Begin typing your search above and press return to search.

మీ ఓట్లు అడగను.. డిప్యూటీ స్పీకర్ రఘురామ సంచలన వ్యాఖ్యలు

ఓటు చాలా విలువైనది. ఒక్క ఓటు తేడాతో కూడా జాతకాలు తారుమారు అవుతాయి. అందుకే ప్రతి నాయకుడు ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి తెగ ప్రయాస పడతారు.

By:  Tupaki Political Desk   |   19 May 2026 11:04 PM IST
మీ ఓట్లు అడగను.. డిప్యూటీ స్పీకర్ రఘురామ సంచలన వ్యాఖ్యలు
X

ఓటు చాలా విలువైనది. ఒక్క ఓటు తేడాతో కూడా జాతకాలు తారుమారు అవుతాయి. అందుకే ప్రతి నాయకుడు ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి తెగ ప్రయాస పడతారు. ఏ ఒక్క ఓటు కూడా వదలకూడదని ప్రయత్నిస్తుంటారు. కానీ, ఇందుకు భిన్నంగా నాకు మీ ఓట్లు వద్దు.. మీ వద్దకు వచ్చి ఓట్లు అడగను అంటూ తెగేసి చెబుతున్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు. ఏపీ రాజకీయాల్లో నిత్యం ఏదో ఒక అంశంతో హాట్ డిబేట్ కు సెంటర్ పాయింట్ అవుతుంటారు రఘురామరాజు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా ఓట్లు వద్దు అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి నియోజకవర్గంలోని కొన్ని రోజులుగా రామాలయ నిర్మాణంపై పెద్ద వివాదమే జరుగుతోంది. నియోజకవర్గం పరిధిలోని ఆకివీడు పట్టణం పెద్దపేటలో జీర్ణావస్థలో ఉన్న రామాలయాన్ని పునరుద్ధరించాలని రఘురామరాజు భావించారు. శ్రీరామ నవమి పురస్కరించుకుని ఆ ఆలయాన్ని రఘురామ సందర్శించగా, స్థానికులైన దళిత క్రిష్టియన్లు అది రామాలయం కాదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో డిప్యూటీ స్పీకర్ రఘురామతోపాటు ఆయనతో ఉన్న కూటమి కార్యకర్తలపై దాడికి ప్రయత్నించారు.

ఇక అప్పటి నుంచి రామాలయం నిర్మాణానికి కంకణం కట్టుకున్న రఘురామరాజు కోర్టు సూచనలతో పక్కాగా తన పని కానిచ్చేస్తున్నారు. అయితే రఘురామ ప్రయత్నాలను కొందరు దళిత క్రిష్టియన్లు అడ్డుకోనే ప్రయత్నాలు చేస్తుండటం, వారిపై బహిరంగంగా డిప్యూటీ స్పీకర్ విమర్శలు చేస్తుండటం కొన్ని రోజులుగా నిత్యకృత్యంగా మారింది. దళిత క్రిస్టియన్లపై రఘురామరాజు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేస్తున్నాయని ఆ పార్టీలో కొందరు సీనియర్లు గుసగుసలాడుతున్నారని కూడా చెబుతున్నారు. ఇదే సమయంలో టీడీపీకి చెందిన మహాసేన రాజేశ్ సైతం వివాదానికి సంబంధం లేకుండా కుల, మతాలను రెచ్చగొట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలో రఘురామ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై ఉన్న కోపాన్ని పార్టీపై చూపొద్దంటూ దళిత క్రైస్తవులను అభ్యర్థించిన రఘురామ.. వారి ఓట్ల కోసం తాను ప్రయత్నించనని తెగేసి చెప్పారు. రాజకీయాల్లో ఉంటూ మీ ఓట్లు వద్దు అన్న విధంగా రఘురామ మాట్లాడమే పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. జీసస్ అందరినీ ప్రేమించమన్నారు. కానీ, మీరు ద్వేషించే మార్గంలో వెళుతున్నారంటూ తన రాజకీయ ప్రత్యర్థులపై వాగ్బాణాలు సంధించారు.