రామాలయం వర్సెస్ ఆర్ ఆర్ ఆర్.. ఏం జరుగుతుంది?
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గంలో ఉన్న ఆకివీడు మండలం, పెదపాడు గ్రామంలో నెలకొన్న రామాలయ వివాదంపై బుధవారం హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
By: Garuda Media | 16 April 2026 12:27 AM ISTఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గంలో ఉన్న ఆకివీడు మండలం, పెదపాడు గ్రామంలో నెలకొన్న రామాలయ వివాదంపై బుధవారం హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక్కడి పురాతన ఆలయం స్థానంలో కొత్తగా రామాలయం నిర్మించాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు భావించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే ఆయన కోటి రూపాయలకు పైగా సొమ్మును చందాల రూపంలో సేకరించారు. గత నెలలో ఇక్కడకు ఆయన రావడం, పురాతన ఆలయంలో శ్రీరాముడి విగ్రహానికి పూల దండ వేసే ప్రయత్నం చేయడం.. అనంతరం ఇది వివాదంగా మారడం తెలిసిందే.
అయితే.. రఘురామ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఈ ఆలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న క్రైస్తవ సంఘాలపై ఆయన నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు ఈ పురాతన ఆలయ నిర్మాణానికి మేలోనే శంకుస్థాపన చేయనున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించి 9,99,999 రూపాయలను శిలల కోసం ఇటీవల అడ్వాన్సుగా కూడా చెల్లించారు. ఇలా.. ఆయన ఒకవైపు దూకుడుగా వ్యవహరిస్తుంటే.. తాజాగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆకివీడులోని పెదపాడులో ఉన్న పురాతన ఆలయ నిర్మాణాలను కూల్చేందుకు అనుమతులు లేవని పేర్కొంది. ఒకవేళ ఏదైనా చేయాలని అనుకుంటే కోర్టు అనుమతి తీసుకోవాలని ఆదేశించింది.
అంతేకాదు.. స్థానికు అంగీకారంతోపాటు.. ఆలయ నిర్మాణానికి సంబంధించి అధికారుల నుంచి అనుమతులు కూడా తీసుకో వాలని పేర్కొంది. దీంతో ఇప్పుడు ఆకివీడు రామాలయంపై ఏం చేస్తారన్న ప్రశ్నగా మారింది. మరోవైపు హైకోర్టు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పాత్రను కూడా ప్రశ్నించింది. ఏం చేస్తున్నారంటూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం గమనార్హం. దీంతో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుతుందన్నది చూడాలి. మరోవైపు.. ఈ వ్యవహారంపై ఎవరికి వారు దూకుడుగానే వ్యవహరిస్తున్నారు.
రఘురామ సంచలన వ్యాఖ్యలు
ఆకివీడు పరిధిలో అనుమతి లేని మతపరమైన కట్టడాల విషయంలో రాజీ లేదని రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. మత పరమైన కట్టడాలకు జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరి అని వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెంలో అపార్ట్‌మెంట్ పేరుతో కల్వరి టెంపుల్ అక్రమ నిర్మాణం చేశారని పేర్కొన్నారు. రామాలయానికైనా, కల్వరి టెంపుల్‌కైనా చట్టం సమానంగా వర్తిస్తుందన్నారు. చట్టవిరుద్ధమైన కట్టడాలపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపై పోరాటం ఆపబోనని రఘురామ స్పష్టం చేశారు. ``మనం చేసిన చట్టాలను మనమే పాటించకపోతే, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి`` అంటూ రఘురామ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై దళిత క్రైస్తవులు నిప్పులు చెరుగుతున్నారు.
