Begin typing your search above and press return to search.

55 ఏళ్ళ రాహుల్...పీఎం సీటు ఎంత దూరం ?

దేశంలో కాంగ్రెస్ పార్టీ అతి పురాతనమైనది. దాదాపుగా చూస్తే నూటాభై ఏళ్ళ చరిత్ర కలిగినది.

By:  Tupaki Desk   |   20 Jun 2025 9:00 AM IST
55 ఏళ్ళ రాహుల్...పీఎం సీటు ఎంత దూరం ?
X

దేశంలో కాంగ్రెస్ పార్టీ అతి పురాతనమైనది. దాదాపుగా చూస్తే నూటాభై ఏళ్ళ చరిత్ర కలిగినది. ఒక విదేశీ వనిత స్థాపించిన కాంగ్రెస్ దేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించింది. స్వాతంత్య్రం అనంతరం సుదీర్ఘ కాలం పాటు ఈ దేశాన్ని ఏలింది. ఈ రోజుకు దేశానికి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయితే అందులో అరవై ఏళ్ల పాటు ఏలింది కాంగ్రెస్ పార్టీనే.

ఇక కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబమే ప్రధాని పదవిని హెచ్చు కాలం నిర్వహించింది. నెహ్రూ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పాలన కలుపుకుంటే 38 ఏళ్ల పాటు వారే దేశాన్ని పాలించారు. రాజీవ్ గాంధీతో గాంధీల పాలనకు చెక్ పడింది. 1989 డిసెంబర్ లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడి రాజీవ్ మాజీ అయ్యారు. 1991 మేలో ఆయన మరణించారు. ఇక కాంగ్రెసేతర ప్రధానులలో పీవీ నరసింహారావు అయిదేళ్ళ పాటు పాలిస్తే మన్మోహన్ సింగ్ పదేళ్ళ పాటు పాలించారు.

గాంధీ వంశంలో ఐదవ తరం వారసుడిగా 2004లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాహుల్ గాంధీ ప్రవేశించారు. ఆయన 34 ఏళ్ళ వయసులో తొలిసారి అమేథీ నుంచి పోటీ చేసి ఎంపీ అయ్యారు. ఆ సమయంలో రెండు సార్లు కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ రాహుల్ గాంధీ ప్రధాని అవలేదు. చేతిలో అధికారం ఉన్నా ఆయనే వద్దు అనుకున్నారు. అనుభవం రావాలని ఆగినట్లుగా ప్రచారం సాగింది. కనీసం 2009లో అయినా ఆయన ప్రధాని సీటు అఫర్ వచ్చినా తిరస్కరించారు అన్న ప్రచారం అప్పట్లో సాగింది.

మొత్తానికి చూస్తే గడచిన మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడి ప్రతిపక్షంలోనే ఉంది. ఇలా చూస్తే కనుక 21 ఏళ్ళ రాహుల్ గాంధీ పొలిటికల్ కెరీర్ లో ఆయన గ్రాఫ్ అయితే నెమ్మదిగానే సాగుతోంది అని చెప్పాలి. గతానికి పోలిస్తే ఆయన రాజకీయంగా రాటు దేలారు. కానీ బీజేపీకి వ్యూహాలకు తగిన ప్రతి వ్యూహాలను రూపొందించడంలో ఇంకా తడబడుతున్నారనే చెప్పాల్సి ఉంది.

ఇక 2024 ఎన్నికల తరువాత లీడర్ ఆఫ్ అపోజిషన్ గ లోక్ సభలో ఆయన కేబినెట్ హోదాతో స్థానం దక్కించుకున్నారు . ఒక విధంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ పొలిటికల్ కెరీర్ లో ఇదే ఆయన అందుకున్న అతి పెద్ద అధికార పదవి. ఒక విధంగా ఆయన వెయిటింగ్ ప్రైమ్ మినిస్టర్ గా కూడా ఉన్నారు.

అయితే ఆయనకు ప్రధానమంత్రి పీఠం ఎంత దూరం అన్నదే ఇక్కడ చర్చ. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటంలిలో పెద్దన్నగా ఉంది. ఇండియా కూటమికి ప్రస్తుత లోక్ సభలో 240 దాకా ఎంపీ సీట్లు ఉన్నాయి. అంటే అధికారం అందుకోవాలీ అంటే మ్యాజిక్ ఫిగర్ అయిన 272 సీట్లకు ఇంకా చాలా దూరంలోనే ఇండియా కూటమి ఉంది. ఇందులో కాంగ్రెస్ ఎంపీల సంఖ్య వంద దాకా ఉంది.

మరి రేపటి ఎన్నికల్లో ఇండియా కూటమి మెజారిటీకి తగిన సీట్లు సాధించినా కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీకి ప్రధాని పదవి ఇచ్చేందుకు ఇండియా కూటమి పక్షాలు అంగీకరిస్తాయా అన్నది మరో చర్చ. ఎందుకంటే అక్కడ తృణమూల్ కాంగ్రెస్, ఆప్, ఎస్పీ, ఎన్సీపీ వంటి పార్టీల నుంచి ఎంతో కొంత అభ్యంతరాలు వస్తాయి. అయితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్ధిత్వాన్ని సమర్ధించడానికి తమిళనాడులో బలమైన డీఎంకే అధినేత స్టాలిన్, అలాగే బీహార్ నుంచి ఆర్జేడీ లాలూ సిద్ధంగా ఉంటారు అని చెప్పవచ్చు.

ఈ రెండు పార్టీలకు కలిపి ఒక యాభై మంది ఎంపీలు ఉన్నా కాంగ్రెస్ తానుగా సొంతంగా 150 ఎంపీ సీట్లు 2029 ఎన్నికల్లో తెచ్చుకుంటే రాహుల్ గాంధీ చాలా ఈజీగా ప్రధానమంత్రి అవుతారు. అలా కాకుండా ఇదే వంద సీట్లకే కాంగ్రెస్ పరిమితం అయితే రాహుల్ గాంధీ ప్రధాని పీఠం ఆశలు జీవితకాలం లేటుగానే ఉంటాయని చెప్పక తప్పదు. ఏది ఏమైనా ఈ రోజుతో 55 ఏళ్ళు పూఒర్తి చేసుకుని 56వ పడిలోకి అడుగుపెడుతున్న రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయనలో ఉన్నది ప్రజలకు సేవ చేయాలన్న తపన. లేనిది అధికార వ్యామోహం. మరి ఈ అయిదవతనం గాంధీ ప్రధాని అవుతారా ఎపుడు అవుతారు అన్నది వేచి చూడాల్సిందే.