Begin typing your search above and press return to search.

బీజేపీ ప్రాణం అక్కడే ఉందా.. రాహుల్ కనిపెట్టేశారా ?

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి బీజేపీ ప్రాణం ఎక్కడ ఉందో అరధం అయినట్లుగా ఉంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   17 April 2025 7:00 AM IST
బీజేపీ ప్రాణం అక్కడే ఉందా.. రాహుల్ కనిపెట్టేశారా ?
X

బీజేపీకి గత పదకొండేళ్లుగా కాంగ్రెస్ నుంచి సిసలైన ప్రత్యర్ఘిగా రాహుల్ గాంధీ ఉన్నారు ఆయన ఈ మధ్యలోనే అనేక పదవులు చేపట్టి మరీ బీజేపీని సవాల్ చేశారు. ఆయన కొన్నాళ్ళ పాటు కాంగ్రెస్ జాతీయ అద్యక్షుడిగా ఉన్నరు. ఆ తరువాత దానిని వదిలేశారు. ఇక ఒక ప్రతిపక్ష ఎంపీగా ఆయన పదేళ్ళుగా పనిచేశారు. ఇపుడు చూస్తే లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఇదిలా ఉంటే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే మీద మూడు ఎన్నికల్లో పోటీ పడిన కాంగ్రెస్ ఓటమి పాలు అయింది.

దాంతో పాటు అనేక రాష్ట్రాలలో బీజేపీ గెలుపు బాట పట్టింది. ఈ పరిణామాలను చూసిన వారు అంతా బీజేపీ వెరీ స్ట్రాంగ్ అని అంటున్నారు. బీజేపీ కీలక నేతలు అయితే రాహుల్ గాంధీ కాంగ్రెస్ లో కీలకంగా ఉండగా బీజేపీకి ఎప్పటికీ ఎదురూండదని కూడా ఆర్భాటపు ప్రకటనలు చేస్తూ వస్తున్నారు.

అయితే రాహుల్ గాంధీ చేయాల్సింది చేస్తున్నారు. భారత్ జోడో యాత్రను చేపట్టారు. అలాగె ఆయన దేశమంతా తిరిగి బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రచారం చేస్తున్నారు. అయితే ఆయన ప్రచారం అలా ఒక వైపు ఉండగానే మరో వైపు ఎత్తులతో వ్యూహాలతో బీజేపీ గెలిచి వస్తోంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి బీజేపీ ప్రాణం ఎక్కడ ఉందో అరధం అయినట్లుగా ఉంది అని అంటున్నారు. బీజేపీ దేశంలో ఎదిగింది అంతా గుజరాత్ మోడల్ ని చూపించే. ప్రధానిగా ముఖ్యమంత్రి పీఠం నుంచి అలా వచ్చి నరేంద్ర మోడీ కూర్చున్నది కూడా గుజరాత్ నుంచే. గుజరాత్ రాష్ట్రం బీజేపీకి గత మూడు దశాబ్దాలుగా కంచుకోటగా ఉంది. ఇప్పటికి అనేక సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తూ వచ్చింది.

ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని చూస్తోంది. దాంతో రాహుల్ గాంధీ గుజరాత్ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ లను గుజరాత్ లోనే ఓడిస్తామని ఆయన ఘంటాపధంగా చెబుతున్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ లను ఓడించడం అంటే అది రాజకీయంగా కాదని వారి భావజాలాన్ని ఓడించడమే అని రాహుల్ గాంధీ అంటున్నారు.

తమది రాజకీయ పరమైన పోరాటంతో పాటు సిద్ధాంతపరమైన పోరాటం అని ఆయన అంటున్నారు. ఈ దేశంలో బీజేపీని ఓడించగలిగేది కచ్చితంగా కాంగ్రెస్ మాత్రమే అని ఆయన అన్నారు. ఈ విషయం దేశ ప్రజలకు అందరికీ తెలుసు అన్నారు.

బీజేపీకి గుజరాత్ నుంచే ఓటమి ఏంటో చూపిస్తామని ఆయన ధీమాగా చెబుతున్నారు. ఇక బీజేపీ ఇప్పటికి ఏడు సార్లు వరసగా గుజరాత్ లో గెలిచింది. సహజంగా ఆ పార్టీ మీద యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుంది. కానీ ప్రతీ సారి ఎన్నికల్లో ఒక్కో వ్యూహాన్ని అమలు చేస్తోంది. గతసారి బీజేపీ విజయానికి ఆప్ పార్టీ కూడా పరోక్షంగా కారణం అయింది అని అంటారు.

ఆ పార్టీ పోటీ చేయడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలాయి. అలాగే కాంగ్రెస్ కి పడాల్సిన ఓట్లలో తేడా వచ్చింది. ఈసారి అలా ఉండదని అంటున్నారు. అంతే కాదు ప్రతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకుంటోంది. దాంతోనే రాహుల్ గాంధీ ధీమాగా చెబుతున్నారు. గుజరాత్ నుంచే బీజేపీ ఓటమి స్టార్ట్ అని గర్జిస్తున్నారు.

నిజంగా అదే కనుక జరిగితే దేశంలో బీజేపీ ప్రాభవానికి భారీ గండి పడుతుంది అని అంటున్నారు. ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ హోం మంత్రిగా ఉన్న అమిత్ షా ఇద్దరూ గుజరాత్ కి చెందిన వారే. మరి ఈ ఇద్దరే ఈ రోజున కేంద్రంలో అత్యంత శక్తిమంతులుగా ఉంటూ వస్తున్నారు. బీజేపీకి రాజకీయ పునాది లా ఉన్న గుజరాత్ నే కాంగ్రెస్ హస్తగతం చేసుకుంటే కనుక కచ్చితంగా అది కమలానికి కోలుకోలేని దెబ్బ అవుతుంది అని అంటున్నారు. రాహుల్ గాంధీ తీరు చూస్తే గట్టి పట్టుదల మీద ఉన్నారు. చూడాలి మరి గుజరాత్ లో ఏమి జరుగుతుందో.