ఒక్కో మహిళ 8 అంతకు మించి పిల్లల్ని కనాలన్న పుతిన్
సంచలన వ్యాఖ్య చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర పుతిన్. తమ దేశంలోని మహిళలు ఎనిమిది అంతకు మించిన పిల్లల్ని కనాలని తాజాగా ఆయన సూచించారు.
By: Tupaki Desk | 2 Dec 2023 4:43 AM GMTసంచలన వ్యాఖ్య చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర పుతిన్. తమ దేశంలోని మహిళలు ఎనిమిది అంతకు మించిన పిల్లల్ని కనాలని తాజాగా ఆయన సూచించారు. పెద్ద కుటుంబాలుగా మార్చాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఇలా చేయటంద్వారా దేశ జనాభాను పెంచే వీలుందని అభిప్రాయపడ్డారు. కొద్దిరోజుల క్రితం రష్యారాజధాని మాస్కోలో జరిగిన ఒక సమావేశంలో పాల్గొన్న ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
1990 తర్వాత రష్యాలో జననాల రేటు పడిపోయిందని.. ఈ మధ్యన మొదలైన ఉక్రెయిన్ వార్ కారణంగా భారీ ప్రాణనష్టం జరిగిందని.. రాబోయే రోజుల్లో రష్యా జనాభాను పెంచటమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ఇందుకు దేశ మహిళలు ఇక నుంచి ఎనిమిది అంతకు మించిన పిల్లల్ని కనాల్సిన అవసరం ఉందన్నారు. పాత తరంలోని వారు నలుగురైదుగురు పిల్లల్ని కనేవారని.. దీంతో సమాజం బలంగా ఉండేదన్నారు.
‘‘మన అమ్మమ్మలు.. నానమ్మలకు ఎనిమిది మంది పిల్లలు ఉండేవారన్నది గుర్తుంచుకోండి. ఈ సంప్రదాయాన్ని కాపాడుకుందాం. పెద్ద కుటుంబాలు దేశంలో రావాలి. భవిష్యత్తు తరాలకు రష్యా జనాభాను పెంచటమే లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇది రష్యాను ప్రపంచంలో బలమైన దేశంగా నిలబెడుతుంది’’అంటూ వ్యాఖ్యానించారు.
ఉక్రెయిన్ యుద్దం కారణంగా పశ్చిమ దేశాలు విధించిన తీవ్రమైన ఆంక్షల కారణంగా రష్యా తీవ్రమైన కార్మికుల కొరతను ఎదుర్కొంటోంది.దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనానికి కారణమవుతోంది. ఇలాంటి వేళ.. పుతిన్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఉక్రెయిన్ యుద్ధంలో భారీప్రాణనష్టం వాటిల్లిందని చెబుతున్న పుతిన్.. దానికి కారణం తానేనన్న విషయాన్ని మాత్రం వదిలేయటం గమనార్హం.