పంజాబ్ లో రాఘవ్ చద్దా ఓటు ఔట్.. సర్ తో ప్రముఖుల ఓట్లకు తప్పని గండం!
ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియలో మరో సెలబ్రెటీ ఓటుకు గండం ఎదురైంది.
By: Tupaki Desk | 3 Sept 2026 9:00 PM ISTఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియలో మరో సెలబ్రెటీ ఓటుకు గండం ఎదురైంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపణలు చేస్తుండగా, ఈ జాబితాలో అధికార బీజేపీ ఎంపీ రాఘవ్ చద్దా కూడా ఉన్నారనే ప్రచారం హీట్ పుట్టిస్తోంది. పంజాబ్ లో ప్రస్తుతం కొనసాగుతున్న సర్ ప్రక్రియలో భాగంగా తన ఓటును శాశ్వతంగా వలస వెళ్లిన వారి జాబితాలో చూపడంపై రాఘవ్ చద్దా అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇంతకుముందు సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. బెంగళూరులో ఉన్న తన ఓటును తొలగించారని ప్రకాష్ రాజ్ విమర్శలు చేశారు. అయితే సర్ ప్రక్రియను పూర్తిగా అర్థం చేసుకోకపోవడం వల్లే ఇలాంటి విమర్శలు వస్తున్నాయని అధికారులు వివరణ ఇస్తున్నారు.
బీజేపీ ఎంపీ రాఘవ్ చద్దా ఓటును షిప్టెడ్ జాబితాలో చూపడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కారణంతోనే తన ఓటును పంజాబ్ నుంచి తొలగించేలా ప్రభుత్వం ఒత్తిడి చేసిందని ఎంపీ ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని స్వతంత్రంగా పనిచేసే ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రభావితం చేయగలదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆప్ ప్రభుత్వం తన ఓటును షిప్టెడ్ జాబితాలో చేర్చిందని రాఘవ్ చద్దా ఆరోపణలు చర్చకు దారితీస్తున్నాయి. కొద్ది నెలల క్రితమే రాఘవ్ చద్దా ఆప్ నుంచి బీజేపీలో చేరారు. దీంతో ఆయన తాజా ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సర్ ప్రక్రియలో ఇటువంటి విమర్శలు, వివాదాలు అత్యంత సహజంగా మారిపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సెలబ్రెటీలు, ఎంపీ, ఎమ్మెల్యే స్థాయి వారి ఓట్లకే రక్షణ లేకపోతే సామాన్యుల సంగతేంటి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. ఓటర్ జాబితాల రూపకల్పన, సవరణ (సర్) ప్రక్రియలో ఇటువంటి సమస్యలు తలెత్తడానికి అనేక కారణాలు ఉన్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. బూత్ స్థాయి అధికారుల వైఫల్యం ప్రధానంగా ఎత్తిచూపుతున్నారు. ఇంటింటి సర్వే నిర్వహించే సమయంలో క్షేత్రస్థాయిలో సరైన సమాచారం సేకరించకుండానే పేర్లు తొలగించడం వల్ల ఇటువంటి విమర్శలకు ఆస్కారం లభిస్తోందని అంటున్నారు.
ఇక డూప్లికేట్ ఎంట్రీల ప్రక్షాళనతో కూడా కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అంటున్నారు. ఒకే వ్యక్తి పేరు వేర్వేరు ప్రాంతాల్లో ఉండకూడదనే ఉద్దేశంతో చేసే వెరిఫికేషన్‌లో కొన్నిసార్లు అసలైన ఓట్లు కూడా పొరపాటున తొలగిపోతున్నారని చెబుతున్నారు. అదేవిధంగా చిరునామాల మార్పులు, సమన్వయ లోపం కూడా కొంత ఇబ్బందులను తెచ్చిపెడుతోందని విశ్లేషిస్తున్నారు. తరచూ నివాసాలు మారటం, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఓటు బదిలీకి దరఖాస్తు చేసుకున్నప్పుడు సాంకేతిక సమస్యల కారణంగా పాత జాబితాలో పేరు తొలగిపోయి, కొత్త జాబితాలో అప్‌డేట్ అవడం లేదని అంటున్నారు.
ఓటు హక్కు కోసం ఏం చేయాలి?
ఈ తరహా వైఫల్యాల వల్ల తమ ఓటు హక్కును కోల్పోకుండా ఉండాలంటే కేవలం సామాన్యులే కాకుండా, ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. సర్ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో కొన్ని ముఖ్యమైన తేదీల్లో స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ లేదా 'ఓటర్ హెల్ప్‌లైన్' యాప్ ద్వారా తమ ఓటు ఓటర్ జాబితాలో పదిలంగా ఉందో లేదో ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని చెబుతున్నారు. చిరునామా మార్పులు లేదా కొత్త నమోదు కోసం ఫారమ్-6, 7, 8లను సమర్పించినప్పుడు, ఆ అప్లికేషన్ స్థితిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉండాలని అంటున్నారు.
ఎన్నికల సంఘం వాదన ఏమిటి?
ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై వస్తున్న విమర్శలను ఎన్నికల సంఘం కొట్టిపారేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, చట్టబద్ధమైన నిబంధనల ప్రకారమే జరుగుతోందని ఈసీ స్పష్టం చేస్తోంది. ఎవరి పేరునూ రాజకీయ దురుద్దేశంతో తొలగించే ప్రసక్తే ఉండదని, కేవలం డూప్లికేట్ ఓట్లు, శాశ్వతంగా చిరునామా మార్చుకున్న వారు, మరణించిన వారి పేర్లను మాత్రమే నిబంధనల ప్రకారం తొలగిస్తామని వెల్లడించింది. ఒకవేళ ఏవైనా సాంకేతిక లోపాల వల్ల అర్హులైన వారి ఓట్లు తొలగిపోయినట్లు తేలితే, వెంటనే దరఖాస్తు చేసుకుంటే వాటిని పునరుద్ధరిస్తామని ఎన్నికల సంఘం భరోసా ఇస్తోంది.
