Begin typing your search above and press return to search.

సునీల్ కుమార్ కి టీడీపీ టికెట్....రఘురామ సంగతేంటి ?

తనకు దళితుల సంక్షేమం అన్నది అతి ముఖ్యమని ఆయన అన్నారు. వారి కోసమే తాను పోరాడుతున్నాను అని ఆయన చెప్పడం విశేషం.

By:  Satya P   |   3 May 2026 1:37 PM IST
సునీల్ కుమార్ కి టీడీపీ టికెట్....రఘురామ సంగతేంటి ?
X

ఏపీలో సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారిగా పీవీ సునీల్ కుమార్ ఒక వార్తా సంచలనంగా ఉన్నారు. ఆయన తనను సస్పెండ్ చేసిన దగ్గర నుంచి మరింత బిగ్గరగా గొంతు విప్పుతున్నారు. బేసికల్ గా ఆయన దళితులు అణగారిన వర్గాల కోసం పనిచేయాలన్న లక్ష్యంతో ఉన్నారు. ఇపుడు దానికి మరింతగా పదును పెడుతూనే తనను ఏపీ ఉప సభాపతి రఘురామ క్రిష్ణం రాజు వేధిస్తున్నారు టార్గెట్ చేశారు అని కూడా ఆరోపిస్తున్నారు. తాను రఘురామను ధీటుగా ఎదుర్కొంటాను అని చెబుతున్న పీవీ సునీల్ కుమార్ తాజాగా ఒక ప్రముఖ తెలుగు టీవీ చానల్ ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నారు. అందులో సంచలనం రేకెత్తించే విషయాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఇంటర్వ్యూలో ఆయన ఒక విషయం అయితే బయటపెట్టారు. 2024 ఎన్నికల్లో తనకు టీడీపీ టికెట్ ఆఫర్ చేసింది అని. దాంతో ఇపుడు అది టాప్ లెవెల్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అని అంటున్నారు.

ఆ రెండు పార్టీలూ ఆఫర్ :

తాను రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయాలంటే అది చాలా ఈజీ అని పీవీ సునీల్ కుమార్ చెప్పారు. ఏపీలో ఉన్న రెండు ప్రధాన పార్టీలు అయిన టీడీపీ వైసీపీ తనకు టికెట్ ని 2024 ఎన్నికల్లోనే ఆఫర్ చేశాయని ఆయన తాజాగా సంచలన ప్రకటన చేశారు. అంతే కాదు 2014, 2019లలో కూడా ఆ పార్టీలు తనకు టికెట్ ఇస్తామని ముందుకు వచ్చాయని సునీల్ కుమార్ చెప్పడం మరింత సంచలనంగా ఉంది. అయితే ఆ పార్టీల వైఖరి నచ్చనందువల్లనే తాను ఆఫర్లను తిరస్కరించాను అని సునీల్ కుమార్ చెప్పడం విశేషం.

వైసీపీ కోసం కాదు :

పీవీ సునీల్ కుమార్ అంటే వైసీపీకి దగ్గరగా ఉన్న అధికారి అని అంతా అనుకుంటారు. ఆయన 2019 నుంచి 2024 మధ్యలో ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన అధికారిగా పనిచేశారు. సీఐడీ వింగ్ కి అదనపు డీజీపీగా ఉండేవారు. ఎన్నో అధికారాలు ఆయన చేతిలో ఉన్నాయి. దాంతో సహజంగా ఆయనకు వైసీపీతో ఎంతో సాన్నిహిత్యం ఉందని అంతా భావిస్తూ వచ్చారు. అయితే తాజా ఇంటర్వ్యూలో సునీల్ కుమార్ దానిని పూర్తిగా ఖండించారు. తాను వైసీపీకి దగ్గర కాదని ఆయన స్పష్టం చేశారు.

