ప్రతి ఆరు ఎమ్మెల్యే స్థానల్లో ఒకరు ఓట్ చోరీతో గెలిచారు.. రాహుల్ సంచలన ఆరోపణలు..
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
By: Tupaki Political Desk | 6 May 2026 11:45 AM ISTలోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎన్నికల పారదర్శకతపై ఆయన నేరుగా అధికార పార్టీని లక్ష్యం చేసుకోవడం, ముఖ్యంగా ‘ఓట్ల దొంగతనం (ఓట్ చోరీ)’ అనే పదాన్ని ప్రయోగించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో సంస్థల పాత్రపై చర్చను తెరపైకి తెచ్చింది. ప్రతిపక్షాల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి, వ్యవస్థల రక్షణకు ఏకం కావాలనే ఆయన పిలుపు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
బుధవారం లోక్‌సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ, బీజేపీ విజయం, ఎన్నికల నిర్వహణపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్‌సభలోని 240 మంది బీజేపీ ఎంపీల్లో ప్రతి ఆరో ఎంపీ ఓట్ల దొంగతనం (ఓట్ చోరీ) చేసి గెలిచారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని బీజేపీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
‘చొరబాటుదారులు’ ఎవరు?
బీజేపీ ఎంపీల గెలుపుపై రాహుల్ గాంధీ తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించారు. లోక్‌సభలో ఉన్న 240 మంది బీజేపీ ఎంపీల్లో ప్రతి ఆరో వ్యక్తి ఓట్ల దొంగతనం ద్వారానే అక్కడ కూర్చున్నారని విమర్శించారు. వారిని గుర్తించడం కష్టం కాదని, బీజేపీ వాడే భాషలోనే చెప్పాలంటే వారిని 'చొరబాటు దారులు' అనాలా? అని ఆయన ప్రశ్నించారు. హర్యానాలో ఏకంగా మొత్తం ప్రభుత్వమే ‘చొరబాటుదారుల ప్రభుత్వం’ అని ఆయన ఎద్దేవా చేశారు.
సంస్థల పనితీరుపై విమర్శలు
రాజ్యాంగబద్ధమైన సంస్థలు బీజేపీ రిమోట్ కంట్రోల్‌లో పనిచేస్తున్నాయని రాహుల్ ధ్వజమెత్తారు. ఓటరు జాబితాను తారుమారు చేసే సంస్థలను, మొత్తం ఎన్నికల ప్రక్రియను బీజేపీ తన జేబులో పెట్టుకుందని ఆరోపించారు. ఈ సంస్థలు స్వతంత్రంగా కాకుండా ‘రిమోట్ కంట్రోల్’ ద్వారా నడుస్తున్నాయన్నారు. ఒకవేళ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగి ఉంటే, బీజేపీ 140 సీట్లు కూడా గెలుచుకోలేకపోయేదని ఆయన సవాల్ విసిరారు.
మమతా ఆరోపణలు.. అస్సాం, బెంగాల్ తీర్పు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ 100కు పైగా సీట్లను దోచుకుందన్న మమతా బెనర్జీ ఆరోపణలను ఆయన గుర్తు చేశారు. అస్సాం, బెంగాల్ ఎన్నికల తీర్పులో జరిగిన 'దొంగతనం' భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే దిశగా బీజేపీ వేసిన పెద్ద అడుగు అని ఆయన అభివర్ణించారు. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఓటమిని చూసి ప్రతిపక్షాల్లోని కొందరు సంతోషించడం సరికాదని, ఇది ఒక పార్టీ గెలుపు ఓటముల కంటే దేశ ప్రజాస్వామ్యం గురించి ఆలోచించాల్సిన సమయమని ఆయన హెచ్చరించారు.
రాజకీయ పార్టీలు కేవలం ఎన్నికల పోటీలకే పరిమితం కాకుండా, దేశ భవిష్యత్తు కోసం చిన్న చిన్న రాజకీయాలను పక్కన పెట్టాలని రాహుల్ గాంధీ కోరారు. ఇది కేవలం ఒక పార్టీ గురించి కాదని, దేశ ప్రజాస్వామ్య మనుగడ గురించి అని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో పార్లమెంటులో, బయట పెద్ద చర్చకు దారితీసే అవకాశం ఉంది.
