Begin typing your search above and press return to search.

రఘురామ వ్యంగ్యాస్త్రాలు.. నొచ్చుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు!?

ఆయన తర్వాత సభాధ్యక్ష స్థానంలోకి వచ్చిన డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీసినట్లు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   19 Sept 2025 12:18 AM IST
రఘురామ వ్యంగ్యాస్త్రాలు.. నొచ్చుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు!?
X

డిప్యూటీ సీఎం రఘురామ తీరుపై టీడీపీ ఎమ్మెల్యేలు అంతర్గతంగా రగిలిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న రఘురామ సభను హుందాగా నడపాల్సివుండగా, ఆయన గోదావరి వెటకారం ప్రదర్శిస్తూ ఎమ్మెల్యేలను అవమానిస్తున్నారని చర్చ జరుగుతోంది. సభను సమర్థంగా నడపాలనే ఆలోచన మంచిదే అయినా, ఎమ్మెల్యేల విషయంలో ఆయన వాడుతున్న భాషపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవగా, రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ విషయంలో రఘురామరాజు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి.

డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు మంచి మాటకారిగా చెబుతారు. విమర్శనాత్మక ధోరణితో ఆయన మాట్లాడే మాటలు చాలా మందిని ఆకట్టుకుంటాయి. కానీ, ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడతారో వారు మాత్రం చిన్నబుచ్చుకుంటారనేది ఎక్కువ మంది అభిప్రాయం. గత ప్రభుత్వంలో ఇలానే వ్యవహరించిన ఆయన వైసీపీకి దూరమయ్యారు. ఆయన నోటి మాటల వల్లే అనేక ఇబ్బందులు పడ్డారని పరిశీలకులు చెబుతుంటారు. గోదావరి జిల్లాలకు చెందిన రఘురామలో అనువనువునా గోదావరి వెటకారం కనిపిస్తుంది. అయితే ఇది ఎంత హాస్యం తెప్పిస్తుందో.. అంతకు మించిన ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు.

గురువారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవగా, స్పీకర్ అయ్యన్నపాత్రుడు చాలా సమయం సభను నడిపారు. ఆయన తర్వాత సభాధ్యక్ష స్థానంలోకి వచ్చిన డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీసినట్లు చెబుతున్నారు. జీఎస్టీ సవరణలకు సంబంధించి రెండు బిల్లులను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడారు. ఆ సమయంలో సభాధ్యక్ష స్థానంలో ఉన్న రఘురామ ఎమ్మెల్యే ప్రసంగం ఆపాలని రెండు సార్లు బెల్ మోగించారు.

కానీ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తన ప్రసంగాన్ని కొనసాగిండంపై డిప్యూటీ స్పీకర్ రఘురామ అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రసంగం ముగిసిన తర్వాత మాట్లాడిన రఘురామ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వివరంగా మాట్లాడారంటూనే తర్వాత మాట్లాడే వారు దయచేసి ఆయనను ఆదర్శంగా తీసుకోవద్దని సభ్యుల సహనాన్ని పరీక్షించొద్దని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారని అంటున్నారు. పెద్దలు కొణతాల రామక్రిష్ణకు మాట్లాడే అవకాశం ఇస్తున్నట్లు చెప్పగా, ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ఎమ్మెల్యే శ్రావణ్ ను ఆదర్శంగా తీసుకోవాలని అంటారని అనుకున్నామని రఘురామకు చురక వేశారని అంటున్నారు. డిప్యూటీ స్పీకర్ మాటలు నవ్వులు పూయించినా, మాట్లాడే సభ్యులు మాత్రం చిన్నబుచ్చుకుంటున్నట్లు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.