Begin typing your search above and press return to search.

రఘరామ కస్టోడియల్ టార్చర్ కేసులో భారీ ట్విస్టు

రఘురామ రాజుకు తగిలిన అంతర్గత గాయాల గురించి ప్రశ్నించినప్పుడు ఆమె ఇచ్చిన సమాధానం అధికారులకు విస్మయానికి గురి చేసింది.

By:  Tupaki Desk   |   9 April 2025 5:22 AM
రఘరామ కస్టోడియల్ టార్చర్ కేసులో భారీ ట్విస్టు
X

అందుకే అంటారు డ్యూటీని డ్యూటీగా చేయకుండా పని చేస్తే వచ్చే కష్టం.. నష్టం ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా పలువురు అధికారులు చూస్తున్నారు ఏపీలో. డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజుకు సంబంధించి గతంలో చోటు చేసుకున్న కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి పలువురు అధికారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పోలీసు విచారణ వేళ.. అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు ఇస్తున్న జవాబులు ఆశ్చర్యకరంగా మారాయి.

రఘురామ క్రిష్ణ రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు జనరల్ ఆసుపత్రి రిటైర్డ్ సూపరింటెండెంట్ నీలం ప్రభావతి తాజాగా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఎదుట రెండు రోజుల పాటు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అడిగిన పలు ప్రశ్నలకు ముక్తసరిగా జవాబులు ఇచ్చారు. రఘురామ రాజుకు తగిలిన అంతర్గత గాయాల గురించి ప్రశ్నించినప్పుడు ఆమె ఇచ్చిన సమాధానం అధికారులకు విస్మయానికి గురి చేసింది.

తానో గైనకాలజిస్టునని.. ఆసుపత్రి సూపరింటెండెంట్ హోదాలో పని చేసినప్పికీ శరీరంలో అంతర్గత గాయాల గురించి పెద్దగా అవగాహన లేదని చెప్పేశారు. అప్పట్లో తమ వైద్య సిబ్బంది రఘురామ క్రిష్ణరాజును పరిశీలించారని.. గాయాలు ఏమీ లేవని రిపోర్టు ఇస్తే.. తాను చదివి సంతకం చేశానే తప్పించి తనకేమీ తెలీదని బదులిచ్చారు. ఇంతకు మించి మరేదైనా సమాచారం కావాలంటే తానేమీ చెప్పలేనని స్పష్టం చేశారు. ఎందుకంటే..ఆమె అప్పటి విషయాల్ని మర్చిపోయినట్లుగా చెప్పారు.

పోలీసు విచారణలో డాక్టర్ ప్రభావతి ఇచ్చిన సమాధానాలు పోలీసు అధికారుల సహనానికి పరీక్షగా మారినట్లు చెబుతున్నారు. డాక్టరమ్మ చెప్పిన మాటల్నే పరిగణలోకి తీసుకుంటే బోలెడన్ని సందేహాలు తెర మీదకు వస్తాయి. అప్పట్లో రఘురామ ఏమీ సాదాసీదా వ్యక్తి కాదు. ఆమె సూపరింటెండెంట్ గా ఉన్న ఆసుపత్రికి వచ్చే మామూలు రోగి కాదు.. ఆమె పెద్దగా పట్టించుకోకపోవటానికి. ఒక లోక్ సభ సభ్యుడికి సంబంధించిన వ్యవహారాన్ని తాను పర్యవేక్షించకుండా సింఫుల్ గా.. రిపోర్టు చదివి సంతకం చేశానని చెప్పటంలోనే విషయం అర్థమవుతుందన్న మాట వినిపిస్తోంది.

ఒక తీవ్రమైన ఆరోపణ.. అందునా హైప్రొఫైల్ కేసుల్ని అంత రోటీన్ గా రిపోర్టు చదివి సంతకం చేస్తానని చెప్పటాన్ని ఎలా చూడాలి? అంతేకాదు.. ఒకవేళ.. తనకు అంత అవగాహన లేనప్పుడు.. అదే విషయాన్ని వెల్లడించి.. ఆ రంగంలో అనుభవం ఉన్న సీనియర్ వద్దకు ఎందుకు పంపలేదు? అన్నది ప్రశ్న. ఏమైనా.. డాక్టరమ్మ తన డ్యూటీని ఎలా చేశారన్న దానికి తాజాగా జరిగిన విచారణ సందర్భంగా చెప్పిన సమాధానాల్ని వింటేనే అర్తమవుతుందని చెప్పక తప్పదు.