంటారు అని. 55 ఏళ్ల వయసు ఉన్న రాహుల్ గాంధీకి ఇంకా పెళ్ళి వయసు ఉందని యువత భావిస్తారు అంటే అది ఆయన గ్లామర్ రహస్యం.
అయితే యువత సంధించే ఈ తరహా ప్రశ్నలను రాహుల్ గాంధీ ఎంతో చాకచక్యంగా సమాధానం ఇస్తూ తప్పించుకుంటారు. పెళ్ళికి నో అని చెప్పరు. అలాగని అవును అని కూడా చెప్పరు. ఇదిలా ఉంటే తాజాగా బీహార్ టూర్ లో రాహుల్ కి మరో విచితమైన అనుభవం ఎదురైంది.
ఇది కూడా పెళ్ళికి సంబంధించినదే కానీ రాహుల్ పెళ్ళి విషయం మాత్రం కాదు. పైగా రాహుల్ కి జై అంటూ ఒక యువతి పెళ్ళి కాకుండా మీలాగే ఉంటాను అని చెప్పి ఆశ్చర్యపరచింది. తనకు రాహుల్ గాంధీ స్పూర్తిదాయకం అని చెప్పి ఆయననే విస్మయపరచింది. ఇంతకీ ఆ యువతి ఏమంది ఏమా కధ అంటే విషయం చాలానే ఉంది.
బీహార్ రాష్ట్ర పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ అక్కడ ఏర్పాటు చేసిన మహిళా సంవద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ హాజరైన యువతతో ఆయన ముచ్చట్లు పెట్టారు. అయితే రాహుల్ గాంధీతో రియా పాశ్వాన్ అనే యువతి మాట్లాడుతూ పెళ్ళి గురించిన మాటలతో ఆయనతో పాటు అందరికీ షాక్ ఇచ్చేసింది. దాంతో ఇవన్నీ సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో అంతా వాటిని ఆసక్తిగా చూస్తున్నారు.
మీలాగే నేను కూడా పెళ్ళి చేసుకోను అంటూ రియా పాశ్వాన్ ఒక బలమైన స్టేట్మెంట్ నే పాస్ చేసింది. మీ స్పూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చాను అందువల్ల మీలాగే పెళ్ళి అన్న జంజాటం పెట్టుకోకుండా ప్రజల కోసం పనిచేస్తాను అని చాలా స్పష్టమైన వైఖరితో చెప్పిన మాటలు విని రాహుల్ కూడా ఒకింత ఆశ్చర్యపోయారు.
రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలని రియా పాశ్వాన్ గట్టిగా కోరుకుంటున్నారు. ఈ రోజుకు కూడా రాజకీయాల్లోకి వచ్చే మహిళల శాతం తక్కువగా ఉందని ఆమె అంటూ తాను మాత్రం పూర్తి జీవితం రాజకీయాలకే అంకితం చేస్తాను అని స్పష్టం చేసింది. ఇక రాహుల్ గాంధీలా పెళ్ళి చేసుకోను అని ఆమె అన్న మాటలు అయితే చర్చనీయాంశం అవుతున్నాయి.
రాహుల్ గాంధీ ఈ విధంగా యువతకు స్పూర్తిదాయకంగా ఉంటున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. నిజానికి రాహుల్ గాంధీ తన ప్రజా జీవితానికి పెళ్ళి అడ్డు అని ఎపుడూ ప్రకటించలేదు. పెళ్ళి గురించి ఆయన వ్యతిరేకంగానూ లేరు. అలాగే సానుకూలంగానూ లేరు అని చెబుతారు. కానీ రాజకీయాల్లో ప్రజా సేవలో తరించాలి అంటే రాహుల్ గాంధీలా పెళ్ళి చేసుకోకుండా ఉండాలని యువత అనుకుంటోందన్నది రియా పాశ్వాన్ మాటలలో వ్యక్తం అవుతోంది. సో రాహుల్ ఈ విధంగా దేశంలోని యువతకు ప్రేరణగా నిలుస్తున్నరు అన్న మాట. ఏదైనా వెరీ గుడ్. ఇలాగే కానీయ్ యూత్ అనాల్సిందే మరి.
