Begin typing your search above and press return to search.

ఆర్‌ఆర్‌ఆర్‌ కు సీటు కష్టమేనా?

ఇప్పుడు రఘురామ ఆశించినట్టే టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు కుదిరింది.

By:  Tupaki Desk   |   14 March 2024 7:58 AM GMT
ఆర్‌ఆర్‌ఆర్‌ కు సీటు కష్టమేనా?
X

రఘురామకృష్ణరాజు పరిచయం అక్కర్లేని పేరు. 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం పార్లమెంటరీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆయన విజయం సాధించారు. అయితే కొద్ది కాలానికే ఆ పార్టీతో విభేదించి జగన్‌ ప్రభుత్వంపైన తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం రాజ ద్రోహం కేసులు నమోదు చేయించి అరెస్టు చేయించింది. ఇంకా అనేక కేసులను ఆయనపై నమోదు చేసింది. ప్రస్తుతం ఈ కేసులకు సంబంధించి ఆర్‌ఆర్‌ఆర్‌ బెయిల్‌ పైన ఉన్నారు.

కాగా సోషల్‌ మీడియా, యూట్యూబ్‌ ద్వారా తరచూ వైసీపీ ప్రభుత్వంపైన, పార్టీపైన విమర్శలు చేస్తున్న రఘురామకృష్ణరాజు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. తనకు ప్రతిపక్ష కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ.. ఇలా అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలు ఉన్నాయని.. కాబట్టి నరసాపురం లోక్‌ సభ సీటును ఏ పార్టీకి కేటాయించినా ఆ పార్టీ తరఫున తాను పోటీ చేస్తానని రఘురామకృష్ణరాజు ఇప్పటికే వెల్లడించారు.

ఇప్పుడు రఘురామ ఆశించినట్టే టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు కుదిరింది. ఆయన ఏ పార్టీ సీటును ఆశించినా కాదనేవారయితే దాదాపు లేనట్టే. అయితే నరసాపురం సీటును బీజేపీ ఆశిస్తుందని ప్రచారం జరుగుతోంది. గతంలో నరసాపురం ఎంపీ సీటు నుంచి బీజేపీ తరఫున ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు, గోకరాజు గంగరాజు వంటివారు గెలుపొందారు.

ఈ నేపథ్యంలో నరసాపురం ఎంపీ సీటును బీజేపీ మరోమారు ఆశిస్తోందని చెబుతున్నారు. ఈ క్రమంలో స్వతహాగా రఘురామకృష్ణరాజు బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

అయితే వచ్చే ఎన్నికల కోసం బీజేపీకి ఆరు ఎంపీ సీట్లను మాత్రమే పొత్తులో భాగంగా కేటాయించారు. దీంతో అభ్యర్థుల నుంచి పోటీ ఎక్కువైంది. అందులోనూ కేంద్రంలో వచ్చేసారి కూడా బీజేపీ ప్రభుత్వమే వస్తుందని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీగా గెలిస్తే ఆంధ్రప్రదేశ్‌ కోటాలో కేంద్ర మంత్రి పదవిని దక్కించుకునే అవకాశం ఉంది. దీంతో ఎమ్మెల్యేగా కంటే ఎంపీగా పోటీ చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.

రఘురామకృష్ణరాజు కూడా నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి కాలం కలిసివస్తే కేంద్ర మంత్రిని కావాలని ఆశపడుతున్నారని టాక్‌. ప్రధాని మోదీ మొదలుకుని బీజేపీ ముఖ్య నేతలందరితోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ లతోనూ మంచి సంబంధాలే ఉన్నాయి.

అయితే రఘురామకృష్ణరాజు పోటీకి ఆరుగురు బీజేపీ నేతలు అడ్డు తగులుతున్నారని టాక్‌ నడుస్తోంది. ఈ ఆరుగురు ఆర్‌ఆర్‌ఆర్‌ బీజేపీలోకి రావడాన్ని వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు.

బీజేపీ నేతలు.. విష్ణువర్ధన్‌ రెడ్డి, కేతినేని సురేంద్ర, నిర్మల, శాంతారెడ్డి, దయాకర్‌ రెడ్డి, పాకా సత్యనారాయణ.... రఘురామకృష్ణరాజు బీజేపీలోకి రాకను వ్యతిరేకిస్తున్నారని చెబుతున్నారు. ఆయన బీజేపీలో చేరకుండా ఇప్పటికే ఈ ఆరుగురు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు టాక్‌. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు నరసాపురం సీటును దక్కించుకోగలరా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.