రాధిక హత్యలో మరో కీలక మలుపు!
టెన్నిస్ ప్లేయర్, మోడల్‌గా గుర్తింపు పొందిన రాధికా యాదవ్ హత్య కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
By: Tupaki Desk | 12 July 2025 6:00 PM ISTటెన్నిస్ ప్లేయర్, మోడల్‌గా గుర్తింపు పొందిన రాధికా యాదవ్ హత్య కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన నేపథ్యంలో ఆమె నటించిన ఒక మ్యూజిక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అందులో నటించిన మరో నటుడు ఇనామ్ ఈ విషయంపై స్పందించారు. రాధిక హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఇనామ్ స్పష్టం చేశారు.
"రాధికను మొదటిసారి దుబాయ్‌లో కలిశాను": ఇనామ్
ఈ హత్య కేసులో తన పేరును లాగడాన్ని తీవ్రంగా ఖండించిన ఇనామ్, మీడియాతో మాట్లాడుతూ తన నిర్దోషిత్వాన్ని స్పష్టంగా తెలియజేశారు. "దుబాయ్‌లో రాధికను తొలిసారి కలిశాను. మ్యూజిక్ వీడియో షూటింగ్ కోసం మాత్రమే ఆమెతో కలిశాను. ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఆమెకు తగిన పారితోషికం చెల్లించాం. షూటింగ్ తర్వాత మేమిద్దరం ఇక ఎప్పుడూ కలవలేదు" అని తెలిపారు.
మత కోణంలో చూడటం దురదృష్టకరం
ఈ హత్యను హిందూ–ముస్లిం కోణంలో చూడటం సమాజానికి హానికరమని ఇనామ్ అభిప్రాయపడ్డారు. "ఒక మోడల్ లేదా ఆర్టిస్ట్గా మాత్రమే నేను ఆ మ్యూజిక్ వీడియోలో పాల్గొన్నాను. ఆ సంబంధం అక్కడితో ముగిసింది. ప్రస్తుతం నన్ను ఈ హత్య కేసులో లాగటాన్ని నేను ఖండిస్తున్నాను. నాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు" అని స్పష్టం చేశారు.
వైరల్ అవుతున్న వీడియో
రాధిక నటించిన ఆ మ్యూజిక్ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద ఎత్తున షేర్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె నటనతో పాటు ఇనామ్ కూడా కనిపించడంతో, సోషల్ మీడియాలో విభిన్న వాదనలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇనామ్ ఇచ్చిన వివరణతో కొన్ని వాదనలు సద్దుమణిగే అవకాశముంది.
పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది
ఇతర కోణాల్లో రాధిక హత్య కేసును పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆమె వ్యక్తిగత జీవితం, వ్యక్తిగత సంబంధాలు, సోషల్ మీడియాలో కార్యకలాపాలు అన్నింటినీ విచారిస్తున్నారు. ఇనామ్ వ్యాఖ్యలు కూడా విచారణలో భాగంగా తీసుకోవచ్చని తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తులో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
