Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురు చేతుల్లో రాహుల్ భవిష్యత్తు?

ఇందుకోసం ఈ మూడు రాష్ట్రాల్లో అనుసరించిన వ్యూహాన్నే ఉత్తరాదిలో పాటించాలని భావిస్తోందని అంటున్నారు.

By:  Tupaki Political Desk   |   12 Jun 2026 7:00 PM IST
ఆ ముగ్గురు చేతుల్లో రాహుల్ భవిష్యత్తు?
X

కాంగ్రెస్ రాజకీయాలు జాతీయస్థాయిలో ఆసక్తి రేపుతున్నాయి. వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే మున్నెన్నడూ లేనంతగా ప్రాంతీయ నాయకత్వం ఆధారపడుతున్న సంకేతాలు చర్చకు దారితీస్తున్నాయి. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ముఖ్యనాయకుల వ్యూహాలే జాతీయ నాయకత్వానికి దిక్సూచిగా మారుతున్నాయా? అనే సందేహాలకు తావిస్తున్నాయి. అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలనే కాంగ్రెస్ చిరకాల వాంఛ నెరవేరాలన్నా, దేశవ్యాప్తంగా పార్టీ మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకోవాలన్నా... దక్షిణాదికి చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్, కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

ఉత్తరాదిలో చరిష్మా తగ్గి, ప్రాంతీయ పార్టీల నీడలో బతుకుతున్న కాంగ్రెస్‌కు ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలే ఐసీయూలో ఆక్సిజన్ సిలిండర్లుగా మారాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ ప్రాధాన్యం బాగా పెరిగిందన్న సంకేతాలు అందుతున్నాయని అంటున్నారు. అదే సమయంలో పార్టీకి వ్యూహాకర్తగా పనిచేస్తున్న సునీల్ కనుగోలు సామర్థ్యంపైనా కాంగ్రెస్ గట్టి నమ్మకం పెట్టుకుందని విశ్లేషిస్తున్నారు. 12 ఏళ్లుగా పరాజయాల పరంపరతో తీవ్ర ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ పార్టీకి దక్షిణాదిలో కాస్త ఓదార్పు దక్కిందంటే ఈ ముగ్గురి జోడీనే కారణమని అంటున్నారు. వరుసగా కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో గెలిచిన జోష్ తో ఉన్న కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మరింత బలపడాలని చూస్తోందని, ఇందుకోసం ఈ మూడు రాష్ట్రాల్లో అనుసరించిన వ్యూహాన్నే ఉత్తరాదిలో పాటించాలని భావిస్తోందని అంటున్నారు.

రేవంత్ రెడ్డి లాంటి ఫైర్ బ్రాండ్స్ కావాలి

తెలంగాణలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ను గద్దె దించి, ఒంటిచేత్తో పార్టీని అధికారంలోకి తెచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పుడు కాంగ్రెస్ జాతీయ శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపుతున్నారు. దూకుడు రాజకీయంతో బీజేపీ జాతీయ నేతలను సైతం ఢీకొట్టగల వాగ్ధాటితో రేవంత్ రెడ్డి ఆకట్టుకుంటున్నారని అంటున్నారు. ఆయన మాస్ అప్పీల్ కార్యకర్తలను ఆకర్షిస్తుండటంతో ఇతర రాష్ట్రాల్లోనూ రేవంత్ రెడ్డి లాంటి నాయకత్వాన్ని ప్రోత్సహించాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం భావిస్తోందని చెబుతున్నారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డిని స్టార్ క్యాంపెయినర్‌గా వాడుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. ఆయన హిందీ, ఇంగ్లీష్‌ ప్రసంగాల పరిమితులను అధిగమించి, తన బాడీ లాంగ్వేజ్ తో క్యాడర్‌లో ఉత్సాహం నింపగలరని హైకమాండ్ నమ్ముతోందని అంటున్నారు.

నయా చాణక్యుల కోసం వేట

ఇటీవలే కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డి.కె. శివకుమార్ కాంగ్రెస్ పార్టీకి కేవలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే కాకుండా, ఆపద సమయంలో జాతీయ స్థాయి 'ట్రబుల్ షూటర్’గా సేవలు అందిస్తుంటారు. పార్టీ క్రమశిక్షణను తూ.చ.తప్పకుండా పాటించే శివకుమార్ లాంటి నాయకత్వాన్ని ప్రోత్సహించాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన చేస్తోందని అంటున్నారు. ఎన్నికల నిర్వహణ, సంక్షోభ సమయాల్లో ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో డీకేఎస్ వ్యూహాలు తిరుగులేనివిగా చెబుతారు. దీంతో పార్టీలోని ఇతర నేతలు ఆయనను చూసి నేర్చుకోవాలని అధిష్టానం సూచనలు చేస్తోందని చెబుతున్నారు. అంతేకాకుండా కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు, రాబోయే లోక్‌సభ ఎన్నికలకు అవసరమైన భారీ వనరులను సమకూర్చడంలో, దక్షిణాదిలో పార్టీ పట్టును మరింత బలోపేతం చేయడంలో డీకేకు కీలక పాత్ర అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది.

తెరవెనుక సూత్రధారి

కర్ణాటక, తెలంగాణ విజయాలతోపాటు ఇటీవలి కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ సాధించిన ఘన విజయం వెనుక నిశ్శబ్దంగా పనిచేసిన మాస్టర్ మైండ్ సునీల్ కనుగోలు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు రూట్‌మ్యాప్ గీసింది కూడా ఈయనే అంటున్నారు. భావోద్వేగాలను, క్షేత్రస్థాయి గ్రౌండ్ రిపోర్టులను నమ్ముకుని సునీల్ వేసే స్కెచ్‌లు కాంగ్రెస్‌కు అస్త్రాలుగా మారుతున్నాయని చెబుతున్నారు. దీంతో లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగే పంజాబ్ వంటి కీలక రాష్ట్రాల్లో ఎన్నికల వ్యూహాలను రూపొందించే బాధ్యతను హైకమాండ్ ఈయనకు అప్పగించిందని చెబుతున్నారు. కేరళ మోడల్‌ తరహాలోనే సమన్వయంతో ఇతర రాష్ట్రాలను గెలిపించడం ద్వారా లోక్‌సభ సమరానికి ముందే కాంగ్రెస్‌కు క్లీన్ ఇమేజ్ తెచ్చేలా సునీల్ కనుగోలుకు లక్ష్యం నిర్దేశించారని అంటున్నారు.

ఉత్తరాది బెల్ట్‌లో తీవ్రమైన సవాల్‌ను ఎదుర్కొంటోన్న కాంగ్రెస్ పార్టీ ఈ ముగ్గురిపై భారీ ఆశలే పెట్టుకుందని చెబుతున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ మాదిరిగా ఇతర రాష్ట్రాల్లో నాయకత్వాన్ని తయారు చేయడంపై ప్రత్యేకంగా ఫోకస్ చేసిందని అంటున్నారు. ఇందుకోసం సునీల్ కనుగోలు టీంకి కీలక బాధ్యతలు అప్పగిస్తోందని ప్రచారం జరుగుతోంది. దక్షిణాది ఫార్ములాను ఉత్తరాదిలో సక్సెస్ పుల్ గా అమలు చేయగలిగితే రాహుల్ గాంధీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టడం పెద్ద కష్టమేమీ కాదని కాంగ్రెస్ భావిస్తోందని అంటున్నారు. మరి కాంగ్రెస్ వ్యూహం ఎంతవరకు సక్సెస్ అవుతుందో కాలమే చెప్పాలని అంటున్నారు.