Begin typing your search above and press return to search.

హాట్ కామెంట్... రేవంత్ వద్దకు ఎమ్మెల్యేలను పంపింది హరీశ్ రావే!

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

By:  Tupaki Desk   |   24 Jan 2024 10:06 AM GMT
హాట్  కామెంట్... రేవంత్  వద్దకు ఎమ్మెల్యేలను పంపింది హరీశ్  రావే!
X

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బీఆరెస్స్ పార్టీకి చెందిన నలుగురు మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు.. సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు.. సీఎం రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో భేటీ అవ్వడం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా రఘునందన్ రావు సంచలన కామెంట్లు చేశారు.

అవును... తెలంగాణలో మంగళవారం ఊహించని పరిణామం జరిగింది. ఎవరూ ఊహించని విధంగా అన్నట్లుగా బీఆరెస్స్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ ని ఆయన ఇంటిలోనే కలిశారు. అయితే... వారంతా హరీష్ రావు ప్రోద్భలంతోనే రేవంత్ ని కలిశారని.. అందుకు బలమైన కారణం ఉందంటూ దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... మెదక్ ఎంపీ సీటు విషయంలో బీఆరెస్స్ అధినేత కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని.. ఈ సీటుకోసం కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు వచ్చాయని.. ఆ సీటు తనకే కేటాయించాలని కవిత పట్టుబడుతుందని రఘునందన్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో... మెదక్ ఎంపీ సీటు కవితకు ఇవ్వడానికి కేసీఆర్ మేనల్లుడు, బీఆరెస్స్ కీలక నేత హరీశ్ రావు అంగీకరించడం లేదని.. అందులో భాగంగానే తనకు సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలను రేవంత్ ని కలవమని పంపించారని సంచలన ఆరోపణలు చేశారు.

దీంతో... "రేవంత్ ని కలిసిన బీఆరెస్స్ ఎమ్మెల్యేలు" అనే హాట్ టాపిక్ మరో కొత్త రూటు తీసుకుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ విషయం తప్పుదోవ పట్టించడానికి ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినట్లు సన్నాయి నొక్కులు నొక్కతున్నారని అంటున్నారు. అసలు రేవంత్ వద్దకు ఎమ్మెల్యేలను పంపించిందీ హరీశ్ రావే అని.. తర్వాత వాళ్లతో బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించారని రఘునందన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా... పార్లమెంట్ ఎన్నికల్లో బీఆరెస్స్ పార్టీ ఎంపీ సీట్లు అమ్ముకునే పనిలో పడిందని.. ఈ ఎన్నికల్లో వారి పరిస్థితి బిగ్ జీరో కావడం ఖాయమని రఘునందన్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో... బీఆరెస్స్ పార్టీకి ఓటు వేస్తే.. కోమటి చెరువు, హుస్సేన్ సాగర్, మూసీల్లో వేసినట్లే అని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే కామెంట్ చేశారు. జరుగుతున్న పరిణామాలను సరిగ్గా గమనిస్తే... పార్టీపై పట్టుకోసం బావ, బామార్ధుల మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్న విషయం స్పష్టమవుతోందని రఘునందన్ చెప్పుకొచ్చారు.

అయితే హరీశ్ ఈ తరహా పనులు చేయడం ఇదే ఫస్ట్ టైం కాదన్నట్లుగా చెప్పిన రఘునందన్... గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండోసారి సీఎం అయిన తర్వాత ఆయన్ను కలిసి అభివృద్ధి పనుల కోసం కలిసినట్లు మీడియాకు చెప్పారని గుర్తుచేశారు! ఈ సందర్భంగా... గతంలో బీఆరెస్స్ పార్టీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలుపుకోవడానికి 7 సంవత్సరాలు పడితే.. కాంగ్రెస్ పార్టీలో బీఆరెస్స్ ఎమ్మెల్యేలను కలుపుకోవడానికి 7 నెలలు కూడా పట్టదని రఘునందన్ ఆసక్తికర కామెంట్లు చేశారు. ఎవరు ఎలాంటి రాజకీయాలు చేసుకున్నా... ఈ ఎన్నికల్లో బీజేపీ 16 ఎంపీ సీట్లు గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.