Begin typing your search above and press return to search.

ఐపీఎస్ సునీల్ కుమార్ కు బిగ్ షాక్.. సస్పెన్షన్ పై ప్రభుత్వం అనూహ్య నిర్ణయం

సీనియర్ పోలీసు అధికారి పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

By:  Tupaki Political Desk   |   22 Feb 2026 6:28 PM IST
ఐపీఎస్ సునీల్ కుమార్ కు బిగ్ షాక్.. సస్పెన్షన్ పై ప్రభుత్వం అనూహ్య నిర్ణయం
X

సీనియర్ పోలీసు అధికారి పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న సునీల్ కుమార్ కు గట్టి షాక్ ఇచ్చింది. ఆయనపై నమోదైన కేసుల విచారణ పూర్తయ్యే వరకు లేదా రిటైర్మెంట్ వరకు సస్పెన్షన్ ను పొడిగించింది. ఈ రెండింటిలో ఏది ముందు జరిగితే అంతవరకు సునీల్ కుమార్ సస్పెన్షన్ లోనే ఉండనున్నారు. దీంతో సర్వీసులో మళ్లీ యూనిఫాం ధరించే అవకాశాలు దాదాపు కనుమరుగు అయినట్లే అంటున్నారు. గత ప్రభుత్వంలో పోలీసు శాఖలో అంతులేని అధికారాలు చెలాయించిన సీనియర్ అధికారి సునీల్ కుమార్ కెరీర్ ఇలా ముగుస్తుందని ఎవరూ ఊహించలేదని అంటున్నారు.

సీనియర్ పోలీసు అధికారి పీ.వీ.సునీల్ కుమార్ సస్పెన్షన్ ను పొడిగిస్తూ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ లోనే ఆయన కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టేవిధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఏ పోలీసు అధికారి ఇలా సస్పెన్షన్ లో కెరీర్ ముగించాల్సిన పరిస్థితి తెచ్చుకోలేదని అంటున్నారు. గత ప్రభుత్వంలో సీనియర్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సైతం ఇలా సస్పెన్షన్ లోనే కెరీర్ ముగించాల్సిన పరిస్థితుల్లో ఆయన న్యాయపోరాటం ద్వారా రిటైర్మెంట్ కు ఒక్క రోజు ముందు విధుల్లో చేరి సర్వీసులో ఉండగానే రిటైర్ అయ్యారని గుర్తు చేస్తున్నారు. కానీ, సునీల్ కుమార్ విషయంలో ఆ పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు.

సునీల్ కుమార్ పై అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసును ప్రభుత్వ వర్గాలు సీరియస్ గా తీసుకున్నాయి. అంతేకాకుండా అగ్రిగోల్డ్ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతోపాటు ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారనే ఆరోపణలపై సునీల్ కుమార్ పై అభియోగాలు నమోదు చేసింది. అంతేకాకుండా ఆయనపై విచారణకు ఆదేశాలిచ్చిన ప్రభుత్వం 2024 అక్టోబరులో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి ప్రతి ఆరు నెలలకు సస్పెన్షన్ ను పొడిగిస్తూ వస్తోంది.

ప్రభుత్వం తాజా ఉత్తర్వుల మేరకు సునీల్ కుమార్ కెరీర్ దాదాపు క్లోజ్ అయినట్లే అంటున్నారు. 1993 బ్యాచ్ కు చెందిన సునీల్ కుమార్ రాష్ట్రంలో అత్యంత సీనియర్. ఈ ఏడాది నవంబరు 30న ఆయన రిటైర్ కావాల్సివుంది. దాదాపు 33 ఏళ్లపాటు పోలీసు శాఖలో వివిధ హోదాల్లో సునీల్ కుమార్ పనిచేశారు. కెరీర్ చివర్లో తీవ్ర వివాదాల్లో చిక్కుకుని అత్యంత అవమానకరంగా కెరీర్ ను ముగించాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారని అంటున్నారు. వాస్తవానికి ప్రభుత్వ సర్వీసులో ఉన్న ఉద్యోగులను ఆరు నెలల వరకు సస్పెండ్ చేస్తుంటారు. ఈ ఆరు నెలలోగా విచారణ పూర్తి చేసి పోస్టింగులు ఇస్తుంటారు.

కానీ, రాష్ట్రంలో కొన్నేళ్లుగా నెలకొన్న రాజకీయ పరిస్థితుల వల్ల టార్గెట్ లో ఉన్న ఉద్యోగుల సస్పెన్షన్ ను ఆరు నెలలకు మించి పొడిగిస్తూ వస్తున్నారు. గతంలో ఏబీవీ, తాజాగా సునీల్ కుమార్ సస్పెన్షన్ లను ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఏబీవీని రిటైర్మెంట్ రోజు తప్ప మిగిలిన టైంలో ఒక్క రోజు కూడా యూనిఫాం వేయించలేదని అంటున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా సునీల్ కుమార్ పై అదేవిధమైన చర్యలను తీసుకుంటున్నారని అంటున్నారు. సునీల్ కుమార్ పై నమోదైన క్రిమినల్ కేసులను ఆరు నెలల్లో విచారించే పరిస్థితి కనిపించడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఆయన సర్వీసు సస్పెన్షన్ లోనే ముగించాల్సివస్తుందని అంటున్నారు. మొత్తానికి రాష్ట్రంలో రాజకీయాల వల్ల సీనియర్ పోలీసు అధికారులు కెరీర్ పరంగా ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు.