పేపర్ బ్యాలెట్ కే ఓటు...జరిగి తీరుతుందా ?
అంతకుముందు లోక్‌సభలో ఎన్నికల సంస్కరణలపై చర్చను ప్రారంభిస్తూ కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ మాట్లాడుతూ, సర్ ని అమలు చేయడానికి ఎన్నికల సంఘం కారణాలను తెలియజేయాలని డిమాండ్ చేశారు.
By: Satya P | 10 Dec 2025 9:17 AM ISTఎట్టకేలకు పార్లమెంట్ లో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ సర్ మీద ప్రత్యేక చర్చ జరిగింది. మంగళవారం రోజంతా చర్చ సాగింది. ఇక మిగిలిన పార్టీల నుంచి సభ్యులకు కూడా అవకాశం ఇవ్వడానికి బుధవారం కూడా చర్చను లోక్ సభ కొనసాగించనుంది. ఆ మీదట రాజ్యసభలోనూ సర్ మీద చర్చ ఉంటుంది. ఇదిలా ఉంటే లోక్ సభలో ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చ సందర్భంగా విపక్ష పార్టీలు అన్నీ కూడా ఈవీఎంల పనితీరుని తప్పుపట్టాయి. అదే సమయంలో పేపర్ బ్యాలెట్ ని తిరిగి ప్రవేశపెట్టాలని గట్టిగా కోరారు.
నకిలీ ఓట్ల అంశంతో :
ఇక ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో నకిలీ ఓటర్ల అంశాన్ని లేవనెత్తారు. బీహార్‌లోని సర్ నిర్వహణపైన కూడా ఆయన ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు, ఓటింగ్ జాబితాలో లక్షా 20 వేల నకిలీ ఫోటోలు ఉన్నాయని ఆరోపించారు. పోలింగ్‌కు ఒక నెల ముందు అన్ని పార్టీలకు అందుబాటులోకి ఓటరు జాబితాలు ఉండేలా చూడడం అవసరమని అన్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను నాశనం చేయడానికి అనుమతించే చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ఈసీని ఆయన డిమాండ్ చేశారు.
ఈవీఎంలు వద్దు :
అంతకుముందు లోక్‌సభలో ఎన్నికల సంస్కరణలపై చర్చను ప్రారంభిస్తూ కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ మాట్లాడుతూ, సర్ ని అమలు చేయడానికి ఎన్నికల సంఘం కారణాలను తెలియజేయాలని డిమాండ్ చేశారు. సర్ ని నిర్వహించడానికి ఎన్నికల సంఘానికి చట్టపరమైన మద్దతు లేదని ఆయన అన్నారు. ఈవీఎంలను వినియోగిస్తే మాత్రం వీవీ పాట్ లను పూర్తిగా లెక్కించాలని దేశం తిరిగి పేపర్ బ్యాలెట్‌లకు మారాలని ఆయన కోరడం విశేషం.
బ్యాలెట్ వైపు రావాలి :
కేంద్ర ఎన్నికల కమిషన్ నిష్పాక్షికంగా పనిచేస్తేనే ఎన్నికల సంస్కరణలు సాధ్యమవుతాయని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. ఓటింగ్ కోసం పేపర్ బ్యాలెట్ పత్రాలనే కొనసాగించాలని కోరారు. జర్మనీ, అమెరికా వంటి సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాలు బ్యాలెట్ పత్రం ద్వారా ఓటింగ్ నిర్వహిస్తే భారతదేశం ఎందుకు ఈవీఎంలు ను ఉపయోగిస్తోందని ఆయన ప్రశ్నించారు. శివసేన ఉద్ధవ్ థాక్రే పార్టీకి చెందిన ఎంపీ అనిల్ దేశాయ్ మాట్లాడుతూ ఈవీఎంలను పక్కన పెట్టి బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు పెట్టాలని కోరారు. ఇదే విధంగా శరద్ పవార్ పార్టీ లాలూకి చెందిన ఆర్జేడీ వైసీపీ లాంటి పార్టీలు అన్నీ కూడా పేపర్ బ్యాలెట్ నే కోరాయి.
గెలిస్తే ఓకే కానీ :
అయితే విపక్షాలు తాము గెలిస్తే ఈవీఎంలు ఓకే అంటున్నారు కానీ ఓడితే మాత్రమే పేపర్ బ్యాలెట్ కోసం డిమాండ్ చేస్తున్నారు అని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఎద్దేవా చేశారు. భారతదేశంలో ఎన్నికలు నిష్పాక్షికంగా నిర్వహించబడుతున్నాయని దీనిని ప్రపంచం చూస్తోందని ఆయన చెప్పడం విశేషం. రాజ్యసభలో కూడా ఇదే రకమైన అభిప్రాయం కనుక వస్తే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా దీనిని చూస్తుంది అన్నది చర్చగా ఉంది. పేపర్ బ్యాలెట్ కి వెళ్ళడానికి కేంద్రం సుముఖంగా ఉందా లేదా అన్నది అయితే చూడాల్సి ఉంది.
