Begin typing your search above and press return to search.

కొత్త ఏడాదిలో ఏపీకి రాహుల్...టార్గెట్ ఎవరు ?

ఇక గడచిన పదకొండేళ్ళ కాలంలో కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. మోడీ ప్రభుత్వం మీద పోరాడుతోంది.

By:  Tupaki Desk   |   5 Dec 2025 12:00 AM IST
కొత్త ఏడాదిలో ఏపీకి రాహుల్...టార్గెట్ ఎవరు ?
X

లాంగ్ లాంగ్ ఎగో అన్నట్లుగా ఏపీకి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వస్తున్నారు. ఆయన ఏపీకి వచ్చింది ఎపుడూ అంటే బహుశా ఎవరికీ గుర్తు కూడా ఉండదు, 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు పాలన సాగుతున్న వేళ ప్రత్యేక హోదా మీద ఏపీలోని కర్నూల్ వేదికగా ఒక పెద్ద సభను కాంగ్రెస్ ఏర్పాటు చేస్తే దానికి రాహుల్ అటెండ్ అయ్యారు. అది జరిగి కూడా తొమ్మిదేళ్ళ కాలం అయి ఉంటుంది అని అంటున్నారు. ఇక 2019 ఎన్నికలప్పుడు కానీ 2024 ఎన్నికల సమయంలో కానీ ఏపీ వైపు రాహుల్ గాంధీ తొంగి చూడలేదు, ఆయన ఎన్నో సార్లు పొరుగు రాష్ట్ర తెలంగాణాకు వచ్చారు కానీ ఏపీ వైపు కన్నెత్తి అయినా చూడలేదు, అయితే ఏపీకి రాహుల్ ఇదిగో వస్తారు అదిగో వస్తారు అన్న ప్రచారం అయితే హోరెత్తింది. కానీ ఆయన మాత్రం రాలేదు.

ఏపీలో రాహుల్:

ఇక గడచిన పదకొండేళ్ళ కాలంలో కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. మోడీ ప్రభుత్వం మీద పోరాడుతోంది. ఇక ఏపీలో చూస్తే చంద్రబాబు జగన్ మళ్ళీ ఇపుడు చంద్రబాబు ప్రభుత్వాలు నడుస్తున్నాయి. రాహుల్ ఈ కాలంలో ఎన్ని సార్లు ఏపీని టచ్ చేశారు అంటే వాటి వివరాలు ఇలా ఉన్నాయి. 2014లో జరిగిన రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితిని సమీక్షించడానికి రాష్ట్రాన్ని ఒక సారి రాహుల్ సందర్శించారు. 2015లో రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా అనంతపురంలో రైతులను పరామర్శించడానికి 10 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. 2018 లో మాజీ ముఖ్యమంత్రుల కుటుంబాలను కలవడానికి కర్నూలు సందర్శించి 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి ర్యాలీలో ప్రసంగించారు. అదే విధంగా 2022లో రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర అక్టోబర్ 14న ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించి అక్టోబర్ 21 వరకు రాష్ట్రం గుండా కొనసాగింది, అలా అనంతపురం కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో వంద కిలోమీటర్లకు పైగా రాహుల్ పాదయాత్ర సాగింది. చివరిగా 2023లో గన్నవరం విమానాశ్రయంలో కొద్దిసేపు రాహుల్ గాంధీ ఆగారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించిన బహిరంగ సభలో ప్రసంగించడానికి మళ్ళీ రావాలన్న ఏపీ కాంగ్రెస్ నేతల అభ్యర్థనకు అనుకూలంగా ఆయన స్పందించారు.

స్టీల్ ప్లాంట్ కోసం :

ఇక రాహుల్ గాంధీ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం విశాఖకు వస్తున్నారు అని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి సునీల్ అహిరా చెప్పారు. తొందరలోనే రాహుల్ గాంధీ విశాఖ పర్యటన ఉంటుందని ఆయన అంటున్నారు. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయాలన్న కేంద్ర పెద్దల ఆలోచనలను రాహుల్ గాంధీ అడ్డుకుంటారు అని ఆయన చెప్పారు. ఇందిరాగాంధీ విశాఖ ప్రజలకు ఇచ్చిన అరుదైన బహుమానంగా స్టీల్ ప్లాంట్ ని ఆయన అభివర్ణించారు. కానీ దానిని కార్పోరేట్ సంస్థలకు దారాదత్తం చేయాలని చూస్తున్నారు అని ఆయన విమర్శించారు రాహుల్ ఉక్కు ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్తారని ఆయన స్పష్టం చేశారు.

బాబు అండ్ జగన్ :

ఇదిలా ఉంటే ఏపీకి 2026 మొదట్లో రాహుల్ గాంధీ వచ్చే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆయన విశాఖలో భారీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారని అంటున్నారు. మోడీ ప్రభుత్వం మీద రాహుల్ ఎటూ నిప్పులు చెరుగుతారు. దాంతో పాటు ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు విపఖంలో ఉన్న జగన్ లలో ఎవరి మీద ఎక్కువగా టార్గెట్ చేస్తారు అన్నదే చర్చగా ఉంది. ఏది ఏమైనా రాహుల్ రాకతో కాంగ్రెస్ బలపడుతుందా అన్నది కూడా చూడాల్సి ఉంది.