Begin typing your search above and press return to search.

టెన్నిస్ క్రీడాకారిని హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!

హర్యానాలోని గురుగ్రామ్‌ లో సెక్టార్ 57లో 25 ఏళ్ల టెన్నిస్ క్రీడాకారిని రాధిక యాదవ్ హత్యకు గురైంది.

By:  Tupaki Desk   |   11 July 2025 11:36 AM IST
టెన్నిస్ క్రీడాకారిని హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్  విషయాలు!
X

హర్యానాలోని గురుగ్రామ్‌ లో సెక్టార్ 57లో 25 ఏళ్ల టెన్నిస్ క్రీడాకారిని రాధిక యాదవ్ హత్యకు గురైంది. కన్న తండ్రి దీపక్ యాదవ్ చేతిలోనే ఆమె అత్యంత దారుణంగా చంపబడింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. నిందితుడు దీపక్ యాదవ్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సమయంలో.. షాకింగ్ విషయాలు తెరపైకి వస్తున్నాయి.

అవును... జూలై 10న టెన్నీస్ ప్లేయర్ రాధికా యాదవ్ తల్లి మంజు యాదవ్ పుట్టినరోజు కావడంతో.. ఆ రోజు ఉదయం తన తల్లి కోసం ప్రత్యేకంగా ఏదైనా సిద్ధం చేయడానికి వంటగదిలోకి వెళ్లింది రాధిక. సరిగ్గా ఆ సమయంలో వెనుక నుంచి లైసెన్స్ తుపాకీతో తండ్రి దీపక్ యాదవ్ ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. మూడు బుల్లెట్లు లోపలికి దూసుకెళ్లడంతో ఆమె ప్రాణాలు వదిలింది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలిని పరిశీలించి.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సమయంలో... దీపక్ తన కుమార్తె పదే పదే అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ అకాడమీని కొనసాగించడం పట్ల కలత చెందాడని ఆమె మామ కుల్దీప్ యాదవ్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్‌ లో పేర్కొన్నారు. ఈ సమయంలో కీలక విషయాలు తెరపైకి వస్తున్నాయి.

తెరపైకి వస్తోన్న కథనాల ప్రకారం... ఏడాది క్రితం రాధిక ఒక మ్యూజిక్ వీడియో చేసింది. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో.. బంధువుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవ్వడంతోపాటు.. సొంతూరుకి వెళ్లినప్పుడల్లా.. కూతురు ఆదాయంతో బతుకుతున్నావంటూ రాధిక యాదవ్ తండ్రిని హేళన చేయడం మొదలుపెట్టారంట.

దీంతో.. ఈ వ్యవహారంపై చాలా రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయట. మరోవైపు ఇన్‌ స్టాగ్రామ్ రీల్స్ చేయడంతోనూ ఆమె ఆర్థికంగా బలపడిందని చెబుతున్నారు. దీంతో.. ఆమెకు ఆర్థిక పరమైన స్వేచ్ఛ వచ్చిందని అంటున్నారు! ఈ వ్యవహారం తండ్రికి రుచించలేదని.. తన మాట వినడం లేదనే ఆగ్రహం కట్టలు తెంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు!

ఈ సందర్భంగా స్పందించిన రాధిక తల్లి మంజు యాదవ్.. సంఘటన జరిగిన సమయంలో జ్వరం కారణంగా తాను తన గదిలో పడుకున్నానని.. తుపాకీ కాల్పుల శబ్దాలు మాత్రమే విన్నానని అన్నారు. తన భర్త, కుమార్తె మధ్య ఎటువంటి తీవ్రమైన వివాదం లేదని.. రాధిక మంచి వ్యక్తిత్వం కలిగి ఉందని, కుటుంబానికి ఎప్పుడూ చెడ్డపేరు తీసుకురాలేదని ఆమె అన్నారు!

ఈ క్రమంలో దీపక్ యాదవ్ నేరం అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో... వేలిముద్ర నిపుణులను పిలిపించి, కాల్పులకు ఉపయోగించిన రివాల్వర్, ఘటనాస్థలం నుండి సేకరించిన బ్లడ్ శాంపుల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 103(1), ఆయుధ చట్టంలోని సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేశారు!