Begin typing your search above and press return to search.

రాయబరేలీ రాహుల్ కి జై కొట్టిందా ?

అమేధీలో 2004 నుంచి వరసగా పోటీ చేస్తూ వస్తున్న రాహుల్ 2019లో ఓటమి పాలు అయ్యాక 2024 ఎన్నికలలో వదిలేసారు.

By:  Tupaki Desk   |   20 May 2024 3:40 PM GMT
రాయబరేలీ రాహుల్ కి జై కొట్టిందా ?
X

దేశంలో లోక్ సభ ఎన్నికలలో భాగంగా అయిదవ విడత పోలింగ్ సోమవారం సాయంత్రంతో ముగిసింది. మొత్తం 49 లోక్ సభ సీట్లకు పోలింగ్ జరిగితే అందులో అందరి దృష్టిని ఆకట్టుకునే సీట్లు రెండు ఉన్నాయి. అవి అమేధీ రాయబరేలీ. ఈ రెండు సీట్లలో బాగానే పోలింగ్ సాగింది.

అమేధీలో 2004 నుంచి వరసగా పోటీ చేస్తూ వస్తున్న రాహుల్ 2019లో ఓటమి పాలు అయ్యాక 2024 ఎన్నికలలో వదిలేసారు. దానికి గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడు అయిన కిశోర్ లాల్ శర్మ అనే నేతలు ఇచ్చారు. ఆయన ఈసారి ఎంపీగా అక్కడ పోటీ చేస్తూంటే బీజేపీ నుంచి కేంద్రం మంత్రి స్మృతి ఇరానీ వరసగా మరోసారి పోటీ చేస్తున్నారు.

ఆమె తన విజయం మీద పూర్తి ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత సారి రాహుల్ గాంధీనే ఓడించిన స్మృతి ఇరానీ తనకు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి శర్మ లెక్క కాదు అన్నట్లుగా ఆమె ఆత్మ విశ్వాసం ఉంది. అక్కడ ఏమి జరుగుతుంది అన్నది పక్కన పెడితే రాయబరేలీ కాంగ్రెస్ కి కంచుకోట లాంటి మరో సీటు.

ఇక్కడ కూడా 2004 నుంచి 2019 దాకా నాలుగు సార్లు ఎంపీగా సోనియా గాంధీ గెలిచారు. ఆమె ఈసారి రాజ్యసభకు వెళ్లడం ద్వారా ఆ సీటు ఖాళీ చేస్తే అందులోకి రాహుల్ వచ్చారు. నిజానికి ఇక్కడ నుంచి ప్రియాంకా గాంధీ పోటీ చేస్తుంది అని అంతా అనుకున్నారు.

కానీ రాహుల్ బరిలోకి దిగారు. మరి ఈ సీటులో రాహుల్ ప్రచారం పెద్దగా చేయలేదు. నామినేషన్ దాఖలు చేసిన తరువాత తల్లి సోనియాతో కలసి భారీ సభ నిర్వహించి ఆ మీదట ఇతర ప్రాంతాలలో ప్రచారం చేశారు. చెల్లెలు ప్రియాంక మాత్రం పనిగట్టుకుని అక్కడే ఉన్నారు. తన అన్న గెలుపు కోసం అవిశ్రాంతం పనిచేశారు.

ఇదిలా ఉంటే తన కుమారుడిని రాయబరేలీ ప్రజల చేతులలో పెడుతున్నాను ఆశీర్వదించాలని సోనియా గాంధీ సెంటిమెంట్ తో కూడిన ప్రసంగం చేశారు. దానిని బీజేపీ నేతలు గట్టిగానే తిప్పుకొట్టారు. ఈ సీటు మీ కుటుంబానికి రాసిచ్చేశారా అని ఫైర్ అయ్యారు.

కరోనా టైం లో రాయబరేలీ అసలు రాని సోనియా ప్రజలకు చేసిన సేవ ఏమిటి అని కూడా వారు ప్రశ్నించారు. సోనియా తరువాత అక్కడ ఎంపీగా పోటీ చేయడానికి అర్హుడైన నేత ఎవరూ లేరా అని నిలదీశారు. వారసత్వ రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టాలని కూడా బీజెపీ నాయకులు పిలుపు ఇచ్చారు.

రాయబరేలీలో చూస్తే 2004 తరువాత నుంచి వరసగా సోనియా గాంధీ మెజారిటీ తగ్గుతూ వస్తోంది. ఆమె 2004లో పోటీ చేసినపుడు 249,765గా వచ్చింది. 2009లో అది కాస్తా ఏకంగా 372,165కు ఎగబాకింది. అయితే 2014కి వచ్చేటప్పటికి 352,713కి తగ్గింది. 2019 ఎన్నికల నాటికి చూస్తే ఏకంగా సగానికి పడిపోయి 167,178 మెజారిటీ మాత్రమే సోనియా గాంధీకు దక్కింది.

ఇక సోనియా గాంధీ మెజారిటీని సగానికి సగం తగ్గించడానికి ఆమె ప్రత్యర్ధిగా 2019 ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ సీనియర్ నేత దినేష్ ప్రతాప్ సింగ్ కారణం. ఆనాడే ఆయన గెలవాలని బీజేపీ నేతలు అంటున్నారు. ఇపుడు సోనియా గాంధీ పోటీ నుంచి తప్పుకుని రాహుల్ గాంధీ పోటీకి దిగారు.

పైగా ఆయన కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. దాంతో ఆయన గెలిస్తే ఈ సీటు వదులుకుంటారు అన్న ప్రచారం కూడా బీజేపీ చేసింది. ఇక బీజేపీ ఎంపీ అభ్యర్ధి దినేష్ ప్రతాప్ సింగ్ కి సానుభూతి ఉంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఎస్పీ కాంగ్రెస్ కాంబినేషన్ తో రాయబరేలీ మళ్లీ కాంగ్రెస్ సొంతం అవుతుందని అంటున్నారు. ప్రియాంకా గాంధీ చేసిన ప్రచారం కూడా జనంలో చర్చకు వచ్చింది అని అంటున్నారు.

పోలింగ్ సరళి చూస్తే తమకు అనుకూలం అని కాంగ్రెస్ బీజేపీ రెండు చెబుతున్నాయి కానీ రాయబరేలీ ఓటర్లు ఎవరిని గెలిపించబోతున్నారు అన్నది తెలియాలంటే జూన్ 4 వరకూ వేచి చూడాల్సిందే. ఈసారి అమేధీ కంటే కూడా రాయబరేలీవే టాక్ ఆఫ్ ది పార్లమెంట్ సీటు గా మారబోతోంది అని అంటున్నారు. రాహుల్ తాత నాన్నమ్మ, తల్లి ప్రాతినిధ్యం వహించిన సీటు నుంచి ఎంపీ అయి వారసత్వం కొనసాగిస్తారా లేదా అన్నదే హాట్ టాపిక్ గా ఉంది.