మా బావను వదిలేయండి అంటున్న రాహుల్ గాంధీ..
రీసెంట్ గా రాహుల్ గాంధీ తన భావను వేధించద్దని ట్వీట్ చేశాడు. ఈ వార్త ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
By: Tupaki Desk | 18 July 2025 1:19 PM ISTకేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి గాంధీ కుటుంబానికి చిక్కులు తప్పడం లేదు. ప్రతిపక్ష నాయకులను వేధించడమే ప్రభుత్వ లక్ష్యం అంటూ కాంగ్రెస్ గొంతు చించుకుంటున్నా లాభం లేకుండా పోతోంది. తనను, తన తల్లితో పాటు కుటుంబంలోని బంధువులను కూడా బీజేపీ ప్రభుత్వం వేధిస్తుందని రాహుల్ గాంధీ మండిపడుతున్నారు. రీసెంట్ గా రాహుల్ గాంధీ తన బావను వేధించద్దని ట్వీట్ చేశాడు. ఈ వార్త ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఎక్స్ లో ఆయన తన బావ అయిన రాబర్ట్ వాద్రాకు సంబంధించి ట్వీట్ చేశాడు. ‘నా బావను 10 ఏళ్లుగా ఈ ప్రభుత్వం వెంటాడుతోందని, ఇప్పుడు వేసిన చార్జిషీట్ వేధింపులలోని భాగమేనని’ విమర్శలు గుప్పించారు. ‘మా చెల్లి, బావ అయిన ప్రియాంక గాంధీ, రాబ్ట్ వాద్రా పై మరోసారి దురుద్దేశంతో కేసులు పెట్టారని, ఇలా చేస్తే కాంగ్రెస్ పార్టీ బలహీణ పడుతుందని వారి అనుకుంటున్నారని, అది ఎన్నటికీ జరగదన్నారు. వారికి నేను తోడుంటానని చెప్పారు.
గురుగ్రామ్ రియల్ ఎస్టేట్ ఒప్పందానికి సంబంధించి ఈడీ రాబర్ట్ వాద్రాపై మనీలాండరింగ్ కేసులో గురువారం (జూలై 17) మధ్యాహ్నం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్ దాఖలు చేసింది. అయితే ఈ కేసు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ వాద్రాకు మద్దతుగా నిలబడుతుంది. అయితే గురుగ్రామ్ రియల్ ఎస్టేట్ కు సంబంధించి ఎలాంటి చట్ట విరుద్ధమైన పనులకు పాల్పడలేదని, నిబంధనల మేరకే ఒప్పందం జరిగిందని ప్రధాన కార్యదర్శి రణ్ దీప్ సుర్జేవాలా విలేకరులతో మాట్లాడుతూ చెప్పడం కొసమెరుపు. భూములను కొనడం, అమ్మడం తప్పెలా అవుతుందని సుర్జేవాలా ప్రశ్నించారు.
ఇది వాద్రా, అతని కంపెనీ, స్కైలైట్ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించిన షేర్లని పేర్కొంది. ఫిబ్రవరి 2008లో గురుగ్రామ్ సెక్టార్ 83 లోని 3.53 ఎకరాల భూమికి సంబంధించి కేసు నమోదైంది. కొనుగోలు కోసం నకిలీ పత్రాలు ఉపయోగించారని ఈడీ ఆరోపిస్తుంది.
ఇందులో తను నేరం చేయలేదని, నిబంధనల మేరకు జరిగిందని, ఎలాంటి పదవులను, పార్టీని ఉపయోగించుకోలేదని వాద్రా చెప్పారు. ఏది ఏమైనా తమ ప్రభుత్వాలు ఉన్న సమయంలో తమ వారిని కాపాడుకోవడం. తమ ప్రభుత్వం ప్రతిపక్షంలో పడ్డ తర్వాత కుట్రలు అంటూ ఆరోపణలు చేయడం భారత రాజకీయ చట్రంలో జరుగుతున్న తతంగమే. బీజేపీ ప్రభుత్వంలో కొందరు నాయకులు అవినీతి పాల్పడిన వారు లేకపోలేదు. అయితే ఈ కేసు నుంచి రాబర్ట్ వాద్రా బయటపడతారా? వేచి చూడాలి.
