Begin typing your search above and press return to search.

మోడీ సెలవులపై ఆర్టీఐలో ప్రశ్న... పీఎంఓ సమాధానం వైరల్!

సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చినప్పటినుంచీ... ఎన్నో కీలక విషయాలు, ప్రపంచానికి తెలియని అధికారిక సమాచారం ప్రజలకు తెలుస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   5 Sep 2023 4:06 AM GMT
మోడీ సెలవులపై ఆర్టీఐలో ప్రశ్న... పీఎంఓ సమాధానం వైరల్!
X

సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చినప్పటినుంచీ... ఎన్నో కీలక విషయాలు, ప్రపంచానికి తెలియని అధికారిక సమాచారం ప్రజలకు తెలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఆర్టీఐలోని కొన్ని ప్రశ్నలు, వాటికి వచ్చిన సమాధానాలు రాజకీయంగా ఆయా పార్టీలకు కొన్ని సార్లు ఇబ్బందులు తెచ్చిపెడితే.. మరికొన్ని సార్లు ప్లస్ అవుతుంటాయి!

ఈ క్రమంలో తాజాగా ప్రధాని మోడీకి సంబంధించి రెండు కీలకమైన ప్రశ్నలు సంధించారు ప్రఫుల్ పీ. శార్ద అనే వ్యక్తి. ఈ ప్రశ్నలు ఆసక్తికరంగా ఉండగా.. అందుకు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఇచ్చిన సమాధానం మరింత ఆసక్తికరంగా ఉంది. అయితే ఇవి రాజకీయంగా కూడా బీజేపీకి ప్రచారానికి ఉపయోగపడేవిగా ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.

వివరాళ్లోకి వెళ్తే... 2014 మే 26వ తేదీన ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే... అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆయన ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా... ప్రతీరోజూ పని చేస్తూనే ఉన్నారని.. రోజువారీ సమీక్షల్లో పాల్గొంటూనే ఉన్నారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.

ప్రఫుల్ పీ. శార్ద అనే వ్యక్తి... 2014 నుంచి ఇప్పటివరకు మోడీ ఎన్ని రోజులు కార్యాలయానికి వచ్చారు? ప్రధాని అయిన తర్వాత మోడీ.. ఎన్ని ఈవెంట్స్, ఫంక్షన్ లకు హాజరయ్యారు? అని తెలుసుకునేందుకు 2013 జులై 31న ఆర్టీఐ ని దాఖలు చేశారు. అయితే వీటికి పీఎంఓ తాజాగా జవాబులిచ్చింది.

"ప్రధానమంత్రి మోడీ ఎప్పుడూ డ్యూటీలోనే ఉన్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు" అని మొదటి ప్రశ్నకు సమాధానాన్ని ఇచ్చింది ప్రధానమంత్రి కార్యాలయం.

ఇక రెండో ప్రశ్నకు సమాధానంగా... "2014 మే నెలలో మోడీ, ప్రధానమంత్రి కార్యాలయంలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు దేశవిదేశాల్లో ఆయన పాల్గొన్న ఫంక్షన్ల సంఖ్య 3000ను దాటింది" అని సమాధానం ఇచ్చింది.

దీంతో ఈ ఆర్టీఐ కాపీని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

కాగా ప్రస్తుతం మోడీ.. జీ20 శిఖరాగ్ర సదస్సు ఏర్పాట్లల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల 9, 10 తేదీల్లో ఢిల్లీ వేదికగా ఈ సదస్సు జరుగనుంది. జీ20 సభ్యదేశాల అధినేతలు, ఆయా దేశాల ప్రధానమంత్రులు ఈ భేటీకి హాజరు కానున్నారు.