Begin typing your search above and press return to search.

సీఎం చేత పరుగులు తీయించటం బాగోలేదు రాహుల్?

నిజానికి ఇలాంటి వీడియోలతో సీఎం రేవంత్ ఇమేజ్ డ్యామేజ్ కావటమేకాదు.. రాహుల్ తీరును తప్పు పట్టటం ఖాయం.

By:  Tupaki Desk   |   27 April 2025 6:45 AM
సీఎం చేత పరుగులు తీయించటం బాగోలేదు రాహుల్?
X

కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరైన రాహుల్ గాంధీ మాటల్ని విన్నప్పుడు.. ఎంతటి పద్దతి ఉన్న మనిషి. మరెంత విలువల్ని పాటించే నేత అన్న భావన కలుగుతుంది. ఆ ఫీలింగ్ మనసుకు పచ్చిగా ఉన్నంతనే.. ఆయన చెప్పే మాటలకు చేసే చేష్టలకు సింక్ కానట్లుగా ఉండటం కనిపిస్తుంది. కార్యక్రమం ఏదైనా.. తాను మాట్లాడే ప్రతి చోట భావోద్వేగాలకు సంబంధించిన అంశాల్ని కచ్ఛితంగా ప్రస్తావించటం కనిపిస్తుంది. అలా అని అదేం చెడ్డగుణం కాదు. కాకుంటే.. మాటల్లో పలికే తీరుకు తగ్గట్లే.. చేతల్లోనూ ఉండాలి.

ఎంత జాతీయ పార్టీ కీలక నేత అయినప్పటికీ.. తన పార్టీకి చెందిన రాష్ట్ర ముఖ్యమంత్రిని పరుగులు తీయించేలా చేయకూడదు. ఒకవేళ.. రాహుల్ గాంధీ ప్రమేయం లేకుండానే.. ముఖ్యమంత్రి రేవంత్ హడావుడిగా పరుగులు తీస్తుంటే.. అలా చేయొద్దంటూ అడ్డుకోవాలి కదా? అందుకు భిన్నంగా రాహుల్ తో పాటు నడిచేందుకు రేవంత్ పరుగులు తీయాల్సిన పరిస్థితి చూసేందుకు బాగోదు కదా? మిగిలిన అంశాలు ఎలా ఉన్నా.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నప్పుడు ఆ హోదా.. దానికి ఉండే ఇమేజ్ డ్యామేజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం రాహుల్ గా ఉంటుంది కదా?

భారత్ సమ్మిట్ లో పాల్గొనేందుకు వచ్చిన రాహుల్ గాంధీ.. తనతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ను ఉంచేసుకున్నారు. నిజానికి అదేం తప్పు పని కాదు. కాకుంటే.. తన పార్టీకి చెందిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తానెంత రిమోట్ తో కంట్రోల్ చేస్తున్నా.. అదంతా లోలోపల ఉండాలే తప్పించి.. బయటకు బాహాటంగా కనిపించకూడదు.శనివారం హైదరాబాద్ పర్యటన సందర్భంగా రాహుల్ తో పాటు నడిచేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆసక్తి ప్రదర్శించటం.. రాహుల్ వేగాన్ని అందుకునేందుకు వీలుగా ముఖ్యమంత్రి రేవంత్ పరుగు పరుగున ఆయన పక్కన నడవటం కనిపిస్తుంది. తన ముందు ఉన్న సీనియర్ నేత జగ్గారెడ్డి భుజం మీద చేయి వేయటం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

నిజానికి ఇలాంటి వీడియోలతో సీఎం రేవంత్ ఇమేజ్ డ్యామేజ్ కావటమేకాదు.. రాహుల్ తీరును తప్పు పట్టటం ఖాయం. ఇప్పటికే జాతీయ పార్టీల అహంకారం అన్న మాట ఉండనే ఉంది. ఇలాంటివేళలో.. మరింత అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర ప్రజల సెంటిమెంట్లు దెబ్బ తినకుండా తగిన రీతిలో ఉండాల్సి ఉంటుంది. అయితే.. తనకున్న పరిమితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ పరుగులు తీయొచ్చు.కానీ.. ఇలాంటివి చూసేందుకు నప్పవు సరి కదా.. విలువలు బోదించే రాహుల్ తన పార్టీ ముఖ్యమంత్రి చేత ఇలా చేయించటం ఏమిటి? అన్న ప్రశ్న తెర మీదకు వస్తుంది. విలువలు బోధించే రాహుల్.. ఇలాంటి తీరును గుర్తించి.. తగిన జాగ్రత్తలు చెప్పాలి. సీఎం హోదాను.. ఆయనకుండే గౌరవ మర్యాదలు గ్రాము కూడా తగ్గని రీతిలో కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. మరి.. ఇలాంటివి రాహుల్ ఎరుకలోకి ఎప్పుడు వస్తాయో?