కాపులు ప్లస్ దళితులు : ఏపీలో కొత్త పార్టీ ?
ఏపీలో కొత్త పార్టీ రాబోతోందా. అది కూడా ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సీనియర్ పోలీస్ అధికారి పీవీ సునీల్ కుమార్ నాయకత్వంలో వస్తోందా.
By: Satya P | 3 May 2026 9:00 AM ISTఏపీలో కొత్త పార్టీ రాబోతోందా. అది కూడా ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సీనియర్ పోలీస్ అధికారి పీవీ సునీల్ కుమార్ నాయకత్వంలో వస్తోందా. అసలు ఏపీ రాజకీయాల్లో కొత్త పార్టీ ఏర్పాటు చేయాల్సిన అనివార్యత ఉందా. అందుకు రాజకీయ వాతావరణం కలసి వస్తుందా ఇవన్నీ ప్రశ్నలు. వీటికి జవాబు పీవీ సునీల్ కుమార్ ఒక టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పూర్తి క్లారిటీతో ఇచ్చారు. ఏపీలో తాను కొత్త పార్టీ చేస్తానా లేదా అన్నది భవిష్యత్తు నిర్ణయిస్తుంది అని ఆయన చెప్పడం విశేషం. తాను రాజకీయ పార్టీ ఏర్పాటు చేయను అని ఆయన ఎక్కడా చెప్పలేదు. అదే సమయంలో రాజకీయ పార్టీ ఏర్పాటు అవసరం ఉందనే అంటున్నారు.
దళితుల హితం కోసం :
దళితుల హితం తన అజెండా అని ఆయన చెప్పారు. దళితుల ఉద్ధరణ కోసం వారికి రాజకీయంగా సామాజికంగా ఆర్ధికంగా సముచితమైన స్థానం కోసం కొత్త రాజకీయం అవసరం అని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నుంచి దళితులు ఓటు వేసే వారుగానే ఉండిపోయారు తప్ప రాజ్యాంగబద్ధమైన పదవులు అందుకోలేకపోయారు అని ఆయన అన్నారు. ఈ రాష్ట్రలో ఎవరికి ఓటు వేసినా దళితుల స్థితిగతులు మారలేదని ఆయన చెప్పుకొచ్చారు. పదహారు శాతం పైగా ఓటు షేర్ కలిగిన దళితులకు రాజకీయ అధికారం తప్పనిసరిగా కావాల్సి ఉందని సునీల్ కుమార్ నొక్కి చెప్పారు.
ఎవరికీ బానిస కాను :
తాను ప్రధాన రాజకీయ పార్టీలలో చేరి వాళ్ళ నుంచి బీఫారం తీసుకుని బానిసగా మాత్రం బతకను అని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉందని అన్నారు. రాజకీయాలు డైనమిక్ అని ఎపుడు ఏమి జరుగుతుందో తెలియదు అన్నారు కాబట్టి తాను పార్టీ పెడతానా లేదా అన్నది వేచి చూడాలని అన్నారు. తాను రాజకీయ పార్టీ పెట్టడం వల్ల ఎవరికి నష్టం లాభం అన్నది తనకు అనవసరం అని సునీల్ కుమార్ చెప్పారు. దళితులు బాగుపడడమే తన లక్ష్యమని అదే తన టార్గెట్ అని కూడా నొక్కి చెప్పారు.
సామాజిక రాజకీయ మార్పు :
ఏపీ రాజకీయాల్లో సామాజిక రాజకీయ మార్పు రావాల్సి ఉందని సునీల్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో కాపులు పెద్ద సంఖ్యలో ఉన్నారని వారి తరువాతా అత్యధిక సంఖ్యలో దళితులు ఉన్నారని ఆయన చెప్పారు. ఈ రెండు సామాజిక వర్గాలు కలిస్తే కనుక యాభీ శాతం కంటే ఎక్కువ ఓటు బ్యాంక్ తమది అవుతుందని అన్నారు. ఆ దిశగా ప్రయత్నాలు అయితే సాగుతున్నాయని అన్నారు. అది తనతోనే కాదని 2005 నుంచి ఈ ఆలోచనలు ఉన్నాయని సునీల్ కుమార్ చెప్పడం విశేషం. సరైన సమయం వస్తే కచ్చితంగా ఈ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయని కూడా ఆయన ఆశాభావం గా చెప్పారు. మాల మాదిగల మధ్యన కూడా విభేదాలు లేవని ఇపుడు అంతా ఒక్కటిగానే ముందుకు వస్తున్నారని ఆయన చెప్పారు.
కాపులతో గొడవల్లేవు :
రాష్ట్రంలో కాపులకు దళితులకు మధ్య సామరస్య వాతావరణమే ఉందని సునీల్ కుమార్ చెప్పారు. ఒక చుండూరు ఒక కారంచేడు లాంటి ఘటనలు అయితే ఎక్కడ కాపులు చేయలేదని అన్నారు. చిన్న పాటి గొడవలు మాత్రమే ఉన్నాయని అవన్నీ పట్టించుకోవాల్సింది లేదని అన్నారు. ఏపీలో కాపులకు ఐకాన్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారని యాంకర్ గుర్తు చేసినపుడు సమయం వచ్చినపుడు ఎవరిని కలవాలో అందరినీ కలుస్తామని సునీల్ కుమార్ బదులిచ్చారు. దీనిని బట్టి చూస్తే ఫ్యూచర్ లో కాపులు ప్లస్ దళితులతో కొత్త పార్టీ రావచ్చు అన్న చర్చ అయితే సాగుతోంది.
