Begin typing your search above and press return to search.

ఓట్‌ అధికార్‌ యాత్ర...రాహుల్ మార్క్ యాత్ర

రాహుల్ గాంధీ చేపడుతున్న ఓట్‌ అధికార్‌ యాత్రను దేశమంతా సాగేలా ఒక భారీ ప్రోగ్రాం నే రూపొందిస్తున్నారు.

By:  Tupaki Desk   |   15 Aug 2025 9:12 AM IST
ఓట్‌ అధికార్‌ యాత్ర...రాహుల్ మార్క్ యాత్ర
X

యాత్రలు బహు విధాలు. పాదయాత్రలు రధయాత్రలు ఇవన్నీ జనాలు చూసారు. ఇపుడు మరో యాత్రని చూడబోతున్నారు. దాని పేరే ఓట్‌ అధికార్‌ యాత్ర. ఇది రాహుల్ ఆయన యాత్రకు పెట్టిన కొత్త పేరు. ఓటు అధికార్ యాత్రకు వేదిక కూడా కరెక్ట్ గానే ఎంచుకున్నారు. కొద్ది నెలలలో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దాంతో అక్కడ నుంచే ఓట్‌ అధికార్‌ యాత్రను ప్రారంభించడానికి రాహుల్ నిర్ణయించారు.

దేశమంతా యాత్ర :

రాహుల్ గాంధీ చేపడుతున్న ఓట్‌ అధికార్‌ యాత్రను దేశమంతా సాగేలా ఒక భారీ ప్రోగ్రాం నే రూపొందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ దీని కోసం పెద్ద ఎత్తున కసరత్తుని చేస్తోంది. ఓటు చోరీ అంటూ ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి ఒక్కసారి దేశం మొత్తం తన వైపే చూసేలా ఫోకస్ పెంచేసారు. ఆ తర్వాత పార్లమెంట్ నుంచి ఈసీ ఆఫీస్ దాకా వందలాది ప్రతిపక్ష ఎంపీలతో భారీ ర్యాలీ కూడా చేపట్టారు. ఇపుడు ఇదే విషయం మీద దేశవ్యాప్తంగా డిబేట్ జరిగేలా చేసేందుకు ఓట్‌ అధికార్‌ యాత్రను వాడవడలా చేపట్టాలని భారీ కార్యాచరణ ప్రణాళికనే సిద్ధం చేశారు.

టార్గెట్ క్లారిటీగానే :

ఇదిలా ఉంటే బీహార్ లో కేవలం రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. అయ్హితే ఆ ఎన్నికల క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను చేపట్టింది. ఈ సవరణ ద్వారా బీజేపీ తమ అనుకూల ఓట్లను పెంచుకోవడంతో పాటు విపక్షాల ఓట్లను తొలగిస్తోంది అన్నది కాంగ్రెస్ సహా విపక్షాల తీవ్ర విమర్శగా ఉంది. దీని మీదనే పార్లమెంట్ వేదికగా పోరాటం కూడా చేసారు. దాదాపుగా వర్షాకాల సమావేశాలు మొత్తం ఇదే ఇష్యూతో సభను స్తభింపచేశారు. దాంతో ఇంత పెద్ద ఆందోళన జరిగిన దానికి కేంద్ర బిందువు అయిన బీహార్ నుంచే రాహుల్ గాంధీ ఓట్‌ అధికార్‌ యాత్రకి శ్రీకారం చుట్టబోతున్నారు.

ఓట్ల దొంగల ఓటమే లక్ష్యం :

ఇది ఒకరి సమస్య కాదు ఏ ఒక్కరికీ చెందినది కాదు, అందరి సమస్య అని రాహుల్ గాంధీ పిలుపు ఇస్తున్నారు. తాను చేస్తున్నది ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడడానికి అని అంటున్నారు. ఇది ఒక యుద్ధమని ఆయన చెబుతున్నారు. ఈ యుద్ధం లో ఒక మనిషికి ఒక ఓటు మాత్రమే ఉండాలని ఆయన నినదిస్తున్నారు. యువత కార్మికులు రైతులు ప్రతీ పౌరుడు ఈ ప్రజా ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని ఆయన కోరుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రజా స్వామ్యానిదే విజయం కావాలని ఓట్ల చోరీ చేసే వారు ఓటమి పాలు కావాలని ఆయన అంటున్నారు . ఈ నెల 17న బీహార్ నుంచి రాహుల్ గాంధీ ఓట్‌ అధికార్‌ యాత్ర మొదలుకాబోతోంది. మరి ఈ యాత్ర ఏ రకమైన రాజకీయ సంచలనాలు నమోదు చేస్తుందో చూడాల్సి ఉంది.