Begin typing your search above and press return to search.

ఉమ్మడి ఏపీకి సీఎం గా జగన్... జస్ట్ మిస్ !

జగన్ సొంతంగా పార్టీ పెట్టి పదేళ్ళ పాటు పోరాటం చేసి 2019 ఎన్నికల్లో విభజన ఏపీకి సీఎం అయ్యారు.

By:  Satya P   |   12 Jun 2026 9:26 AM IST
ఉమ్మడి ఏపీకి సీఎం గా జగన్... జస్ట్ మిస్ !
X

జగన్ సొంతంగా పార్టీ పెట్టి పదేళ్ళ పాటు పోరాటం చేసి 2019 ఎన్నికల్లో విభజన ఏపీకి సీఎం అయ్యారు. ఆయన రెక్కల కష్టంతోనే ఈ విజయం సంప్రాప్తించింది. అయితే జగన్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగి ఉండి ఉంటే ఏనాడో సీఎం అయి ఉండే వారు అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. జగన్ ఏమి ఆలోచించుకున్నారో తెలియదు కానీ పార్టీని వీడి వెళ్లారని సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఒక యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో పాత విషయాలను కొత్తగా చెప్పారు. నిజానికి ఇప్పటికి 17 ఏళ్ళ క్రితం జరిగిన విషయాల మీద ఈ తరంలో ఎవరికీ పెద్దగా ఏమీ తెలియవు. అంతే కాదు ఆనాడు రాజకీయాల మీద అవగాహన ఉన్న వారికి కూడా లోపాయికారీగా ఏమి జరిగింది కాంగ్రెస్ లో జగన్ విషయంలో ఏమి నిర్ణయం తీసుకున్నారు అన్నది తెలియదు. కానీ రఘువీరారెడ్డి మాత్రం జగన్ అప్పట్లోనే సీఎం అయి ఉండేవారు జస్ట్ మిస్ అన్నట్లుగా చెప్పారు.

నిదానంగానే చేయాలని :

ఇక వైఎస్సార్ విధేయులుగా ఆనాడు ఎంతో మంది మంత్రులు ఎమ్మెల్యేలు ఉండేవారు. 2009లో రెండోసారి కాంగ్రెస్ గెలిచిన వెంటనే మూడు నెలలకు వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలు అయ్యారు. దాంతో ఆయన విధేయులు అంతా జగన్ ని సీఎం చేయాలని అనుకున్నారు. ఇక జగన్ సైతం తన తండ్రి సీఎం పదవిని ఆశించారు అని ప్రచారం అయితే సాగింది. అయితే జగన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి కడప ఎంపీగా గెలిచి కేవలం మూడు నెలలు మాత్రమే అయింది. దాంతో ఆయన రాజకీయ అనుభవం అన్నీ పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్ హైకమాండ్ కేంద్రంలో మంత్రిగా చేరమని కోరింది అని రఘువీరారెడ్డి చెబుతున్నారు. కేంద్రంలో జగన్ కి ఇండిపెండెంట్ చార్జీతో మినిస్టర్ పదవి ఇస్తామని కూడా చెప్పినట్లుగా తాజా ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.

రోశయ్య తరువాత ఆయనే :

అయితే జగన్ కనుక కాంగ్రెస్ పెద్దల సూచనలు విని ఉంటే రోశయ్య తరువాత కచ్చితంగా ఆయనే ఉమ్మడి ఏపీకి సీఎం అయి ఉండేవారు అని రఘువీరారెడ్డి నమ్మకంగా చెబుతున్నారు. ఒక జగన్ ఓదార్పు యాత్రను చేపడతాను అని చెప్పడం ప్రతీ చోటకు తాను స్వయంగా వెళ్తాను అని చెప్పడంతో అక్కడే అధినాయకత్వానికి ఆయనకు గ్యాప్ వచ్చింది అని అంటున్నారు. జగన్ తాను మాట ఇచ్చాను కాబట్టి వెళ్తాను అని ఒక కీలక నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ పార్టీకి 2010 నవంబర్ 29న రాజీనామా చేసి తన ఎంపీ పదవిని వదులుకున్న సంగతి విధితమే ఇక 2011 మార్చి 12న ఆయన వైసీపీని స్థాపించారు. ఆ ఏడాది మేలో జరిగిన కడప ఉప ఎన్నికల్లో ఆయన అయిదున్నర లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ఇక విభజన ఏపీలో వైసీపీ కధ అందరికీ తెలిసిందే.

కరెక్ట్ డెసిషనేనా :

అయితే రఘువీరారెడ్డి పక్కా కాంగ్రెస్ వాది. ఆయన కాంగ్రెస్ ఏపీలో పూర్తిగా నష్టపోయింది అన్న ఆవేదనతో మాట్లాడుతున్నారు అని అంటున్నారు. జగన్ కనుక కాంగ్రెస్ లో ఉండి ఉంటే కొన్నాళ్ళు సీఎంగా చేసినా చరిత్రలో ఆయన వెనక్కి వెళ్ళిపోయేవారు అని అంటున్నారు. ఆయన సొంతంగా పార్టీ పెట్టి రాజకీయంగా పోరాటాలు చేయడం వల్లనే నిలదొక్కుకుని ఈ రోజుకీ ఓటమి చెందినా అగ్ర నాయకుడిగా ఉన్నారని చెబుతున్నారు కాంగ్రెస్ లో నాయకుల ఎదుగుదల ఉండదని అంటున్న వారూ ఉన్నారు. అయితే జగన్ కాంగ్రెస్ ని వీడడం వల్ల ఏపీలో ఆ పార్టీ కుదేలు అయిపోయింది. మూడు ఎన్నికల్లో వరసగా దెబ్బ తిన్నది. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా వైసీపీకి మళ్ళిపోయింది. మొత్తానికి జగన్ ఫ్యాక్టర్ అయితే కాంగ్రెస్ కి నష్టం చేసింది. కానీ కాంగ్రెస్ ని వీడి బయటకు వచ్చిన జగన్ కి మాత్రం రాజకీయంగా మేలు జరిగింది అన్న విశ్లేషణలు ఉన్నాయి.