అదానీ-అంబానీల ఆర్థిక వ్యవస్థ కూలిపోవడం ఖాయం! మోదీపై రాహుల్ ఫైర్
దేశంలో రికార్డు స్థాయికి చేరిన నిరుద్యోగం, నిత్యావసరాల ధరల పెరుగుదల, ఆర్థిక అసమానతలు వంటి తీవ్రమైన సవాళ్లను పరిష్కరించడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
By: Tupaki Political Desk | 19 May 2026 4:00 PM ISTకేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని తన పార్లమెంటరీ నియోజకవర్గమైన రాయ్‌బరేలీలో పర్యటించిన ఆయన.. దేశ ఆర్థిక పరిస్థితి, కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ మద్దతుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ కేవలం కొద్దిమంది పారిశ్రామికవేత్తల కోసమే వ్యవస్థలను నడుపుతున్నారని, ఆ ‘క్రోనీ క్యాపిటలిజం’ పునాదులు త్వరలోనే బద్దలు కావడం ఖాయమని హెచ్చరించారు.
ప్రధాని నిర్మించిన వ్యవస్థ కూలిపోతే కార్పొరేట్ దిగ్గజాలకు వచ్చే నష్టం ఏమీ ఉండదని, ఆ మొత్తం భారాన్ని దేశంలోని సామాన్య పౌరులే మోయాల్సి వస్తుందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీశాయి. అంబానీ, అదానీలకు లబ్ధి చేకూర్చేలా ప్రధాని మోదీ గత కొన్నేళ్లుగా ఒక కృత్రిమ ఆర్థిక వ్యవస్థను నిర్మించారని, అయితే అది ఎక్కువ కాలం నిలబడదని రాహుల్ వ్యాఖ్యానించారు. ఆ వ్యవస్థ కుప్పకూలడం చారిత్రక అవసరమని స్పష్టం చేశారు.
దేశంలో రికార్డు స్థాయికి చేరిన నిరుద్యోగం, నిత్యావసరాల ధరల పెరుగుదల, ఆర్థిక అసమానతలు వంటి తీవ్రమైన సవాళ్లను పరిష్కరించడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇక ఇదే సమయంలో ప్రధాని విదేశీ పర్యటనలపై రాహుల్ సెటైర్లు వేశారు. సాధారణ పౌరులనేమో విదేశీ పర్యటనలకు దూరంగా ఉండాలని, దేశీయంగానే ఖర్చు చేయాలని సలహాలు ఇస్తున్న ప్రధాని.. స్వయంగా మాత్రం ప్రపంచమంతా చుట్టేస్తున్నారు" అంటూ ప్రధాని మోదీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు.
కాగా, రాహుల్ గాంధీ వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో తీవ్ర చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీ గతంలో కూడా ‘అంబానీ-అదానీ’ లబ్ధిపై మాట్లాడినప్పటికీ, ఈసారి "వ్యవస్థ కూలిపోతుంది, భారం సామాన్యుడిపై పడుతుంది" అని ప్రత్యేకంగా సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పడం వెనుక స్పష్టమైన రాజకీయ వ్యూహం ఉందని మీడియా విశ్లేషకులు భావిస్తున్నారు. దేశంలో పెరుగుతున్న సంపద కేంద్రీకరణను నేరుగా ప్రజల నిత్య జీవిత కష్టాలతో, పన్నుల భారంతో ముడిపెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని అంటున్నారు.
ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం మోపుతూ, కార్పొరేట్లకు రాయితీలు ఇస్తోందనే వాదనను గట్టిగా వినిపించడం ద్వారా రాహుల్ గాంధీ ఆ వర్గం ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలను దేశంలో ఆర్థిక ఇబ్బందులను లింక్ చేస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో కూడా విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. మరోవైపు రాహుల్ గాంధీ విమర్శలపై అధికార భారతీయ జనతా పార్టీ సైతం అంతే తీవ్రంగా స్పందించింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని, పారిశ్రామికవేత్తలపై బురదజల్లడం ద్వారా రాహుల్ గాంధీ దేశ ప్రతిష్టను, పెట్టుబడులను దెబ్బతీయాలని చూస్తున్నారని బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు.
