క్వాంటం వాలీ...బాబు లోకేష్ సూపర్ హిట్టేనా ?
ఇక అమరావతి కేంద్రంగా 2026 జనవరి 1 నుంచి క్వాంటం కంప్యూటింగ్ కార్యకలాపాలు కొనసాగుతాయని చంద్రబాబునాయుడు ప్రకటించారు.
By: Tupaki Desk | 1 July 2025 9:15 AM ISTఏపీలో క్వాంటం వాలీ అన్న ఆలోచనతో చంద్రబాబు లోకేష్ ఇద్దరూ సూపర్ హిట్ అయ్యారా. దేశంలోనే కాదు ఏకంగా దక్షిణాసియాలోనే క్వాంటం వాలీ అన్నది ఎక్కడా లేదు. అలా క్రెడిట్ మొత్తం ఏపీ కొట్టేసింది. దీనినే విజన్ అంటారు.
ఒకనాడు ఉమ్మడి ఏపీలో ఐటీ పేరు జపించి హైటెక్ బాబుగా పేరు గడించిన చంద్రబాబు విభజన ఏపీలో మరో ఐకాన్ లాంటి ప్రాజెక్ట్ తో శాశ్వత కీర్తిని ఆర్జించేందుకు చూస్తున్నారు. ఈసారి లోకేష్ సైతం కలిసి రావడంతో క్వాంటం వాలీ రూపుదిద్దుకుంది. అమరావతిలో క్వాంటం వాలీ ఏర్పాటు కోసం విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా నిర్వహించిన జాతీయ వర్క్ షాప్ సైతం గ్రాండ్ సక్సెస్ అయింది.
ఇక ఈ సభలో చంద్రబాబు లోకేష్ చేసిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. అంతే కాదు దృశ్య మాధ్యమం ద్వారా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సైతం ఏపీ స్పూర్తిని మెచ్చుకున్నారు. దిగ్గజ ఐటీ సంస్థల నిర్వాహకులు ఈ వర్క్ షాప్ కి హాజరు కావడంతో అనుకున్న దాని కంటే పెద్ద సక్సెస్ అయింది.
ఇక అమరావతి కేంద్రంగా 2026 జనవరి 1 నుంచి క్వాంటం కంప్యూటింగ్ కార్యకలాపాలు కొనసాగుతాయని చంద్రబాబునాయుడు ప్రకటించారు. క్వాంటం శాటిలైట్ ఆవిష్కరణలతో సరికొత్త సాంకేతికతకు రాష్ట్ర ప్రభుత్వం నాంది పలుకుతుందని చెప్పారు. రాష్ట్రంలో క్వాంటం కంప్యూటింగ్‌ను విశేషంగా ప్రోత్సాహిస్తామని తెలిపారు క్వాంటమ్ కంప్యూటింగ్‌ను యువత అందిపుచ్చుకోవాలని పిలుపు ఇచ్చారు
దక్షిణాసియాలోనే మొదటి క్వాంటమ్ వ్యాలీ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు అవుతోందని నారా లోకేష్ తెలిపారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అధికంగా వస్తాయని ఆయన చెప్పడం విశేషం. అత్యాధునిక సదుపాయాలతో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు అవుతోందని తెలిపారు. దీని ద్వారా లక్షకు పైగా ఉద్యోగాలు సమాచార సాంకేతిక రంగం ఐటీలో లభిస్తాయని ఆశిస్తున్నామని మంత్రి అన్నారు. అలాగే అంకుర పరిశ్రమలకు, వినూత్న ఆలోచనలకు క్వాంటమ్ వ్యాలీ పార్క్ వేదికగా ఆయన అభివర్ణించారు.
దేశంలోనే తొలిసారిగా అమరావతిలో క్వాంటం సాంకేతికతను ఆవిష్కరించడం విశేష పరిణామమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పుకొచ్చారు. ఇక చూస్తే ఉమ్మడి ఏపీలో ఐటీ టెక్నాలజీ ఎంత విప్లవాన్ని సాధించిందో విభజన ఏపీకి క్వాంటం వాలీ అంతటి సాంకేతిక విప్లవం తెస్తుందని అంటున్నారు.
అమరావతిలో ఏర్పాటు చేసే క్వాంటం వాలీ ద్వారా పరిశోధకులు, సైంటిస్టులు, ఇంజనీర్లు పెద్ద ఎత్తున వస్తారని అంటున్నారు. కొత్తగా పరిశ్రమలు పెట్టే వారికి క్వాంటం వాలీ పార్క్ ఒక గేట్ వే గా మారుతుందని అంటున్నారు. ఇక ఈ వర్క్ షాప్ కి ఐబీఎం,టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, లార్సన్ అండ్ టుబ్రో వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు హాజరు కావడం శుభ పరిణామమని అంటున్నారు. అలాగే ఐఐటి మద్రాస్ తో పాటు ఇతర కీలక విద్యా సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్న ఈ వర్క్ షాప్ ఏపీలో క్వాంటం వాలీ పైన అంచనాలను పెంచేసింది. ఏపీలో బాబు మార్క్ విజన్ ఏమిటి అంటే క్వాంటం వాలీని భవిష్యత్తు తరం చూపిస్తుంది అని అంటున్నారు
