Begin typing your search above and press return to search.

లోక్‌సభను రగిలించిన రాహుల్ గాంధీ.. "ఎప్‌స్టీన్ ఫైల్స్" సెగతో దద్దరిల్లిన సభ!

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో బుధవారం హైడ్రామా చోటుచేసుకుంది. విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

By:  A.N.Kumar   |   11 Feb 2026 6:14 PM IST
లోక్‌సభను రగిలించిన రాహుల్ గాంధీ.. ఎప్‌స్టీన్ ఫైల్స్ సెగతో దద్దరిల్లిన సభ!
X

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో బుధవారం హైడ్రామా చోటుచేసుకుంది. విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా అమెరికా వాణిజ్య ఒప్పందం, బడ్జెట్ కేటాయింపులు.. సంచలన 'ఎప్‌స్టీన్ ఫైల్స్' గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో రాజకీయ తుఫానును రేపాయి.

ఎప్‌స్టీన్ ఫైల్స్.. అనిల్ అంబానీ ప్రస్తావన

ప్రసంగంలో రాహుల్ గాంధీ అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన డాక్యుమెంట్లను ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. "ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పేరు ఉన్న పారిశ్రామికవేత్త అనిల్ అంబానీపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అసలు ఎప్‌స్టీన్‌కు ఆయనను పరిచయం చేసింది ఎవరు?" అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ పేరును కూడా రాహుల్ ప్రస్తావించడంతో సభలో గందరగోళం నెలకొంది. దీనిపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

"దేశాన్ని అమ్మేశారు" - అమెరికా ట్రేడ్ డీల్‌పై విమర్శలు

భారత్-అమెరికా మధ్య కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందంపై రాహుల్ ఘాటుగా స్పందించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి ప్రధాని మోదీ దేశ ప్రయోజనాలను పణంగా పెట్టారని ఆరోపించారు. "మనం ఎక్కడ చమురు కొనాలో కూడా అమెరికానే నిర్ణయిస్తుందా? ఇది ఏ ప్రధానమంత్రి చేయని పని" అని విమర్శించారు. అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటే భారతీయ రైతులు తీవ్రంగా నష్టపోతారని ఈ ఒప్పందం ఏకపక్షంగా సాగిందని దుయ్యబట్టారు.

మార్షల్ ఆర్ట్స్ ఉదాహరణతో సెటైర్లు

రాహుల్ తన ప్రసంగాన్ని ఒక ఆసక్తికరమైన పోలికతో ప్రారంభించారు. మార్షల్ ఆర్ట్స్ గురించి ప్రస్తావిస్తూ.. "ఎవరైనా మనల్ని పట్టుకున్నప్పుడు భయం వల్ల సరెండర్ అయిపోతాం. ప్రస్తుతం ప్రధాని కళ్ళలో ఆ భయం కనిపిస్తోంది. అందుకే ఆయన పార్లమెంట్‌కు ముఖం చాటేస్తున్నారు" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ప్రభుత్వ కౌంటర్.. సస్పెన్షన్ల పర్వం

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, హర్దీప్ సింగ్ పూరీ ఘాటుగా స్పందించారు. ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సరికాదని, సభను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. సభలో చోటుచేసుకున్న నిరసనల నేపథ్యంలో సభా మర్యాదలు ఉల్లంఘించినందుకు గాను దాదాపు 8 మంది కాంగ్రెస్ ఎంపీలను బడ్జెట్ సమావేశాల నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు.

మొత్తానికి రాహుల్ గాంధీ ప్రసంగం దేశీయ ఆర్థిక విధానాల నుంచి అంతర్జాతీయ కుంభకోణాల వరకు అన్నిటినీ స్పృశించింది. రాబోయే రోజుల్లో 'ఎప్‌స్టీన్ ఫైల్స్' , 'అదానీ' వ్యవహారాలపై మరిన్ని వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది.