రాహుల్ డేరింగ్ స్టెప్స్... తోక జాడిస్తే అంతేనా ?
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పార్టీలో పరిణామాలను పూర్తి స్థాయిలో గమనిస్తున్నారు. ఒక విధంగా పార్టీని ప్రక్షాళన చేసే దిశగానే ఆయన ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.
By: Satya P | 26 May 2026 4:00 PM ISTకాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పార్టీలో పరిణామాలను పూర్తి స్థాయిలో గమనిస్తున్నారు. ఒక విధంగా పార్టీని ప్రక్షాళన చేసే దిశగానే ఆయన ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఇంతకాలం వెనకా ముందూ వేసినా ఇపుడు సరైన సమయం అని అగ్ర నేత రాహుల్ భావిస్తున్నారు అని అంటున్నారు. దానికి కారణం దక్షిణ భారత దేశంలో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడమే అని అంటున్నారు. ఎన్డీయే కేవలం ఏపీలోనే అధికారంలో ఉండడం కొంత ప్రాంతానికే పరిమితం కావడం కాంగ్రెస్ కి రెట్టింపు ఆనందాన్ని ఇస్తున్నాయి. దాంతో పాటు ఇటీవల కేరళం లో బంపర్ విక్టరీ తమిళనాడులో అత్యంత ప్రజాదరణ కలిగిన ఒక వెండి తెర సూపర్ స్టార్ తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకే అధినేత విజయ్ కొత్త మిత్రుడు కావడం ఇవన్నీ కాంగ్రెస్ కి కలసి వచ్చిన అంశాలుగానే చెబుతున్నారు.
కుర్చీలాటకు బంద్ :
ఇక కర్ణాటకలో రాజకీయం గత ఏడాదికి పైగా కాంగ్రెస్ అగ్ర నాయకత్వాన్ని ఇబ్బందికి గురి చేస్తోంది. చిత్రమేంటి అంటే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అదే రాష్ట్రం నుంచి వచ్చారు. అయినా సరే ఆ రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ వర్గ పోరు పీక్స్ లో ఉంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ గా పార్టీ ప్రభుత్వం కూడా చీలిపోయింది అని అంటున్నారు. పద్ధతిగా చూస్తే డీకే శివ కుమార్ కి సీఎం పదవి ఇవ్వాల్సి ఉంది అని అంటున్నారు. 2023 మేలో ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత పీసీసీ చీఫ్ గా ఉన్న డీకే అలాగే సీఎల్పీ లీడర్ గా ఉన్న సిద్ధ రామయ్యల మధ్య కాంగ్రెస్ అగ్ర నాయకత్వం రాజీ ఫార్ములాను కుదిరించింది. దాని ప్రకారం సిద్ధ రామయ్యకు డీకేకు చెరి రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పీఠం దక్కేలా ఒక డీల్ ని ఖరారు చేసింది అని అంటున్నారు. ఈ లెక్క ప్రకారం గత ఏడాది నవంబర్ నెలలో సిద్ధరామయ్య గద్దె దిగాల్సి ఉన్నా ససేమిరా అన్నారని కూడా పార్టీ వర్గాలలో ప్రచారం సాగింది.
డీకేకి లక్కీ చాన్స్ :
అయితే ఇపుడు కాంగ్రెస్ దక్షిణ భారత దేశంలో పూర్తి స్థాయి పట్టు సాధించిన క్రమంలో కర్ణాటక కుర్చీలాటకు ఎండ్ కార్డు వేయనుంది అని అంటున్నారు. ప్రస్తుత మే నెల నాటికి మూడేళ్ళ పాలన పూర్తి చేసుకున్న సిద్ధ రామయ్యను తప్పించి డీకేకు పగ్గాలు అప్పగించాలని రాహుల్ గాంధీ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. తాముగా హైకమాండ్ ఇచ్చిన హామీని ఆ విధంగా నిలబెట్టుకోవడమే కాకుండా ట్రబుల్ షూటర్ గా ఉన్న డీకే చేతికి పగ్గాలు అందిస్తే 2028 నాటికి కాంగ్రెస్ ని మళ్ళీ అధికారంలోకి తీసుకుని వస్తారు అన్న నమ్మకం కూడా కాంగ్రెస్ పెద్దలలో ఉంది అని అంటున్నారు. దాంతోనే రాహుల్ డేరింగ్ స్టెప్స్ తీసుకుంటారు అని అంటున్నారు.
హద్దు మీరితే చాలు :
ఒక్క కర్ణాటక మాత్రమే కాదని హద్దు మీరినా పార్టీ లైన్ దాటినా గట్టిగానే చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ అగ్ర నాయకత్వం సిద్ధం అవుతోంది అని అంటున్నారు. తెలంగాణాలో చూస్తే రేవంత్ రెడ్డి సీఎం గా ఉంటున్నారు హ్యాట్రిక్ విజయాన్ని పార్టీని అందిస్తాను అని ఆయన చెబుతున్నారు. అయితే ఇక్కడ కూడా సీనియర్లు వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లుగా సీన్ నడుస్తోంది అన్నది ప్రచారంలో ఉంది. 2034 వరకూ తానే సీఎం అని రేవంత్ రెడ్డి అంటే బీసీ సీఎం అన్న నినాదాన్ని కొందరు వినిపిస్తున్నారు. ఇవన్నీ కాంగ్రెస్ అగ్ర నాయకత్వం దృష్టిలో ఉన్నాయని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి పట్ల అయితే హైకమాండ్ పూర్తి విశ్వాసంతో ఉంది అని అంటున్నారు. ఆయన అయిదేళ్ల సీఎం అని కూడా అంటున్నారు పార్టీలో విభేదాలు తెచ్చినా లేక లైన్ దాటినా కూడా ఉపేక్షించేది లేదన్న సంకేతాన్ని కాంగ్రెస్ స్ట్రాంగ్ గానే ఇస్తుందని అంటున్నారు. అలాగే దేశంలోని పలు చోట్ల పీసీసీ చీఫ్ ల మార్పు కూడా త్వరలో ఉండొచ్చు అని అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ ఉత్సహాం లో ఉంది. రాహుల్ గాంధీ కూడా ఫోకస్ పెంచారని చెబుతున్నారు. దాంతో ఏ రకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది అని అంటున్నారు.
