Begin typing your search above and press return to search.

ఆ పత్రిక సంచలన కథనం.. ఖండించిన ఐఏఎస్‌!

కేంద్రంలో ఆర్థిక శాఖలో తాను సంయుక్త కార్యదర్శిగా ఉన్నప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా అంశం తన పరిధిలో లేదని రజత్‌ భార్గవ తెలిపారు.

By:  Tupaki Desk   |   29 Aug 2023 11:36 AM GMT
ఆ పత్రిక సంచలన కథనం.. ఖండించిన ఐఏఎస్‌!
X

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో క్రీడలు, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.. రజిత్‌ భార్గవ. అయితే ఆయన వల్లే ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా దక్కలేదని.. గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశాలకు ఆయన పలుమార్లు డుమ్మా కొట్టారని.. దీంతో ప్రత్యేక హోదా అవసరాన్ని నొక్కి చెప్పడానికి ఎవరూ లేకుండా పోయారని ఒక ప్రధాన పత్రిక సంచలన కథనం వెలువరించింది.

ఏపీకి ప్రత్యేక హోదా ప్రతిపాదనకు నాడు కేంద్ర ఆర్థిక శాఖ ఓకే చెప్పిందని ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. ప్రత్యేక హోదాకు కేంద్ర కేబినెట్‌ కూడా అంగీకరం తెలిపిందని వెల్లడించింది. దీంతో అప్పటి ప్రణాళికా సంఘం ప్రత్యేక హోదాకు సంబంధించి నోటిఫికేషన్‌ మాత్రమే విడుదల చేయాల్సి ఉందని వివరించింది. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీ కూడా ఏర్పాటు చేసిందని ఆ పత్రిక తన కథనంలో వెల్లడించింది. అప్పట్లో కేంద్ర ఆర్థిక శాఖలో బడ్జెట్‌ విభాగంలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న రజత్‌ భార్గవ కూడా ఈ కమిటీలో ఉన్నారని తెలిపింది.

ఈ క్రమంలో ఏపీకి ప్రత్యేక హోదాపై నోటిఫికేషన్‌ విడుదలకు సంబంధించి ప్రణాళిక సంఘం ఐదు సమావేశాలు నిర్వహించిందని ప్రధాన పత్రిక తన కథనంలో వెల్లడించింది. అయితే వీటిలో ఒక్క సమావేశానికి కూడా రజత్‌ భార్గవ హాజరు కాలేదని ఆరోపించింది. ఒక సమావేశానికి ఆయన బదులుగా వచ్చిన డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారి ఏపీకి ప్రత్యేక హోదా దక్కకుండా అడ్డుపుల్ల వేశారని ఆ పత్రిక ఆరోపించింది.

ఆ పత్రిక తాజా కథనం ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపింది. ప్రతిపక్షాలు ఈ వ్యవహారంపై విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రజత్‌ భార్గవ ఆ పత్రిక కథనాన్ని ఖండించారు. కేంద్రంలో ఆర్థిక శాఖలో తాను సంయుక్త కార్యదర్శిగా ఉన్నప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా అంశం తన పరిధిలో లేదని రజత్‌ భార్గవ తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా తాను అడ్డుకున్నానంటూ ఒక పత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఆయన ఖండించారు.

కేంద్ర ఆర్థిక శాఖలో రాష్ట్రాల పరంగా, కేంద్రం పరంగా రకరకాల సబ్జెక్టులుంటాయని రజత్‌ భార్గవ తెలిపారు. ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో జాయింట్‌ సెక్రటరీ ఉంటారని చెప్పారు. కేంద్రంలో తాను జాయింట్‌ సెక్రటరీగా ఉన్నప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం తనకు వచ్చి ఉంటే వదులుకునేవాణ్ని కాదని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన జారీ చేశారు.

ఆ పత్రిక కథనం పూర్తిగా అబద్ధం, నిరాధారం అని రజత్‌ భార్గవ పేర్కొన్నారు. ఆ కథనాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రత్యేక హోదా అంశంతో తనకు సంబంధం లేదని అన్నారు. ఈ కథనం పూర్తిగా వాస్తవాలను వక్రీకరించే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా ఆ పత్రిక సంబంధించిన టీవీ చానెల్‌ నిర్వహించిన ఇంటర్వ్యూలో కొద్ది రోజుల క్రితం మాజీ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేశ్‌ ప్రత్యేక హోదాకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జగన్‌ ప్రభుత్వం కీలక అధికారిగా ఉన్న వ్యక్తి వల్లే 2014లో ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని బాంబుపేల్చారు.

2019లో పదవీ విరమణ చేసిన తర్వాత నవంబర్‌ 1, 2020 వరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖకు సలహాదారుగా పీవీ రమేశ్‌ పనిచేశారు. ఆయన తాజాగా ఆ వార్తా చానల్‌ కు చెప్పినదాని ప్రకారం.. మార్చి 5, 2014 న, ఏపీకి ప్రత్యేక కేటగిరీ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేయాలని కేంద్ర ప్రణాళికా సంఘాన్ని కోరింది. ఈ క్రమంలో 2014 మార్చి 5– 15 మధ్య ప్రణాళిక సంఘం ఆర్థిక శాఖ సీనియర్‌ అధికారులతో ఐదు సమావేశాలు నిర్వహించింది.

ఈ సమావేశాల్లో దేనికీ నాడు ఆర్థిక శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న రజత్‌ భార్గవ హాజరు కాలేదు. ఆయన ఒక్క సమావేశానికి అయినా హాజరై ఉండి ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్‌ ఇచ్చి ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా దక్కి ఉండేదని పీవీ రమేశ్‌ అభిప్రాయపడ్డారు.