త్రిమూర్తులను కలిసిన బీజేపీ మాధవుడు
ఏపీలో బీజేపీది చాలా కీలకమైన పాత్ర. మరో విధంగా చెప్పాలీ అంటే చిత్రమైన బాధ్యత. ఒక వైపు ఏపీలో ప్రభుత్వంలో భాగస్వామిగా అధికారం పంచుకుంటోంది.
By: Tupaki Desk | 11 July 2025 8:45 AM ISTఏపీ బీజేపీలో పీవీఎన్ మాధవ్ జమానా స్టార్ట్ అయింది. బీసీ వర్గాలకు చెందిన యువ రాజకీయ నేతగా సమర్ధవంతమైన నాయకత్వాన్ని ఏపీకి అందించగలరని జాతీయ నాయకత్వం ఏపీ పగ్గాలను ఆయనకు అప్పగించింది. దానికి తగినట్లుగా మాధవ్ తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు.
ఏపీలో బీజేపీది చాలా కీలకమైన పాత్ర. మరో విధంగా చెప్పాలీ అంటే చిత్రమైన బాధ్యత. ఒక వైపు ఏపీలో ప్రభుత్వంలో భాగస్వామిగా అధికారం పంచుకుంటోంది. ఇంకో వైపు కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఏపీ నుంచి టీడీపీ జనసేన పార్టీలకు చెందిన ఎంపీలే ఇంధనాన్ని అందిస్తున్నాయి. ఇంకో వైపు ఏపీ బీజేపీలో ఆర్ఎస్ఎస్ నేతలు ఉన్నారు. ఫక్తు బీజేపీ ఫిలాసఫీని అనుసరించేవారు ఉన్నారు. టీడీపీ నుంచి వచ్చిన వారు వైసీపీ నుంచి చేరిన వారు ఉన్నారు.
ఇలా అందరూ ఉన్న నేపథ్యంలో పీవీఎన్ మాధవ్ కి పార్టీలో నేతలను సమన్వయం చేసుకోవడమే కత్తి మీద సాముగా ఉంటుంది. ఇక మాధవ్ ఏపీ బీజేపీకి ప్రెసిడెంట్ గా ఎన్నికైన వెంటనే ఆ పార్టీ శాసనసభా పక్ష నాయకుడు విష్ణు కుమార్ రాజు నామినేటెడ్ పదవులలో బీజేపీ వాటా తేల్చాలని ఒక అతి పెద్ద డిమాండ్ నే ముందు పెట్టారు. నామినేటెడ్ పదవులు అయిదు శాతమే ఇస్తున్నారు అని కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు.
అది విష్ణు కుమార్ రాజు బాధ మాత్రమే కాదు చాలా మందిలో ఉన్న ఆవేదన. అంటే కూటమి పెద్దలతో మాట్లాడి బీజేపీలో నాయకులకు పదవుల విషయంలో తగిన న్యాయం చేయాల్సి ఉందని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే కనుక కేంద్ర బీజేపీ అధినాయక్త్వం ఒక గురుతర బాధ్యతను అప్పగించింది. పొత్తులు సంగతి జాగ్రత్తగా చూసుకుంటూనే ఏపీలో బీజేపీని విస్తరించాలన్నది ఒక ఆదేశంగా ఉంది.
మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలలో పార్టీని మరింత బలంగా చేయాల్సి ఉంది. ఇక కూటమి అంటే చంద్రబాబు పవన్ లోకేష్ మాత్రమే కనిపిస్తున్నారు. ఇక మీదట బీజేపీ కూడా కనిపినాల్సి ఉంది. అలా ప్రభుత్వ విజయాలలో పాలనలో అంతా బీజేపీ ముద్ర పడాలని ఉంది. ఈ విధంగా అనేక అంశాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ కొత్త ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న వెంటనే మాధవ్ కూటమిలో త్రిమూర్తులుగా ఉన్న వారిని కలసి వచ్చారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆయన కలసి ఆయనతో బీజేపీ సహకారం కో ఆర్డినేషన్ మీద ఒక నమ్మకం కలిగించారు. అదే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని మంగళగిరిలోని ఆయన పార్టీ ఆఫీసులో కలసి ఆ పార్టీతో చెలిమి మరింతగా బలోపేతం చేసుకుంటామన్న సందేశాన్ని ఇచ్చారు. అంతే కాకుండా కూటమిలో అతి ముఖ్య నాయకుడిగా ఎదుగుతున్న నారా లోకేష్ ని సైతం కలసి మిత్ర బంధం పటిష్టం చేసుకున్నారు.
ఇలా కొత్త అధ్యక్షుడిగా మాధవ్ వేసిన తొలి అడుగులు అయితే ఆయనలో వ్యూహాత్మక వైఖరిని కో ఆర్డినేషన్ తో ముందుకు సాగాలన్న వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. ఇక మీదట ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా వేదిక మీద కనిపించేది ముగ్గురు కాదు నలుగురు అంటున్నారు. అలా బీజేపీ ముద్రను చూపిస్తారని చెబుతున్నారు. అంతే కాదు నామినేటెడ్ పదవులలో బీజేపీ వాటాను కూడా న్యాయంగా ధర్మంగానే వివాదాలు లేకుండా తీసుకునే ప్రయత్నం చేస్తారని అంటున్నారు. మరో వైపు చూస్తే కనుక కేంద్ర పెద్దలు చెప్పినట్లుగా పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసే విధంగా కూడా మాధవ్ తన ప్లాన్స్ తో ముందుకు వస్తారని అంటున్నారు.
