Begin typing your search above and press return to search.

'దేవుడికోసం ఒక మతం.. బెనిఫిట్స్ కోసం మరో మతమా?' - రఘురామరాజు సంచలన వ్యాఖ్యలు

మత మార్పిడులపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాట్ కామెంట్స్ చేశారు.

By:  Tupaki Political Desk   |   14 April 2026 3:53 PM IST
దేవుడికోసం ఒక మతం.. బెనిఫిట్స్ కోసం మరో మతమా? - రఘురామరాజు సంచలన వ్యాఖ్యలు
X

మత మార్పిడులపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాట్ కామెంట్స్ చేశారు. గత కొంతకాలంగా మత మార్పిడులపై ఆగ్రహంగా ఉన్న రఘురామ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మతం మార్చుకున్న దళితులు వచ్చే పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్లను పొందడానికి కుదరదని తేల్చిచెప్పారు. ఇప్పటి నుంచి మీ ప్రత్యర్థులు చర్చ్ ల వద్ద ఫొటోలు తీస్తారని, క్రిస్టియన్లుగా చెలమాణి అవుతున్న వారు ఎస్సీ రిజర్వేషన్లు పొందకుండా అడ్డుకుంటారని హెచ్చరించారు. ఎస్సీ రిజర్వేషన్లు కోరుకునే వారు తిరిగి హిందూమతంలోకి రావాలని, ఆలయాలకు వెళ్లడం ఇప్పటి నుంచే ప్రారంభించాలని తేల్చిచెప్పారు. ఘర్ వాపసీ అంటూ మతం మారిన వారు తిరిగి హిందూ మతంలోకి రావాలని కోరారు రఘురామ.

ఈ సందర్భంగా రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం సమ్మతం కానీ పనులు చేయవద్దని హితవుపలికారు. దేవుడికోసం ఒక మతం, బెనిఫిట్స్ కోసం మరోమతం తీసికొని త్రిశంక స్వర్గంలో ఉండొద్దని సలహా ఇచ్చారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత సరిచూసుకోవాలని అప్రమత్తం చేశారు. ఇప్పటికి మించిపోయింది లేదు. హిందూ దళితులుగా వెనక్కి రావాలని కోరారు. దళిత క్రిస్టియన్లను ఉద్దేశించి రఘురామ చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయని అంటున్నారు.

క్రైస్తవ మతంలోకి మారిన వారు ఎస్సీ సర్టిఫికేట్ పొందడానికి అనర్హులని ఇటీవల అత్యున్నత న్యాయస్థానం వెల్లడించిన అంశాన్ని రఘురామ ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజ్యాంగం ప్రకారం ఎస్సీ హోదా అనేది హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు మాత్రమే పరిమితమని, మతం మారిన వెంటనే ఆ హోదా వర్తించదని ఆయన వివరించారు. డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి ఒక వర్గాన్ని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై భిన్న స్పందనలు వస్తున్నాయి. రాజ్యాంగబద్ధంగా అర్హులైన నిజమైన దళితులకు న్యాయం జరగాలన్నదే ఆయన ఉద్దేశమని కొందరు సమర్థిస్తున్నారు. ఇది వ్యక్తుల స్వేచ్ఛపై ప్రభావం చూపుతుందని మరికొందరు వాదిస్తున్నారు.

పంచాయతీ ఎన్నికల వేళ రఘురామ చేసిన ఈ వ్యాఖ్యలు అటు రాజకీయంగా, ఇటు సామాజికంగా పెద్ద చర్చకే దారితీశాయి. రాబోయే రోజుల్లో ఈ అంశం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలని అంటున్నారు. ఇక శ్రీరామ నవమి సందర్భంగా రఘురామరాజు సొంత నియోజకవర్గం ఉండి పరిధిలో ఆకివీడు పెదపేట వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. శిథిలమైన రామాలయాన్ని పునః నిర్మించాలని భావిస్తున్న రఘురామ, పెదపేటలోని రామాలయానికి వెళ్లడాన్ని కొందరు అడ్డుకున్నారు. దీనికి కారణం మతం మారిన దళితులే అన్న భావనకు ఆయన వచ్చారని అంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు దళిత క్రిస్టియన్ అధికారులతో ఆయనకు ఉన్న వైరం కూడా ప్రస్తావిస్తున్నారు. మొత్తానికి రఘురామ చేసిన కామెంట్స్ రాజకీయంగా కాక రేపుతున్నాయని అంటున్నారు.