Begin typing your search above and press return to search.

రాహుల్ నేర్చుకున్న పాఠాలు...గురువు ఎవరంటే ?

జీవితమే ఒక పాఠశాల అని పెద్దలు అన్నారు. ప్రతీ అడుగులో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఓపిక పెట్టి వింటే జవాబులూ దొరుకుతాయి.

By:  Tupaki Desk   |   26 April 2025 11:30 PM
రాహుల్ నేర్చుకున్న పాఠాలు...గురువు ఎవరంటే ?
X

జీవితమే ఒక పాఠశాల అని పెద్దలు అన్నారు. ప్రతీ అడుగులో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఓపిక పెట్టి వింటే జవాబులూ దొరుకుతాయి. ఆ పాఠాలు ఎవరైనా చెప్పవచ్చు. నేర్చుకునే వారు ఉంటే ఏ వయసులోనైనా ఏ రంగంలో అయినా ఎంత అనుభవం ఉన్న వారు అయినా పాఠాలు ఇంకా నేర్చుకో గలుగు తూనే ఉంటారు.

ఇక రాజకీయాల్లో ఉన్న వారు ప్రజా జీవితంలో ఉన్న వారు నేర్చుకునే పాఠాలు ఎన్నో ఉంటాయి. అయితే దానికి ఓపిక ఆసక్తి అవసరం. అలా తాను రాజకీయాల్లోకి ఏనాడో వచ్చినా కూడా రాహుల్ గాంధీ పాఠాలు ఎక్కువగా నేర్చుకున్నది మాత్రం గడచిన మూడేళ్ళ కాలంలోనే అని చెబుతున్నారు. రాహుల్ గాంధీ 2022లో భారత్ జోడో యాత్ర చేపట్టారు.

ఆయన దేశంలో కీలక ప్రాంతాలను కలుపుతూ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తాను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను అని చెప్పారు తాజాగా ఆయన భారత్ జోడో యాత్ర గురించి గుర్తు చేసుకుంటూ ఈ యాత్ర తనను పూర్తిగా మార్చేసింది అని అన్నారు. తాను అంతవరకూ చెప్పడమే రాజకీయం అనుకున్నాను అన్నారు. అయితే తొలిసారి వినడం నేర్చుకున్నది మాత్రం భారత్ జోడో యాత్ర నుంచే అన్నారు.

భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజలతో మమేకం కావడం వల్లనే తాను అన్ని విషయాలూ గ్రహించాను అని ఆయన చెప్పారు. ప్రజల నుంచి వినడం కంటే మహత్తర రాజకీయ సూత్రం మరొకటి లేదని అన్నారు. ప్రజలు వారి కష్టాలను ఓపికగా వినే నాయకుడిని కోరుకుంటారు అన్నది అర్ధం అయింది అన్నారు.

తమ బాధలు తీరకపోయినా పరిష్కారం కాకపోయినా వారు బాధపడేది ఉండదని, దాని కంటే ఎక్కువగా వారు తమ గోడు రాజకీయ నాయకులు విన్నారని ఆలోచిస్తారని ఆ సంతృప్తితో వారు జీవిస్తారు అని రాహుల్ చెప్పారు. తన భర్త తనను కొడుతున్నాడని తన బాధను చెప్పుకుందని అయితే ఆమె తనతో ఆ విషయం అంతా చెప్పేశాక తాను విన్నాక ఆమె ప్రశాంతంగా ఉండడం చూడాను అని రాహుల్ అన్నారు.

దీన్ని చూసిన తరువాత కేవలం వినడం ద్వారానే ఎవరైనా అవతల వారి జీవితాలలో మార్పుని తీసుకుని రాగలరు అన్నది అర్థం అయింది అన్నారు. ఎన్నో చర్యలు తీసుకోవడం కన్నా ప్రజలు చెప్పేది వినడం ఎంతో ముఖ్యమని రాహుల్ అన్నారు. అది తన అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అన్నారు.

ప్రజల గొంతుకను వినడమే శక్తివంతమైనదని తాను భావిస్తున్నాను అన్నారు. అయితే ఇపుడు రాజకీయ పక్షాలు ప్రజల మాటను వినడానికి సిద్ధంగా లేవని అన్నారు. తమకు అన్ని సమస్యలూ తెలుసు అని ముందే భావిస్తారు అన్నారు. ఆధునిక సాంకేతిక సంపత్తి అందుబాటులో ఉందని అయినా ప్రజల గొంతుకను వినేందుకు రాజకీయ పార్టీలు కొన్ని సిద్ధంగా లేవని ఆయన విమర్శించారు.

అయితే ప్రజల గొంతుకకు విలువ ఇచ్చి వారు చెప్పే దానిని వినడం ద్వారా తాము ఈ లోటుని భర్తీ చేస్తామని రాహుల్ చెప్పుకొచ్చారు. భారత్ జోడో యాత్ర ద్వారా వినడమే కాదు ప్రేమ ఆప్యాయతలను పంచడం కూడా ఎలాగో నేర్చుకున్నాను అని ఆయన చెప్పారు.

తనలో వచ్చిన ఈ మార్పు ప్రజలతో తన అనుబంధాన్ని మరింతగా కనెక్ట్ చేయడానికి ఈజీ చేస్తోందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ తనలోని కొత్త నాయకుడిని ప్రజలే అవిష్కరించారని చెబుతున్నారు. వినడమే రాజకీయ నేతలు ఎక్కువగా చేయాలని అంటున్నారు. ఈ రాజకీయ పాఠాలు మిగిలిన నేతలకూ అమలు చేయతగిన సూత్రాలే అని అంటున్నారు.