Begin typing your search above and press return to search.

విమానం ఇంజిన్‌లో కుందేలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌తో తప్పిన ప్రమాదం!

అగ్రరాజ్యం అమెరికాలో ఓ ఊహించని ఘటన చోటు చేసుకుంది. గాలిలో ప్రయాణిస్తున్న ఓ విమానం ఇంజిన్ లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి.

By:  Tupaki Desk   |   18 April 2025 1:13 PM IST
Rabbit In Aeroplane Engine
X

విమానం ఎయిర్ పోర్టు నుంచి బయలు దేరింది. వినీల ఆకాశంలో విహరిస్తున్న విమాన ప్రయాణాన్ని ప్రయాణికులంతా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలోనే ఇంజిన్ కు మంటలంటున్నాయని ప్రాణాలు ఆగిపోయే వార్త వారిని కలవరపెట్టింది. క్షణాల్లో వారంతా భయంతో వణికిపోయారు. మంటలకు కారణం ఓ చిన్న కుందేలు. అది చేసిన పనికి వందల మంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఇంతకీ ఆ కుందేలు ఏం చేసింది. విమానానికి మంటలు ఎలా అంటున్నాయో తెలుసుకుందాం.

అగ్రరాజ్యం అమెరికాలో ఓ ఊహించని ఘటన చోటు చేసుకుంది. గాలిలో ప్రయాణిస్తున్న ఓ విమానం ఇంజిన్ లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.చివరకు విమాన పైలట్స్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు బతుకు జీవుడా అనుకున్నారు. ఇంతకు అసలు ఏమి జరిగిందంటే...

యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన UA2325 విమానం డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుండి ఎడ్మింటన్‌కు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుడివైపు రెక్క కింద ఉన్న ఇంజిన్ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం మొదలయ్యాయి. విమానం ఎగురుతుండగా ఒక్కసారిగా పెద్ద సౌండ్ రావడంతో ప్రయాణికులు ఉన్నఫలంగా ఉలిక్కి పడ్డారు. పెద్ద శబ్దం కిటికీల నుండి చూస్తే ఇంజిన్‌లో మంటలు కనిపించడంతో ఈ ప్రయాణమే తమ జీవితంలో ఆఖరిది అనుకున్నారు.

పరిస్థితి తీవ్రతను గమనించిన పైలట్లు మాత్రం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం చేరవేశారు. ఆ తర్వాత అత్యవసరంగా విమానాన్ని వెనక్కి తిప్పి డెన్వర్ ఎయిర్ పోర్టులో సేఫ్ గా ల్యాండ్ చేశారు. అధికారులు వెంటనే స్పందించి ప్రయాణికులందరినీ విమానం నుంచి క్షేమంగా దించేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

ప్రాథమిక దర్యాప్తులో విమానం ఇంజిన్‌లో ఒక కుందేలు చిక్కుకుందని.. అందువల్లే మంటలు చెలరేగాయని అధికారులు గుర్తించారు. దీనిని 'రాబిట్ స్ట్రైక్'గా చెబుతారు. అనంతరం ఆ విమానంలోని 153 మంది ప్రయాణికులను మరో విమానంలో ఎడ్మింటన్ కు తరలించారు. ప్రమాద సమయంలో భయంతో వణికిపోయిన ప్రయాణికులు మంటలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విమానం గాల్లో ఉండగా పెద్ద సౌండ్ వినిపించిందని, తర్వాత ఇంజిన్‌లో మంటలు కనిపించాయని కొందరు ప్రయాణికులు తెలిపారు. మొత్తానికి ఒక చిన్న కుందేలు కారణంగా పెద్ద విమానానికి భారీ ప్రమాదం తప్పింది.