రాహుల్ చెప్పిన సొంత పార్టీ గుర్రాల కథ చదివారా?
అదేమిటో కానీ.. వయసు మీదకు వస్తున్న కొద్దీ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏ వేదిక మీద ఎలాంటి మాటలు మాట్లాడాలి? అన్న విషయాన్ని బొత్తగా మిస్ అవుతున్నారు.
By: Tupaki Desk | 17 April 2025 11:28 AM ISTఅదేమిటో కానీ.. వయసు మీదకు వస్తున్న కొద్దీ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏ వేదిక మీద ఎలాంటి మాటలు మాట్లాడాలి? అన్న విషయాన్ని బొత్తగా మిస్ అవుతున్నారు. ఇప్పుడున్న సోషల్ మీడియా కాలంలో తనను.. తన పార్టీని పలుచన చేసేందుకు అవకాశాల్ని ఆయనే స్వయంగా తన చేతులతో ఇవ్వటం విశేషం. పార్టీ వేదిక నుంచి మాట్లాడే వేళ.. అన్ని నిజాలు మాత్రమే చెప్పాలన్న దీక్షను చేపడతారేమో అన్నట్లుగా రాహుల్ మాటలు కొన్ని ఉంటాయి. తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆ కోవకు చెందినవే.
‘కాంగ్రెస్ నేతల్ని మూడు రకాల గుర్రాలుగా విభజించవచ్చు. మొదటి వారు రేసు గుర్రాలు. రెండోవారు పెళ్లి ఊరేగింపులోని గుర్రాలు. మూడోవారు కుంటి గుర్రాలు. రేసు గుర్రాల్ని పెళ్లి ఊరేగింపులకు వాడుతుండటం.. ఊరేగింపు గుర్రాలను రేసులకు పంపండం వల్ల గుజరాత్ లో మనం సరైన పనితీరు కనపర్చలేకపోతున్నాం. వీటిని విభజించాల్సిన సమయం ఆసన్నమైంది’ అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిస్థితిని నిలువుటద్దంగా ఆయన మాటలు ఉన్నాయి.
కాకుంటే.. తాను చేసిన వ్యాఖ్యలు గుజరాత్ రాష్ట్రానికే అన్నట్లుగా రాహుల్ చెప్పినప్పటికీ.. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉందన్న విషయం రాహుల్ గాంధీకి అర్థమయ్యే నాటికి ఇంకెంత కాలం పడుతుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. పార్టీ అధికారంలో ఉన్న కీలక రాష్ట్రాలైన తెలంగాణ.. కర్ణాటకల్లోని పరిస్థితుల్నిచూస్తే.. పార్టీ వైఫల్యం కొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు.
పెళ్లి ఊరేగింపులకు కూడా పనికి రాని నేతల్ని కట్టడి చేయాల్సిన పార్టీ.. అలాంటిదేమీ లేకుండా చేయటం.. జోరు మీద దూసుకెళ్లే రేసుగుర్రాలకు కళ్లాలు వేసే వైనంపై ఆయన ఏమంటారు? అన్నది ప్రశ్న. గుజరాత్ లో బీజేపీ.. ఆర్ఎస్ఎస్ లను ఓడించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్న ధీమాను రాహుల్ గాంధీ వ్యక్తం చేయొచ్చు. కానీ.. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని పాలన తీరును చూస్తున్న తర్వాత ఇతర రాష్ట్రాల ఓటర్లు కాంగ్రెస్ కు అవకాశం ఇస్తారా? అన్నది మరో ప్రశ్న.
గుజరాత్ లోపార్టీని ప్రక్షాళన చేసే విషయాన్ని చెబుతున్న రాహుల్.. ఆ ఒక్క రాష్ట్రంలోనే కాదు.. జాతీయ స్థాయిలోనే చేయాల్సి ఉంటుందన్న విషయాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదంటున్నారు. ఇన్నేళ్లుగా పార్టీవ్యవహారాల్ని చూస్తున్న రాహుల.. అప్పుడప్పుడుఇలాంటి నిజాల్ని మాట్లాడే బదులు.. ఆచరణలో చేసి చూపిస్తే మరింత బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గుజరాత్ లోఅధికారంలోకివస్తే బాగా పని చేసిన డీసీసీల అధ్యక్షుల్ని మంత్రులుగా చేస్తామని.. పార్టీని బలోపేతం చేసే వారికి అధికారం ఇస్తామని చెబుతున్న రాహుల్.. తాము అధికారంలో ఉన్న తెలంగాణలో ఆ పని ఎందుకు చేయలేకపోతున్నట్లు? అన్నది పెద్ద ప్రశ్న. అధికారంలో ఉన్న రాష్ట్రంలో చేయలేని పనులు.. అధికారంలో లేని రాష్ట్రాల్లో చేస్తామనటంలో లాజిక్ ఏంటి రాహుల్ గాంధీ?
