రఘురామ కొత్త పార్టీ ‘తెలుగు వీర లేవరా’.. క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ స్పీకర్!
డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు కొత్త పార్టీ పెడుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు.
By: Tupaki Political Desk | 23 May 2026 9:39 AM ISTడిప్యూటీ స్పీకర్ రఘురామరాజు కొత్త పార్టీ పెడుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. ‘తెలుగు వీర లేవరా’ అనే సొసైటీని స్థాపించిన డిప్యూటీ స్పీకర్ దానిని రాజకీయ పార్టీగా మార్చనున్నారని సోషల్ మీడియా వేదికగా భారీ ప్రచారం జరుగుతోంది. దీంతో అప్రమత్తమైన రఘురామరాజు ఆ ప్రచారంపై స్పష్టత ఇచ్చారు. కొందరు కావాలనే కొత్త పార్టీ పెడుతున్నానంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని వివరణ ఇచ్చారు.
డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు ఇచ్చిన క్లారిటీతో కొత్త పార్టీ పెడుతున్నారని జరుగుతున్న ప్రచారం ఉత్తిదే అని తేలిపోయిందని అంటున్నారు. కొత్త పార్టీ అంటూ జరుగుతున్న ప్రచారం ఖండిస్తూ రఘురామరాజు వీడియో విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై అవగాహన కల్పించేందుకు మాత్రమే తాను ‘తెలుగు వీర లేవరా’ అన్న సొసైటీని ప్రారంభించానని డిప్యూటీ స్పీకర్ తెలిపారు. తప్పుడు కేసులతో తాను పడిన ఇబ్బందులు మరెవరూ పడకూడదనే ఉద్దేశంతోనే సొసైటీని ప్రారంభించానని రఘురామ వెల్లడించారు. ఈ అంశాలపై ప్రజల ఇబ్బందులను తెలుసుకుంటూ వారికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు తమ సొసైటీ పనిచేస్తుందని వెల్లడించారు.
కానీ, గిట్టని వ్యక్తులు తమ సొసైటీని కొత్త పార్టీ అంటూ దుష్ప్రచారం చేయడం ద్వారా కూటమిలో విభేదాల సృష్టికి పనిచేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ వీడియోతో రఘురామరాజు కొత్త పార్టీ పెడుతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారని అంటున్నారు. రఘురామరాజు సొంత నియోజకవర్గంలో రామాలయ నిర్మాణంపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అకివీడు పెదపేటలో రామాలయ నిర్మాణానికి కంకణం కట్టుకున్న రఘురామ ఓ వర్గంపై పోరాడుతున్నారని చెబుతున్నారు.
అయితే ఈ విషయంలో టీడీపీ అధిష్టానం ఆయనకు మద్దతుగా నిలవడంపై తర్జనభర్జన పడుతోందని, దీంతో అసంతృప్తి చెందిన రఘురామ కొత్త పార్టీ పెట్టుకోవాలనే ఆలోచన చేస్తున్నారని కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని చెబుతున్నారు. అయితే రాజకీయ ప్రత్యర్థులు తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఈ ప్రచారం ప్రారంభించారని వెంటనే గుర్తించిన డిప్యూటీ స్పీకర్ ప్రత్యేకంగా వీడియో విడుదల చేశారు. దీంతో రఘురామకు టీడీపీకి మధ్య మంచి అనుబంధం కొనసాగుతుందని తేలిపోయిందని అంటున్నారు.
