Begin typing your search above and press return to search.

దళిత క్రిస్టియన్లు...బిగ్ డిబెట్ కి తెర తీసిన సునీల్!

ఇక అంటరాని తనం అన్నది భౌతికంగా ఈ రోజున కొంత మాయం అయింది కానీ అది వేరే రూపంలో ఉందని సునీల్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు.

By:  Satya P   |   3 May 2026 7:00 PM IST
దళిత క్రిస్టియన్లు...బిగ్ డిబెట్ కి తెర తీసిన సునీల్!
X

దళితులుగా ఉంటేనే వారికి హక్కులు ఉంటాయని రాజ్యాంగం చెబుతోంది. అదే మతం మారితే వారి దళుతుల పేరు మీద ఉండే హక్కులను కోల్పోతారు అని ఇటీవల ఒక కేసులో వచ్చిన తీర్పులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దేశంలో దాని మీద చర్చ సాగుతోంది. దళితుల పక్షాన మాట్లాడుతున్న ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ దీని మీద బిగ్ డిబేట్ కి తెర తీశారు. ఆయన చరిత్ర పూర్వాపరాలు తవ్వి తీస్తూ చర్చికి వెళ్తే క్రిస్టియన్లు అయిపోతారా అని సూటిగా ప్రశ్నను సంధించారు.

చర్చి తలుపులు తెరిచారు :

దేవాలయాలలో ప్రవేశం దళితులకు లేని నాడే చర్చిలలో వారికి తలుపులు తెరిచారు అని గతాన్ని గుర్తు చేశారు. హిందూ మతంలో ఉన్న అంటరాని తనం మీద విసిగి వేసారి దళితులు చర్చిలకు వెళ్ళారే తప్ప వారు దళితులు కాకుండా ఎక్కడికి పోతారు అని ఆయన అంటున్నారు. దళితులుగానే వారు ఎప్పటికీ ఉంటారని వాదిస్తున్నారు. వాళ్ళు ఎస్సీలు కాదు అనడం తప్పు అని అంటున్నారు. ఇంట్లో ఏసు క్రెస్తు ఫోటో ఉంటే క్రిస్టియనా అని ఆయన ప్రశ్నించారు. దీని మీద ఉప సభాపతి రఘురామ క్రిష్ణం రాజు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండిస్తూ దళితుల పక్షాన తాము పోరాడుతామని అన్నారు.

క్రిస్టియన్లలో కులాలు :

ఇక మరో సందర్భంగా రఘురామ మాట్లాడుతూ క్రిస్టియానిటీలో కులాలు లేవని అన్నారు. అంతే కాదు తమ నియోజకవర్గం ఆకివీడులో ఎస్సీలు ఎక్కడ ఉన్నారని అంతా క్రిస్టియన్లే అన్నారు. ఆ మతంలోకి వెళ్లాక ఇక దళితులు అన్న ప్రస్తావన ఎందుకు ఉంటుందని కూడా ఆయన ప్రశ్నించారు. దానికి తాజా ఇంటర్వ్యూలో కౌంటర్ చేసిన సునీల్ కుమార్ క్రిస్టియానిటీలో కులాలు లేవనడం తప్పు అని అన్నారు. కులాలు ఉన్నాయని ఆయన వాదించారు. అంతే కాదు దళితులు చర్చిలకు వెళ్ళి ఏసుని ప్రార్ధించినంత మాత్రాన వారి పుట్టుక నుంచి దళితులు అయినది ఎక్కడా పోదని వారికి ఆ హక్కులు ఎప్పటికీ ఉంటాయని స్పష్టం చేస్తున్నారు.

అంటరానితనం కొత్త రూపు :

ఇక అంటరాని తనం అన్నది భౌతికంగా ఈ రోజున కొంత మాయం అయింది కానీ అది వేరే రూపంలో ఉందని సునీల్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. ఆర్థికంగా రాజకీయంగా ఇతరత్రా దళితులను ఎదగనీయకుండా అడ్డుకుంటున్నారు అని ఆయన మండిపడ్డారు. బడా కాంట్రాక్టర్లుగా పారిశ్రామికవేత్తలుగా దళితులు ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు. దళితులకు ఆ అవకాశాలు రాకుండా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

గొంతాలమ్మ గుడి ఉంది :

ఆకివీడులో గుంతాలమ్మ గుడి మాత్రమే ఉందని దానికి కూడా పురాణాలలో ప్రాశస్త్యం ఉందని సునీల్ కుమార్ చెప్పారు. నందీశ్వరుడు సాధారణంగా శివుడి కోవెలలో ఉంటారని అలాగే గుంతాలమ్మ అమ్మవారి కోవెలలో కూడా నంది విగ్రహం ఉందని ఆయన చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రామాలయంలో నంది విగ్రహం ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఆకివీడులో ప్రభుత్వ స్థలంలో మత పరమైన కట్టడాలు నిర్మించడం రాజ్యాంగం విరుధ్ధం అని అన్నారు. రఘురామ తన ఇమేజ్ ని మార్చుకోవడానికే ఈ విధంగా రామాలయ నిర్మాణం మీద ఫోకస్ పెట్టారని అన్నారు. ఆయన మీద ఎవరూ దాడి చేయలేదని ఆయనే రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మొత్తం మీద చూస్తే రఘురామ వర్సెస్ సునీల్ కుమార్ ఇష్యూ కాస్తా కస్టడీలో హింసించారు అన్న దాని నుంచి మొదలై, ఆకివీడు రామాలయం ఇష్యూ వైపుగా మారి ఇపుడు ఏపీలో దళితులకు రాజ్యాధికారం అంటూ పీవీ సునీల్ కొత్త నినాదం అందుకోవడం దాకా వచ్చిందని అంటున్నారు. చూడాలి మరి ఈ పరిణామాలు ఏ విధమైన దారి తీసుకుంటాయో.