టార్గెట్ రఘునందన్.. మావోయిస్టులకు ఏంటి సంబంధం!?
బీజేపీ ఎంపీ రఘునందన్‌రావుకు మరోసారి ఆదివారం బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఈ సారి మరింత తీవ్రంగానే ఆయనకు బెదిరింపులు రావడం గమనార్హం.
By: Tupaki Desk | 30 Jun 2025 12:00 AM ISTబీజేపీ ఎంపీ రఘునందన్‌రావుకు మరోసారి ఆదివారం బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఈ సారి మరింత తీవ్రంగానే ఆయనకు బెదిరింపులు రావడం గమనార్హం. ''ఎక్కడున్నా.. నిన్ను నువ్వు రక్షించుకోలేవు!'' అంటూ ఆ ఫోన్ సారాంశం. అంతేకాదు.. మావోయిస్టులు 5 బృందాలుగా ఏర్పడి.. నీ కోసం వెతుకుతు న్నారు... నిన్ను లేపేయడం ఖాయమని ఫోన్స్ వచ్చాయి. అక్కడితో కూడా ఆగలేదు. తమ ఫోన్లను ట్రేస్ చేయలేరని కుండబద్దలు కొట్టారు.
ఈ పరిణామాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రఘునందనరావు ఉలిక్కిపడ్డారు. ఆ వెంటనే ఆయ న మరోసారి డీజీపీకి ఫిర్యాదు చేశారు. కాగా.. ఈ నెల 23న అంటే కొద్ది రోజుల కిందటే ఆయనకు బెదిరింపు ఫోన్ వచ్చింది. ఆయన పీఏ ఫోన్ ఎత్తగానే.. లేపేస్తామంటూ.. అవతలి వ్యక్తులు హెచ్చరించారు. దీనికి మావోయిస్టుల పేరు వాడుకున్నారు. అప్పట్లో సంచలనం రేపిన ఈ వ్యవహారంతో పోలీసులు రఘునందన్ రావుకు సెక్యూరిటీ కల్పించారు. ఎస్కార్ట్ వాహనాలను ఏర్పాటు చేశారు.
ఇంతలోనే మళ్లీ కాల్ రావడం.. మరోసారి మావోయిస్టులు ఐదు బృందాలను ఏర్పాటు చేశారని చెప్పడం ద్వారా హెచ్చరికలు పంపారు. అయితే.. ప్రస్తుతం మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ జరుగుతున్న క్రమంలో అసలు ఎక్కడా మావోయిస్టుల అలికిడి లేదు. పైగా.. అంత ధైర్యంగా ఒక ఎంపీకి ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నిజానికి మావోయిస్టులు ఫోన్లు చేయాలని అనుకుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డే పక్కన ఉన్నారు. ఆయనను వదిలేసి రఘునందన్‌కు ఫోన్ చేయడం ఏంటి?
ఇదే ఇప్పుడు పోలీసులను కూడా కలవరపెడుతున్న విషయం. ఇదంతా రాజకీయ కుట్రలో భాగమైన ఉంటుందని బీజేపీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రఘునందన్‌రావు ప్రత్యర్థులు లేదా.. ఆయనపై కక్షగట్టినవారు ఇలా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీంతో పోలీసులు మావోయిస్టు.. అనే మాటే లేదని... వేరే కారణం అయి ఉంటుందని సందేహాలు వ్యక్తం చేస్తూ.. ఆదిశగా దృష్టి పెట్టారు. మరి ఏం తేలుతుందో చూడాలి.
