పార్లమెంట్‌లో మళ్లీ సమరం.. రాహుల్ సభ్యత్వం రద్దుకై తీర్మానం
భారత పార్లమెంటరీ చరిత్రలో అరుదుగా వినిపించే 'స్వతంత్ర తీర్మానం' ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
By: Raja Ch | 12 Feb 2026 3:26 PM ISTభారత రాజకీయ యవనికపై మరో కీలక అంకం మొదలైంది. గతంలో అనర్హత వేటుతో మొదలైన రాజకీయ యుద్ధం ఇప్పుడు 'స్వతంత్ర తీర్మానం' రూపంలో కొత్త మలుపు తిరిగింది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన నిర్ణయంతో లోక్‌సభలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
లోక్‌సభలో స్వతంత్ర తీర్మానం
భారత పార్లమెంటరీ చరిత్రలో అరుదుగా వినిపించే 'స్వతంత్ర తీర్మానం' ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే స్పీకర్‌కు నోటీసు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సాధారణంగా ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులు కాకుండా ఒక సభ్యుడు స్వయంగా ఏదైనా అంశంపై నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఇచ్చే ప్రతిపాదనను ఈ తీర్మానంగా పరిగణిస్తారు. ఇది ఆషామాషీ వ్యవహారం కాదు.. దీని వెనుక లోతైన రాజ్యాంగపరమైన వ్యూహాలు ఉన్నట్లు కనిపిస్తోంది.
ఏంటీ 'స్వతంత్ర తీర్మానం'?
పార్లమెంటు నిబంధనల ప్రకారం అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశాలను చర్చకు తెచ్చేందుకు దీనిని ఉపయోగిస్తారు. ఇది ప్రభుత్వం తరపున వచ్చే తీర్మానం కాదు. ఒక ఎంపీ వ్యక్తిగత హోదాలో స్పీకర్‌కు ప్రతిపాదన పంపుతారు. కేవలం చర్చ కోసం కాకుండా ఒక నిర్దిష్ట నిర్ణయాన్ని సభ్యత్వ రద్దు వంటివి తీసుకోవాలని ఈ తీర్మానం కోరుతుంది. స్పీకర్ అనుమతిని బట్టి దీనిపై సభలో సుదీర్ఘ చర్చ జరగడమే కాకుండా చివరలో ఓటింగ్ నిర్వహించే అవకాశం కూడా ఉంటుంది. ఈ తీర్మానాన్ని సభ ముందు ఉంచాలా లేదా అన్నది పూర్తిగా లోక్‌సభ స్పీకర్ విచక్షణపై ఆధారపడి ఉంటుంది.
రాజకీయ ప్రతీకారమా? నియమావళి అమలునా?
ఈ పరిణామంపై రాజకీయ విశ్లేషణలు భిన్నంగా ఉన్నాయి. "రాహుల్ గాంధీ నిరంతరం నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, సభ హుందాతనాన్ని దెబ్బతీస్తున్నారని అందుకే ఈ చర్య అవసరమని బీజేపీ వర్గాలు వాదిస్తున్నాయి. అయితే దీనిని విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నంగా రాజకీయ ప్రతీకార చర్యగా కాంగ్రెస్ అభివర్ణిస్తోంది. ఇప్పటికే పలు అంశాలపై పార్లమెంట్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు రాహుల్ సభ్యత్వ రద్దు అంశం తెరపైకి రావడంతో సభలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.
స్పీకర్ నిర్ణయంపైనే సర్వత్రా ఉత్కంఠ
ప్రస్తుతం బంతి స్పీకర్ కోర్టులో ఉంది. నిషికాంత్ దూబే పంపిన ఈ స్వతంత్ర తీర్మానాన్ని స్పీకర్ ఆమోదిస్తారా? లేక తిరస్కరిస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ స్పీకర్ దీనికి పచ్చజెండా ఊపితే
సభలో రాహుల్ గాంధీ ప్రవర్తన లేదా సభ్యత్వంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మెజారిటీ సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తే, రాహుల్ సభ్యత్వానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఇది దేశవ్యాప్త నిరసనలకు లేదా న్యాయపోరాటాలకు దారితీయవచ్చు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంపీల సభ్యత్వం రద్దు అనే అంశం ఎప్పుడూ సెన్సిటివ్ సబ్జెక్టే. రాహుల్ గాంధీ విషయంలో మళ్లీ అటువంటి ప్రయత్నం జరగడం భవిష్యత్ రాజకీయ సమీకరణాలను మార్చేలా ఉంది. పార్లమెంట్ వేదికగా సాగే ఈ 'చదరంగం'లో గెలుపెవరిదో వేచి చూడాలి.
