Begin typing your search above and press return to search.

అదో నీచ పదం.. వాడొద్దు ప్లీజ్! రాహుల్ గాంధీకి ఎన్నికల కమిషన్ సూచన

‘ఓటు చోర్’ అంటూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఆందోళనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

By:  Tupaki Desk   |   15 Aug 2025 2:13 PM IST
అదో నీచ పదం.. వాడొద్దు ప్లీజ్! రాహుల్ గాంధీకి ఎన్నికల కమిషన్ సూచన
X

‘ఓటు చోర్’ అంటూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఆందోళనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నిక కమిషన్ పై పోరాటానికి రాహుల్ తోపాటు ప్రతిపక్షానికి సరైన ఆయుధం లభించిందని చెబుతున్నారు. ఈ క్రమంలో రాహుల్ ఆందోళనలకు ప్రజల నుంచి సానుకూల స్పందన కనిపిస్తోందని ప్రచారం జరుగుతోంది. అయితే తన ఉద్యమానికి రాహుల్ ‘ఓటు చోర్’ అని నామకరణం చేయడంపై ఎన్నికల కమిషన్ (ఈసీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. అదో నీచ పదం.. వాడొద్దు ప్లీజ్ అంటూ ప్రతిపక్ష నేతకు సూచించింది. దీంతో రాహుల్ చేపట్టిన ఉద్యమం ఎన్నికల కమిషన్ పై ఏ స్థాయిలో ఒత్తిడి తీసుకువస్తుందో అర్థమవుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

బిహార్ ఎన్నికల వేళ రాహుల్ గాంధీ కేంద్రం, ఎన్నికల కమిషన్ ను ఇరుకన పెట్టేందుకు ఓటు చోర్ ఉద్యమాన్ని సరైన అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు. బిహార్ లో ఈ ఏడాది నవంబరులో ఎన్నికలు జరగనుండగా, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ఈసీ చేపట్టింది. దాదాపు 7.5 కోట్ల ఓట్లలో సుమారు 65 లక్షల ఓట్లు తొలగించింది. అయితే ఎన్నికల సంఘం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో చేతులు కలిపి అర్హుల ఓటర్లు తొలగించారని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. కర్ణాటకలో కూడా గత పార్లమెంటు ఎన్నికల్లో ఈ విధంగా ఓటు చోరీ చేశారని ఇటీవల బెంగళూరులో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆరోపించారు. దీంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. మరోవైపు బిహార్ లో కొందరి ఓట్లు మరణించారన్న కారణంతో తొలగించారని, అలా మరణించిన వారితో కలిసి టీ తాగానంటూ రాహుల్ ఒక ఫొటోను విడుదల చేశారు. దీంతో బిహార్ ఓట్ల సవరణ కార్యక్రమంలో లొసుగులు చోటుచేసుకున్నాయని ప్రతిపక్షం బలమైన ఆరోపణలు చేస్తోంది. అంతేకాకుండా తమ పోరాటానికి ఓట్ చోర్, గద్దీ ఛోడ్" (ఓట్ల దొంగ, అధికారం వదిలిపెట్టు) అనే నినాదాలు జత చేస్తూ అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో విపక్ష నేత రాహుల్ స్పీడుకు బ్రేకులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వంతోపాటు ఈసీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రం ఎదురుదాడిని, ఈసీ నోటీసులను లెక్క చేయని రాహుల్ తన పోరాటాన్ని మరింత ఉదృతం చేయడంతో ఈసీ కాస్త వెనక్కి తగ్గిందని అంటున్నారు. ప్రతిపక్ష నేతగా ఉద్యమించడం రాహుల్ హక్కుగా భావిస్తున్న ఈసీ.. రాహుల్ పోరాటానికి ఎంచుకున్న పేరును మార్చాలని ప్రాధేయపడుతోంది. ‘‘ఎవరైనా రెండు సార్లు ఓటు వేశారనడానికి ఆధారాలు ఉంటే, ప్రమాణ పత్రంతో సమర్పించండి. అంతేగాని ఓటు చోర్ వంటి నీచ పదాన్ని వాడొద్దు’’ అంటూ రాహుల్ కు నోటీసులిచ్చింది. దీంతో రాహుల్ ఉద్యమం ఈపీపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నట్లు అర్థమవుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

‘ఓటు చోర్’ అన్న పదం వాడొద్దని ఎన్నికల కమిషన్ ప్రతిపక్ష నేతను కోరడం ఆసక్తికరమని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ప్రతిపక్షం ‘ఓటు చోర్’ అని చెప్పడాన్ని తప్పుపడుతున్న ఈసీ, తన వాదనకు మద్దతుగా పలు తీవ్ర వ్యాఖ్యలు జోడించింది. 1951 నుంచి ఒక వ్యక్తి-ఒక ఓటు చట్టం అమల్లో ఉందని గుర్తు చేసింది. కోట్ల మంది ఓటర్లు, లక్షల మంది ఎన్నికల సిబ్బందిని ‘ఓటు దొంగలు’ అని పిలవడం వారి గౌరవంపై దాడి చేయడమేనని ఈసీ వ్యాఖ్యానించింది. అయితే ఈసీ ప్రకటనను కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షం కొట్టిపడేస్తోంది. తాము ‘ఓటు చోర్’ అన్నది ఓటర్లు, ఎన్నికల సిబ్బందిని ఉద్దేశించి కాదని కాంగ్రెస్ చెబుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఓటు చోరీతో అధికారంలోకి వస్తుందని చెప్పడమే తమ ఉద్దేశమని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. బిహార్ లో ఓటు చోర్ జరగకుండా కాపాడుకునేందుకు తాము ఈ విషయంపై పోరాడుతున్నట్లు చెబుతున్నారు.

ఇక ‘ఓటు చోర్’పై పెద్ద పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ నెల 17 నుంచి తన పోరాటాన్ని మరింత తీవ్రం చేయనున్నారని కాంగ్రెస్ ప్రకటించింది. బిహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేలా ‘ఓటర్ అధికార్ యాత్ర’ నిర్వహించాలని రాహుల్ నిర్ణయించారు. వ్యూహాత్మకంగా తన ఉద్యమానికి బిహార్ కేంద్రంగా చేసుకోవాలని రాహుల్ భావించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. గతంలో జోడో యాత్ర చేపట్టిన రాహుల్ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారు. దీనిఫలితంగా గత ఎన్నికల్లో గణనీయమైన ఫలితాలు సాధించారు. విజయం ముందు చతికిల పడినా ఆ యాత్ర అనుభవాలు రాహుల్ గాంధీ పనితీరులో స్పష్టమైన మార్పు తీసుకు వచ్చిందని చెబుతున్నారు. ఇక ప్రస్తుతం ఓటర్ అధికార యాత్ర, ఓటు చోర్ అన్న కార్యక్రమాల ద్వారా రాహుల్ చేస్తున్న ప్రయత్నం ఆసక్తికరంగా మారింది. దీని ఫలితంపై ఉత్కంఠ నెలకుంటుంది. ఎన్నికల కమిషన్ సైతం ఓటు చోర్ అన్న పదం వాడటాన్ని జీర్ణించుకోలేతున్నామని పరోక్షంగా చెప్పడం ఈ సందర్భంగా చర్చనీయాంశంగా మారింది.