Begin typing your search above and press return to search.

ఎంపీగా టాలీవుడ్‌ హీరోయిన్‌!

ఈ నేపథ్యంలో రచనను వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా బరిలో దించాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నిర్ణయించారు.

By:  Tupaki Desk   |   11 March 2024 6:29 AM GMT
ఎంపీగా టాలీవుడ్‌ హీరోయిన్‌!
X

రాజకీయాల్లోకి సినిమా తారలు రావడం ప్రస్తుతం ఉన్న ట్రెండేమీ కాదు. గతంలో ఎంజీ రామచంద్రన్‌ (ఎంజీఆర్‌), ఎన్టీఆర్, జయలలిత వంటివారు ముఖ్యమంత్రులయ్యారు. కృష్ణ, జమున, కృష్ణంరాజు, చిరంజీవి మురళీమోహన్, సత్యనారాయణ, రావుగోపాలరావు, రమ్య దివ్యస్పందన, నెపోలియన్, సురేశ్‌ గోపి వంటివారు ఎంపీలు, మంత్రులయ్యారు. ఇప్పుడు ఇదే కోవలో గతంలో టాలీవుడ్‌ హీరోయిన్‌ గా కుర్రకారును ఆకట్టుకున్న రచన ఇప్పుడు ఎంపీగా బరిలోకి దిగబోతోంది.

అగ్ర హీరోలు చిరంజీవి సరసన బావగారూ బాగున్నారా, బాలకృష్ణ సరసన సుల్తాన్, జగపతిబాబు సరసన మావిడాకులు, శ్రీకాంత్, ఉపేంద్ర సరసన కన్యాదానం తదితర సినిమాల్లో నటించిన అందాల భామ రచన అందరికీ గుర్తుండే ఉంటుంది.

ఈ బెంగాలీ ముద్దుగుమ్మ.. ఒడియా, బెంగాలీ, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. పశ్చిమ బెంగాల్‌ కు చెందిన రచన కోల్‌ కతాలో పుట్టింది. అక్కడే ఒక కాలేజీలో డిగ్రీ చదివింది. తర్వాత ఆమె అందాల పోటీల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మిస్‌ కోల్‌ కతా టైటిల్‌ గెలుచుకుంది. అక్కడి నుంచి సినిమా రంగం తలుపుతట్టింది.

పలు భాషా చిత్రాల్లో నటించి తన తోటి నటుడు, ఒడిశా అగ్ర నటుడు అయిన సిద్ధాంత్‌ మహాపాత్రను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం రచన పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రచనను వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా బరిలో దించాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నిర్ణయించారు. కోల్‌ కతాను ఆనుకుని ఉన్న హుగ్లీ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి రచన తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆమె అభ్యర్థిత్వాన్ని మమత ప్రకటించారు.

మరోవైపు రచన భర్త, ఒడిశా అగ్ర నటుడు అయిన సిద్ధాంత మహాపాత్ర కూడా రెండుసార్లు ఎంపీగా చేశారు. అయితే ఆయన ఒడిశా నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందడం విశేషం. ఒడిశాలోని అధికార పార్టీ అయిన బిజూ జనతాదళ్‌ తరపున సిద్ధాంత్‌ మహాపాత్ర బెర్హంపూర్‌ నుంచి 2009, 2014 ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. 2019లో ఆయనే ఎందుకో పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు.

ఇప్పుడు రచనను ఎంపీగా పోటీ చేయించాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయించడం హాట్‌ టాపిక్‌ గా మారింది. ఇప్పటికే బాలీవుడ్‌ ఒకప్పటి అగ్ర నటుడు శత్రుఘ్న సిన్హా, నటి నుస్రుత్‌ జహాన్‌ వంటివారు తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున ఎంపీలుగా ఉన్నారు. అలాగే గతంలో అగ్ర నటీమణి మూన్‌ మూన్‌ సేన్‌ వంటివారు కూడా తృణమూల్‌ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ నేపథ్యంలో రచన హుగ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతుండటం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.