రాహుల్‌ను అస్సాం జైల్లో వేస్తాం.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
ఇటీవల అస్సాంలో పర్యటించిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఆయన వ్యాఖ్యల కారణంగా ఆక్రమణదారులు రెచ్చిపోయి పోలీసులపై దాడులు చేస్తున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తాజాగా ఆరోపించారు.
By: Tupaki Desk | 18 July 2025 3:53 PM ISTఇటీవల అస్సాంలో పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ దీటుగా స్పందించారు. తనను తాను రాజుగా భావిస్తున్న ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లడం ఖాయమంటూ రాహుల్ వ్యాఖ్యానించగా, కాంగ్రెస్ నేత రాహుల్ కోసం అస్సాం జైళ్లు ఎదురు చూస్తున్నాయని సీఎం కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఇటీవల అస్సాంలో పర్యటించిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఆయన వ్యాఖ్యల కారణంగా ఆక్రమణదారులు రెచ్చిపోయి పోలీసులపై దాడులు చేస్తున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తాజాగా ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అగ్రనేతపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అటవీ భూమిలో ప్రజలు స్థిరపడలేరని రాహుల్ గ్రహించలేకపోతున్నారన్నారు. కబ్జాదారులకు అదే స్థలంలో పునరావాసం కల్పిస్తామని, ఇళ్లు కట్టిస్తామని రాహుల్ హామీ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ ప్రసంగాల కారణంగా అక్రమణదారులు రెచ్చిపోయి పోలీసులపై తిరుగుబాటు చేస్తున్నారని ఆరోపించారు.
రాహుల్ ప్రసంగాలను పోలీసులు పరిశీలిస్తున్నారని చెప్పారు. ప్రసంగాలతో హింసను ప్రేరేపించినట్లు తేలితే రాహుల్ గాంధీతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేపై పోలీసులు చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. ఇప్పటికే రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రాపై ఈడీ కేసులు నమోదు చేసిందని, ఆయన ఆస్తులను జప్తు చేసిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కోసం అస్సాం జైళ్లు ఎదురుచూస్తున్నాయని సీఎం హిమంత బిశ్వశర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాగా, అస్సాంలోని గోల్పారా జిల్లా పరిధిలో అటవీ గార్డులు, పోలీసు సిబ్బందిపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో సుమారు 21 మంది అటవీ, పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో కాంగ్రెస్ అగ్రనేత ఆ ప్రాంతంలో పర్యటించారు. బాధితులను పరామర్శించారు. ఆ సమయంలోనే ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లడం ఖాయమంటూ హెచ్చరించారు. ఇలానే ఉంటే ప్రజలు ఆయనను కారాగారానికి పంపిస్తారని అన్నారు.