నీలి రంగు కోటు దేనికి :

ఇక ఈ ఇంటర్వ్యూలో సునీల్ కుమార్ ధరించిన నీలిరంగు కోటును చూపిస్తూ వైసీపీకి దగ్గరగా ఉంటున్నారా అని యాంకర్ సునీల్ కుమార్ ని ప్రశ్నించారు. దానికి సునీల్ కుమార్ ఇచ్చిన ఆన్సర్ అయితే వైసీపీకి దిమ్మ దిరిగేలా ఉంది. తనది బాబా సాహెబ్ అంబేద్కర్ నీలి రంగు అని సునీల్ స్పష్టమైన వైఖరితో జవాబు చెప్పారు. అంతే తప్ప తన నీలి రంగుకూ వైసీపీకి ఏ మాత్రం సంబంధం లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చేశాఉరు. ఇక తాను 2024 ఎన్నికల్లో వైసీపీకి పనిచేయలేదని కూడా ఆయన మరో స్పష్టత కూడా ఇచ్చారు.

దళితు కోసమే పోరాటం :

తనకు దళితుల సంక్షేమం అన్నది అతి ముఖ్యమని ఆయన అన్నారు. వారి కోసమే తాను పోరాడుతున్నాను అని ఆయన చెప్పడం విశేషం. తన ఏకైక అజెండా అదే అని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే సునీల్ కుమార్ తాను స్వయంగా అంబేద్కర్ ఇండియా మిషన్ ని స్థాపించారు. దాని ద్వారానే రాజకీయంగా ఆయన తన ఆలోచనలను సమాజంలో పంచుకుంటున్నారు. రాష్ట్రంలో దళితులు కాపులు కలసి రాజ్యాధికారం పంచుకోవాలని సునీల్ కుమార్ కోరుతున్నారు. అదే ఆయన కొత్త ఐడియాలజీ గా ఉంది. అందువల్ల ప్రస్తుతం ఉన్న పార్టీల విషయంలో ఆయన స్పందించడం లేదని అంటున్నారు. ఆయనే సరైన సమయంలో కొత్త పార్టీని ప్రకటించాలని కూడా ఆసక్తిగా ఉన్నారని చర్చ సాగుతోంది.

రఘురామ వర్సెస్ సునీల్ :

ఇక సునీల్ కుమార్ రఘురామను కస్టడీలో ఉన్నపుడు హింసించారు అన్నది ఒక ప్రధాన అభియోగం. వైసీపీ రెబెల్ ఎంపీగా రఘురామ ఉన్నపుడు ఆయన్ని సీఐడీ అరెస్ట్ చేసి గుంటూరు తీసుకుని వచ్చింది. ఆ సమయంలో తనను సునీల్ హింసించారు అని ఇదంతా జగన్ ని సంతోషపరచడానికే అని రఘురామ పలు సందర్భాల్లో ఆరోపించారు. దాని మీదనే కేసులు కూడా నడుస్తున్నాయి. ఇవన్నీ ఇలా ఉంచితే టీడీపీలో అప్పటికే చేరిన రఘురామ ఉండగా ఆయన తీవ్రంగా వ్యతిరేకించే సునీల్ కుమార్ కి టీడీపీ పెద్దలు టికెట్ ఆఫర్ చేశారా అన్న చర్చ అయితే ఇపుడు వస్తోంది.

అది సాధ్యమా :

తెలుగుదేశం పార్టీ కూడా వైసీపీని విమర్శించే క్రమంలో ఆనాటి పోలీసు అధికారుల తీరుని తప్పు పట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక తమ వైపు ఉన్న రఘురామకు గిట్టని సునీల్ కుమార్ కి టికెట్ ఇచ్చి టీడీపీ ప్రోత్సహిస్తుందా అన్నది కూడా మరో చర్చ. అయితే సునీల్ కుమార్ తనకు రెండు పార్టీల నుంచి టికెట్ ఆఫర్ ఉందని చెప్పడం ద్వారా రఘురామను మరింత ఇరిటేట్ చేయడానికి వేసిన ఎత్తుగడ అన్న మరో చర్చ కూడా ఉందని అంటున్నారు. ఇప్పటికే సునీల్ కుమార్ మీద దర్యాప్తు ఆలస్యం కావడం పట్ల రఘురామ కూటమి ప్రభుత్వం పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో సునీల్ కుమార్ వేసిన ఈ బాణం ట్రిపుల్ ఆర్ కి నేరుగా గుచ్చుకునేలా ఉంది అని అంటున్నారు. నిజంగా సునీల్ కుమార్ కి టికెట్ ఇచ్చే ప్రతిపాదన కనుక అప్పట్లో ఉంటే రఘురామ మరింతగా అసంతృప్తికి గురి అయ్యే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.