Begin typing your search above and press return to search.

నేటి నుంచి 3 రోజులు రష్యా అధ్యక్ష ఎన్నికలు.. ఐదోసారి పుతినే అధ్యక్షులు!

2000లో తొలిసారి అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకున్న ఆయన.. 2008లో ప్రధానిగా సేవలు అందించారు.

By:  Tupaki Desk   |   15 March 2024 4:32 AM GMT
నేటి నుంచి 3 రోజులు రష్యా అధ్యక్ష ఎన్నికలు.. ఐదోసారి పుతినే అధ్యక్షులు!
X

వ్లాదిమిర్ పుతిన్.. ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన.. అక్కడి నిబంధనల్ని మార్చేసి మరీ రికార్డు స్థాయిలో నాలుగోసారి అధ్యక్షుడిగా ఎంపికైన ఆయన.. మరోసారి అద్యక్ష పదవిని సొంతం చేసుకోనున్నారు. ఈ రోజు (శుక్రవారం) నుంచి మూడు రోజుల పాటు అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. పోలింగ్ వేళలోనే ఫలితం ఫైనల్ కావటమే కాదు.. ఐదోసారి అధ్యక్షుడిగా పుతిన్ పదవీ బాధ్యతల్ని చేపడతారని చెబుతున్నారు. ఎన్నికల ఫలితం ఇదే అవుతుందని తేల్చేయటం గమనార్హం.

రష్యా చరిత్రలో మొదటిసారి దేశ అధ్యక్షుడి ఎన్నికలు మూడు రోజులు జరగనున్నాయి. ఈ రోజు (మార్చి 15)తో మొదలయ్యే ఎన్నికలు మార్చి 17 వరకు సాగనున్నాయి. ఉక్రెయిన్ లోని నాలుగు రీజియన్ లను రష్యా అక్రమించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలోనూ అధ్యక్ష ఎన్నికను నిర్వహిస్తున్న నేపథ్యంలో.. మూడు రోజుల పాటు పోలింగ్ ను నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు పుతిన్ నాలుగుసార్లు దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

2000లో తొలిసారి అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకున్న ఆయన.. 2008లో ప్రధానిగా సేవలు అందించారు. ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ గత నెలలో జైల్లో ప్రాణాలు విడవటం.. ఆయన మరణం అనుమానాస్పదంగా ఉన్న నేపథ్యంలో ఫలితం ప్రతికూలంగా వస్తుందన్న అంచనాలు కొన్ని వినిపిస్తున్నా.. అందులో పస లేదని.. ఐదోసారీ పుతినే రష్యా అధ్యక్షుడిగా ఎంపిక అవుతారని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.

ఎన్నికల్లో పుతిన్ ను ఓడిస్తామంటూ విపక్షాలు పట్టుదలతో ఉన్నాయి. అందులో లిబరల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ రష్యా తరఫు అభ్యర్థిగా ఉన్న లియోనిడ్ స్లట్ స్కీ.. న్యూ పీపుల్ పార్టీ అభ్యర్థిగా ఉన్న వ్లాదిస్లేవ్ దవాన్ కోవ్.. కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా నికోలే ఖరిటోనోవ్ లు ఉన్నారు. అయితే.. దేశ ఓటర్లలో పుతిన్ కు 75 శాతం మద్దతు ఉందని.. ఈ ముగ్గురిలో తలో 5 శాతం ఓట్లకు మించి రావన్న మాట బలంగా వినిపిస్తోంది.

తాజా ఎన్నికల్లో పుతిన్ ఫోకస్ మొత్తం తాను ఆక్రమించిన ఉక్రెయిన్ రీజియన్ లో తన పార్టీనే గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు. అందుకోసం ఆయా ప్రాంతాల మీద ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. రష్యా భూభాగంలో పుతిన్ మెజార్టీ ఖాయమని తేలిపోయిన వేళ.. ఇప్పుడు ఆయన చూపంతా తాను అక్రమించుకున్న ఉక్రెయిన్ రీజియన్ లోనూ తన మెజార్టీని సాధించాలని తపిస్తున్నారు. తాజా ఎన్నికల్లో 11.42 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. అర్హులైన ఓటర్లు విదేశాల్లో ఉన్నా.. ఓటేయొచ్చు. మార్చి 19నాటికి తొలి దఫా ఫలితం వెల్లడి కానుంది. పూర్తి ఫలితాలు వెల్లడి కావటానికి మార్చి 29 వరకు ఆగాల్సిందే.

ఇక్కడే మరో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. అదేమంటే రష్యా చట్టాల్ని మార్చేసిన పుతిన్.. దేశాధ్యక్షుడిగా సాగుతున్నారు. మరో రెండు సార్లు దేశ అధ్యక్షుడిగా కొనసాగేందుకు వీలుగా చట్టం చేశారు పుతిన్. ఇందులో భాగంగా ఈసారి గెలిచి.. 2030లో గెలిస్తే 2036 వరకు పుతిన్ దేశాధ్యక్షుడిగా కొనసాగుతారు. అదే జరిగితే రష్యా పాలకుడు జోసెఫ్ స్టాలిన్ తర్వాత రష్యాను సుదీర్ఘంగా పాలించిన నేతగా పుతిన్ రికార్డును క్రియేట్ చేస్తారు. ఇంతకూ రష్యన్లలో పుతిన్ మీద నిజంగానే క్రేజ్ ఉందా? అంటే మాత్రం ఆ ఒక్కటి మాత్రం అడగొద్దన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది.