Begin typing your search above and press return to search.

రాహుల్ కి సింపతీ పెంచేస్తున్నారా ?

లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ తన ఫైర్ ని అంతా బడ్జెట్ సెషన్ లో చూపిస్తున్నారు. పప్పు అని ఒకనాడు అన్న వారు అంతా నిప్పుగా మారిన రాహుల్ ని చూసి షాక్ తినే పరిస్థితి ఉంది.

By:  Satya P   |   12 Feb 2026 9:22 AM IST
రాహుల్ కి సింపతీ పెంచేస్తున్నారా ?
X

లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ తన ఫైర్ ని అంతా బడ్జెట్ సెషన్ లో చూపిస్తున్నారు. పప్పు అని ఒకనాడు అన్న వారు అంతా నిప్పుగా మారిన రాహుల్ ని చూసి షాక్ తినే పరిస్థితి ఉంది. ఆయన నేరుగా అధికార పార్టీ మీద చేస్తున్న విమర్శలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయన తన ప్రసంగంలో వాడి వేడిని జోడిస్తూ నేరుగా ఎన్డీయే కూటమి మీద తన ఫోకస్ పెట్టి మరీ గట్టిగా టార్గెట్ చేస్తున్నారు.

బడ్జెట్ చర్చలో సైతం :

ఇదిలా ఉంటే లోక్‌సభలో 2026-27 కేంద్ర బడ్జెట్‌పై జరిగిన చర్చలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌లో నిర్దిష్టంగా ఏ వర్గానికి ప్రయోజనాలు లేవని విమర్శించారు. ఇంజనీరింగ్ ఐటీ రంగంలో ఆఈ వల్ల చాలా ఉద్యోగాలు పెను సవాళ్లను ఎదుర్కొంటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆయన అమెరికా భారత్ ల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడం దాని వెనక ఉన్న విషయాలను కూడా చెబుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏకంగా భారత మాతను అమ్మేశారు అంటూ ఆయన చేసిన సీరియస్ వ్యాఖ్యల మీద ఎన్డీయే పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

యాక్షన్ కి రెడీ :

ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మీద సీరియస్ యాక్షన్ కి ఎన్డీయే సర్కార్ రెడీ అవుతోంది అని అంటున్నారు. లోక్ స్సభలో బడ్జెట్ పైన చర్చ సందర్భంగాలో అధికార పార్టీ నాయకుల మీద నిరాధారమైన ప్రకటనలు చేసిన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపైన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పడం విశేషం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపైన, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిపైన రాహుల్ గాంధీ తప్పుడు ఆరోపణలు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తీవ్రమైన హక్కుల ఉల్లంఘన అని ఆయన చెప్పుకొచ్చారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం గురించి రాహుల్ గాంధీ చేసిన ఆరోపణపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ స్పందిస్తూ అన్ని నిర్ణయాలు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్నామని చెప్పారు. వారి ప్రయోజనాలకు భద్రత కల్పిస్తున్నామని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. కేంద్ర మంత్రి పూరీ అయితే రాహుల్ కి నిరాధారమైన విమర్శలు చేయడం అలావాటే అని మండిపడ్డారు.

ఏమి జరుగుతుంది :

ఇదిలా ఉంటే సభా హక్కుల నోటీసు ఇస్తే ఏమి అవుతుంది అన్న చర్చ మొదలైంది. పార్లమెంట్ లేదా శాసనసభ సభ్యుల విశేషాధికారాలను ఉల్లంఘించినప్పుడు సభ గౌరవానికి భంగం కలిగించినప్పుడు ప్రవేశపెట్టే ఒక ముఖ్యమైన నోటీసుగా దీనిని పేర్కొంటారు. పార్లమెంట్ లేదా శాసనసభ సభ్యులు తమ విధులు నిర్వర్తించడానికి రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక హక్కులు కలిగి ఉంటారు. ఉదాహరణకు సభ్యులు ఎవరైనా సభలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కలిగి ఉంటారు. అయితే తప్పుడు సమాచారం ఇవ్వకపోవడం సభ్యులను గౌరవించడం వంటివి చేయాల్సి ఉంటుంది.

హక్కుల ఉల్లంఘన:

ఇదే సమయంలో ఒక సభ్యుని హక్కులకు భంగం కలిగించినా లేక సభను తప్పుదారి పట్టించినా లేదా సభ గౌరవాన్ని తగ్గించేలా ప్రవర్తించినా దానిని సభా హక్కుల ఉల్లంఘన గా పరిగణిస్తారు. దీనిని ఎదుర్కోవడానికి సభ స్పీకర్ లేదా చైర్మన్‌కు ఇచ్చే లిఖితపూర్వక ఫిర్యాదును సభా హక్కుల నోటీసు అని అంటారు. సభా హక్కుల నోటీసు ఎప్పుడు ఇస్తారు అన్నది చూస్తే సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు తప్పుడు సమాచారం లేదా తప్పుదోవ పట్టించే సమాచారం ఇచ్చినప్పుడు అని చెప్పాల్సి ఉంటుంది. అలాగే సభలో సభ్యులకు లేదా సభకు అవమానం జరిగినప్పుడు కూడా నోటీసు ఇస్తారు. సభ ప్రొసీడింగ్స్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినప్పుడు, సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సరైన సమాధానం ఇవ్వకపోయినా లేక సమాచారాన్ని దాచిపెట్టినా, అమర్యాదగా ప్రవర్తించినా, ప్రివిలేజ్ మోషన్ తీసుకువస్తారు.

ఈ ప్రక్రియ ఎలా అంటే :

సభా హక్కుల ఉల్లంఘన జరిగిందని భావించే సభ్యుడు లోక్ సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ కు లిఖితపూర్వకంగా నోటీసు ఇవ్వాలి. ఆ మీదట స్పీకర్ అనుమతితో సభలో చర్చ జరుగుతుంది. నోటీసు ఆమోదం పొందితే దానిని సభా హక్కుల కమిటీకి రిఫర్ చేస్తారు. ఈ కమిటీ ఆ అంశాన్ని విచారించి ఒక నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక ప్రకారం హక్కుల ఉల్లంఘన నిజమని తేలితే, సభ సంబంధిత సభ్యుడిని హెచ్చరించవచ్చు లేదా శిక్షించవచ్చు.

రాహుల్ దూకుడు :

అయితే సభా హక్కుల నోటీసు ఇచ్చినా రాహుల్ గాంధీ అండ్ ఇండీ కూటమి ఎంపీలు వెనక్కి తగ్గేది లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మీద నోటీసు ఇచ్చి సభలో చర్చించి అనంతరం ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు చేసే యాక్షన్ ని అమలు చేసినా రాహుల్ కి సానుభూతి వస్తుందని అంటున్నారు. మొత్తానికి రాహుల్ గాంధీ ఈసారి బడ్జెట్ సెషన్ లో మాత్రం తనలోని రెండవ కోణం చూపిస్తున్నారు. మరి సభలో ఏమి జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది.