Begin typing your search above and press return to search.

పవన్ చేసింది నూటికి నూరు శాతం కరెక్టు.. తేల్చేసిన రఘురామ

విశాఖలో జరిగిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన రఘురామ.. ‘‘ఆయనొక మంచి ఆఫీసర్. నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెబుతాను.

By:  Garuda Media   |   24 Oct 2025 9:57 AM IST
పవన్ చేసింది నూటికి నూరు శాతం కరెక్టు.. తేల్చేసిన రఘురామ
X

అందుకే అంటారు మాట తీస్తే మాట అంటారు. మంటలు రేపే మాటల్ని సైతం మాటలే చల్లబరిచేలా చేయటమే కాదు.. మరింత నష్టం కలగకుండా డ్యామేజ్ కంట్రోల్ చేస్తుందన్న విషయాన్ని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు తన చేతలతో నిరూపించారని చెప్పాలి. కొద్ది రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు భిన్నమైన వ్యాఖ్యలు చేయటం.. ఇది కాస్తా జనసైనికులకు ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. అయితే.. ఈ ఇష్యూను మరింత ముదిరేలా కాకుండా తన మాటలతో వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేలా వ్యవహరించారు రఘురామ. ఇంతకూ అసలేం జరిగింది? అన్న వివరాల్లోకి వెళితే..

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య తీరుపై నాలుగు రోజుల క్రితం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు.. జిల్లా ఎస్పీ నయూం అష్మికి ఫోన్ చేసి.. రిపోర్టు ఇవ్వాలని కోరారు. డీఎస్పీ పని తీరు బాగోలేదని.. ఆయనపై అనేక కంప్లైంట్లు వస్తున్నట్లుగా పేర్కొన్న పవన్ కల్యాణ్.. ‘ఆయన సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారు. కొందరిపట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. కొందరు కూటమి నేతల మద్దతు ఉందని కొందరి పేర్లను వాడుతున్నారు. దీనిపై నాకు రిపోర్టు ఇవ్వండి’ అని పవన్ పేర్కొన్నారు. అంతేకాదు.. డీఎస్పీ పై వస్తున్న ఆరోపణల్ని రాష్ట్ర హోం మంత్రి అనితకు.. రాష్ట్ర డీజీపీకి కూడా సమాచారం అందించాలని పవన్ పేర్కొన్నారు.

దీనికి సంబంధించిన వివరాల్ని జనసేన తన ప్రెస్ నోట్ లోనూ తెలియజేసింది. అంటే.. ఇదేమీ రహస్యంగా కాకుండా బహిరంగంగానే తాను చేసిన పని గురించి పవన్ చెప్పుకున్నారని చెప్పాలి. అయితే.. వివాదం మొదలు కావటానికి కారణం ఏపీ డిప్యూటీ సీఎం రఘురామ చేసిన వ్యాఖ్యగా చెప్పాలి. ఆరోపణలు వస్తున్నాయని ఏ డీఎస్పీ మీద పవన్ పేర్కొన్నారో.. సదరు ఆఫీసర్ మంచివాడని రఘరామ పేర్కొనటం.. అదో ఇష్యూగా మారింది. విశాఖలో జరిగిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన రఘురామ.. ‘‘ఆయనొక మంచి ఆఫీసర్. నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెబుతాను. గోదావరి జిల్లాల్లో ఎవరు పడితే వారు ఇళ్లల్లోనే పేకాట ఆడేస్తుంటారు. పేకాట మీద గవర్నమెంట్ ఉక్కుపాదం మోపిన తర్వాత భీమవరమే కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎక్కడా జరగట్లేదు’’ అని వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. పవన్ కల్యాణ్ తన శాఖకే పరిమితం కాకుండా మిగిలిన శాఖల్ని కూడా పట్టించుకోవటం సంతోషించాల్సిన అంశంగా రఘురామ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్య చేసిన వేళలో రఘురామ పక్కన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు జనసేనకు చెందిన అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల శ్రీనివాసరావు ఉన్నారు. రఘురామ చేసిన వ్యాఖ్యపై జనసైనికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. డీఎస్పీపై డిప్యూటీ సీఎం పవన్ చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా రఘురామ బహిరంగంగా ఎలా మాట్లాడతారంటూ జనసేన సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రశ్నించటంతో ఇష్యూ మరో దిశగా ప్రయాణించటం మొదలైంది.

ఇదిలా ఉండగా.. ఈ అంశాన్ని మరింత ముదరకుండా ఉండేందుకు వీలుగా రఘురామ తాజాగా స్పందించారు. విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. భీమవరం డీఎస్పీపై తనకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని.. తన పరిధిలో ఉన్న అధికారి కావటంతో తనకు తెలిసింది చెప్పినట్లుగా పేర్కొన్నారు. అయితే.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిమానులు తనను అపార్థం చేసుకున్నారన్నారు.

‘‘నాకు వచ్చిన సమాచారం తప్పు కావొచ్చు. పవన్ కల్యాణ్ కు వచ్చిన ఫిర్యాదులు సరైనవి కావొచ్చు. ఆ విషయాలు విచారణలో తేలతాయి. ఒక ప్రజాప్రతినిధిగా బాధ్యత కలిగిన డిప్యూటీ సీఎంగా.. ఒక పార్టీ అధినేతగా ఆయన చేసింది నూటికి నూరుపాళ్లు సబబు. దీనికి డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ స్పీకర్ అంటూ ప్రచారం చేయటం కరెక్టు కాదు. ఆయన పోస్టు చాలా పెద్దది. ఆయన మాటల్ని పూర్తిగా సమర్థించే నేను.. నాకు తెలిసిన విషయాల్ని చెప్పానంతే’’ అంటూ ఇష్యూను క్లోజ్ చేసేలా మాట్లాడారని చెప్పాలి. మాటల మధ్య తేడాలు.. రాజకీయంగా మరింత ముదరకుండా రఘురామ మాదిరి మెచ్యూరిటీతో వ్యవహరించటం మంచి పరిణామంగా చెప్పక తప్పదు.