ట్రంప్ ‘నరేందర్ సరెండర్’ అనగానే మోడీ యుద్ధం ఆపేశాడు
ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
By: Tupaki Desk | 3 Jun 2025 9:44 PM ISTఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఉగ్రవాద దేశాన్ని అణచివేశామని అధికార పక్షం చెబుతుండగా, ప్రపంచ పటం నుండి ఉగ్రవాద పాకిస్తాన్ దేశాన్ని లేకుండా చేసే అవకాశాన్ని కోల్పోయామని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
మంగళవారం జరిగిన ఒక సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా 'ఆపరేషన్ సింధూర్'పై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. "ఎన్ని యుద్ధ విమానాలు కూలిపోయాయో చెప్పడం లేదు. ఎంతమంది ఉగ్రవాదులను మట్టుబెట్టారో వివరించడం లేదు. ఇలాంటి సమయంలో గెలిచామని చెప్పడం సరికాదు. వాస్తవానికి గెలిచే సమయంలో చేతులెత్తేశారు. నరేందర్ సరెండర్ అనగానే యుద్ధాన్ని ఆపేశారు. అమెరికా ఒత్తిడి వల్ల గెలిచే అవకాశాన్ని భారత్ కోల్పోయింది. ఇది దేశం సమస్య. ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. నేను నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అడుగుతున్నాను.. ఇలా ఎందుకు చేశారు? దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? ఎందుకు ఒత్తిడికి తలవంచారు? తలవంచాల్సిన అవసరం ఏం వచ్చింది? ఇలాంటి పరిస్థితి దేనికి మంచిది?" అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు దేశ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ఆపరేషన్ సింధూర్ సమయంలో కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీకి అన్ని పార్టీలు హాజరై, ప్రభుత్వ నిర్ణయాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చాయి. ఇటీవలి కాలంలో మన దేశం నుంచి మైనారిటీ ఎంపీలు ఇస్లామిక్ దేశాలలో పర్యటిస్తూ, పాకిస్తాన్ చేస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలను ప్రపంచ దేశాల ముందు ఎండగడుతున్నారు. ఆపరేషన్ సింధూర్ అర్ధాంతరంగా ముగిసిపోవడంతో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తన స్వరాన్ని పెంచింది. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటివారు తీవ్ర స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై మండిపడుతున్నారు.
ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రధానమంత్రిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసలు ఆపరేషన్ సింధూర్ ఎవరి ఒత్తిడి వల్ల నిలుపుదల చేశారో చెప్పాలని ప్రశ్నించారు. పాకిస్తాన్‌పై గెలిచే సమయంలో ఎందుకు తలవంచారో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వంటి వారు కూడా ఇదే స్థాయిలో నరేంద్ర మోడీని ప్రశ్నించడం గమనార్హం.