ఆ విలాస విమానం ట్రంప్ కు కాదట.. షాకిచ్చిన ఖతార్ ప్రధాని
ఇది రెండు ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంలో భాగమేనని, దీనిని వ్యక్తిగత కానుకగా పరిగణించలేమని ఖతర్ ప్రధాని పేర్కొన్నారు.
By: Tupaki Desk | 15 May 2025 12:00 PM ISTఖతర్ పాలకులు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు విలాసవంతమైన విమానాన్ని బహుమతిగా ఇచ్చారనే వార్తలపై అంతర్జాతీయంగా వ్యక్తమైన విమర్శలు, ఆందోళనల నేపథ్యంలో, ఖతర్ ప్రధాన మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ థానీ ఈ వ్యవహారంపై కీలక స్పష్టత ఇచ్చారు. ఈ విమానం ట్రంప్‌కు ఇచ్చిన వ్యక్తిగత బహుమతి కాదని ఆయన తేల్చి చెప్పారు.
ఇది రెండు ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంలో భాగమేనని, దీనిని వ్యక్తిగత కానుకగా పరిగణించలేమని ఖతర్ ప్రధాని పేర్కొన్నారు. రెండు దేశాల విదేశాంగ లేదా రక్షణ మంత్రిత్వ శాఖల మధ్య జరిగిన లావాదేవీగానే దీనిని తాము పరిగణిస్తున్నట్లు షేక్ మహమ్మద్ బిన్ తెలిపారు. ప్రస్తుతం ఈ అంశం న్యాయ పరిశీలనలో ఉందని, ఒప్పందానికి సంబంధించిన ప్రక్రియలు లీగల్ రివ్యూలో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
ఈ విమానం బహుమతి వ్యవహారంపై వివిధ వర్గాల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. విదేశీ ప్రభుత్వాల నుండి అమెరికా అధ్యక్షులు బహుమతులు స్వీకరించడం నైతిక నియమాలకు విరుద్ధమని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఖతర్ ప్రధాని చేసిన ఈ ప్రకటన, విమర్శలకు తెరదించే ప్రయత్నంగా భావిస్తున్నారు. ఇది అధికారిక ప్రభుత్వ వ్యవహారమే కానీ, వ్యక్తిగత బహుమతి కాదని ఖతర్ స్పష్టం చేసినందున, ఈ అంశంపై తదుపరి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఖతర్‌తో సహా పలు దేశాలతో వివిధ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ విమానం వ్యవహారం ఆ ఒప్పందాలలో భాగమా లేక మరేదైనా ప్రత్యేక లావాదేవీనా అనేది ప్రస్తుతం జరుగుతున్న న్యాయ పరిశీలనలో స్పష్టమయ్యే అవకాశం ఉంది.
