నలుగురు నీలి కుమారులు...రఘురామ సెటైర్లు
ఆ నలుగురు నీలి కుమారులు గోల చేస్తున్నారు, అయినా పట్టించుకునేది లేదు ఆకివీడులో రామాలయం నిర్మాణం జరిగి తీరుతుంది.
By: Tupaki Desk | 4 May 2026 9:30 AM ISTఆ నలుగురు నీలి కుమారులు గోల చేస్తున్నారు, అయినా పట్టించుకునేది లేదు ఆకివీడులో రామాలయం నిర్మాణం జరిగి తీరుతుంది. ఏడు నెలలలో దానిని ప్రారంభిస్తామని ఉప సభాపతి రఘురామ క్రిష్ణం రాజు స్పష్టంగా చెప్పారు. తన నియోజకవర్గంలోని ఆకివీడులో రామాలయానికి ఆయన ఆదివారం మంచి ముహూర్తంలో భూమి పూజ చేసి పునాది రాయి వేశారు. ఇక భవ్యమైన దివ్యమైన రామాలయాన్ని నిర్మిస్తామని ఆయన చెప్పారు. ఈ మేరకు ఒక ప్రముఖ తెలుగు టీవీ చానల్ కి ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ ఆకివీడు రామాలయం వెనక ఉన్న వివాదాల గురించి పూర్తి వివరాలు చెప్పారు.
గొంతాలమ్మ ఆలయమే లేదు :
గొంతాలమ్మకు ఆకివీడులోనే కాదు దేశంలో ఎక్కడా ఆలయమే లేదు అని రఘురామ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దళితులు అట్లతద్ది రోజున పిండి బొమ్మను చేసి దానిని ఊరేగించి ఆ రోజునే నిమజ్జనం చేస్తారని ఆయన చెప్పారు. కానీ గొంతు చించుకుని నలుగురు నీలి కుమారులు బయల్దేరారు అని వారంతా ఎక్కడ లేని ప్రేమను ఇపుడు చూపిస్తున్నారు అని హాట్ కామెంట్స్ చేశారు. గత చాలా కాలంగా గొంతాలమ్మ ఆలయం అని వీరు అంటున్న ప్రదేశం ఒక డస్ట్ బిన్ గా మారిపోతే వీరు ఏమి చేశారు అని ప్రశ్నించారు. అక్కడ రామాలయం కడదామని తాను ప్రయత్నం చేస్తే రాజ్యాంగ పదవిలో ఉన్న తన మీద దాడులు చేస్తారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎనభై శాతం మందికి తాను :
తాను ఒక్కడిని కాదని రఘురామ రీ సౌండ్ చేశారు. నూటికి ఎనభై శాతం మంది ఉన్న హిందువులకు తాను ప్రతినిధిని అని ఆయన గట్టిగా చెప్పారు. అనుమతులు అన్నీ తీసుకునే రామాలయం కడుతున్నామని అన్నారు. తన నియోజకవర్గంలో ప్రజలు రామాలయం గురించి సమస్య చెబితే తాను వచ్చాను అని వారి కోరిక మేరకు అక్కడ నిర్మాణం జరుగుతోంది అని రఘురామ చెప్పారు. ఒక ప్రజా ప్రతినిధిగా తాను ఈ విధంగా స్పందించడం కూడా తప్పేనా అని ఆయన అన్నారు. తనలాంటి రాజ్యాంగ పదవిలో ఉన్న వారికే ఇలా ఇబ్బంది పెట్టి దాడులు చేస్తే ఇక సామాన్యుల సంగతేంటి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దళితులు దాడి చేయరు :
దళితులు ఎపుడూ దాడులు చేయరని రఘురామ అన్నారు. రాజకీయ ముసుగులో కొంత మంది నీలి కుమారులు చేస్తున్న యాగీ ఇదంతా అని రాఘురామ పేర్కొన్నారు. ప్రతీ ఆదివారం చర్చికి వెళ్ళి ప్రార్ధనలు చేసిన వారు క్రిస్టియన్లు కాకుండా ఏమవుతారు అని ఆయన ప్రశ్నించారు. అసలు హిందూ దేవాలయాలతో వారికి పనేంటి అని అన్నారు. మత విద్వేషాలు రగిల్చడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అని రఘురామ మండిపడ్డారు. కావాలని కొంతమందిని రెచ్చగొడుతున్నారని కూడా ఆయన కొడుతున్నారని ఆయన విమర్శించారు.
తప్పుడు సమాచారంతోనే :
మంద క్రిష్ణ మాదిగకు కొందరు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్లనే ఆయన తన మీద విమర్శలు చేసి ఉంటారని అన్నారు. అయినా హైదరాబాద్ నుంచి ఆయన వచ్చి ఆకివీడులో సమస్యలు చూసి చెప్పేంతవరకు ప్రభుత్వానికి ఇక్కడ విషయాలు తెలియవని ఎవరైనా అనుకుంటారా అని రఘురామ ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధంగానే తాము అన్నీ చేస్తున్నామని అన్నారు. మరో ఏడు నెలలలో రామాలయం పూర్తి చేసి ఘనంగా ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే నలుగురు నీలి కుమారులు అంటూ రఘురామ చేసిన వ్యాఖ్యలు ఇపుడు వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో దళిత క్రిస్టియన్లు కొందరు తన మీద దాడులు చేసేందుకు ప్రయత్నించారు అని సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది.
